ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఇండియన్స్‌కు అలెర్ట్

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఇండియన్స్‌కు అలెర్ట్

ఉక్రెయిన్ పై రష్యా యుద్దం మొదలై 11 రోజులవుతోంది. ఓ వైపు శాంతి చర్చల ప్రయత్నాలు.. మరో వైపు భీకర యుద్ధం సాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ లో బాంబులతో, క్షిపణులతో దాడులకు పాల్పడుతున్న రష్యా ఇప్పటికే పలు సిటీలను హస్తగతం చేసుకుంది. అయితే ఈ కల్లోల పరిస్థితుల మధ్య చిక్కుకుపోయిన ఇండియన్స్ ను కేంద్ర ప్రభుత్వం వేగంగా తరలిస్తోంది. ప్రతి ఒక్క భారత పౌరుడిని, విద్యార్థులను అక్కడి నుంచి స్వదేశానికి తీసుకొచ్చేందుకు ‘ఆపరేషన్ గంగ’ పేరుతో యుద్ధ ప్రాతిపదికన పని చేస్తోంది. ఉక్రెయిన్ లో మన వాళ్లు సుమారు 20 వేల మంది వరకూ ఉండగా.. అందులో దాదాపు 13,500 మందిని ఇప్పటికే భారత్ కు చేర్చింది. మరో నాలుగైదు వేల మందికి పైగా ఉక్రెయిన్ సరిహద్దు దాటి పొరుగు దేశాలకు చేరుకున్నారు. అయితే ఇంకా ఆ యుద్ధ కల్లోలం మధ్య నుంచి బయటపడలేక అక్కడే చిక్కుకున్న భారత పౌరులు ఎవరైనా ఉంటే తక్షణం వారి వివరాలతో గూగుల్ ఫామ్ ను ఫిల్ చేయాల్సిందిగా ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ కోరింది. ఈ గూగుల్ ఫామ్ ను ఎంబసీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

ఈ వివరాలు ఫిల్ చేయాలి

ఇంకా ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి చేర్చేందుకు మోడీ సర్కారు మరో అలెర్ట్ జారీ చేసింది. అక్కడ ఉన్న మన విద్యార్థులు, పౌరులు తమ వివరాలతో ఒక గూగుల్ ఫామ్ ను నింపాల్సిందిగా ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ సూచించింది. ఉక్రెయిన్ లో ఉన్నవ్యక్తి పేరు, వయసు, మెయిల్ ఐడీ, పాస్ పోర్ట్ నంబర్, ఉక్రెయిన్ లో వారు ఉన్న సిటీ పేరు, ప్రస్తుతం ఉన్న లొకేషన్, ఉక్రెయిన్ లో వాడుతున్న ఫోన్ నంబర్, ఇండియాలో వారికి సంబంధించిన వ్యక్తి ఫోన్ నంబర్, ఇంకా ఆ వ్యక్తితో ఒకే చోట ఎక్కువ మంది ఉంటే వారి సంఖ్యను గూగుల్ ఫామ్ లో పొందుపరచాలి. ఈ వివరాల ఆధారంగా వారిని గుర్తించి స్వదేశానికి తీసుకురానున్నట్లు ఎంబసీ తెలిపింది.

మరిన్ని వార్తల కోసం..

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

మెస్‌లో కాల్పులు.. ఐదుగురు బీఎస్ఎఫ్ జవాన్ల మృతి

ఈ కిచెన్ లో రోజుకు 18 వేల మందికి వంట చేయొచ్చు