మెట్రో నగరాల్లో రియల్టీ క్రాష్.. కనీసం బాల్కనీ కూడా లేని అపార్ట్మెంట్ రూ.2 కోట్లుపై ఆగ్రహం..!

మెట్రో నగరాల్లో రియల్టీ క్రాష్.. కనీసం బాల్కనీ కూడా లేని అపార్ట్మెంట్ రూ.2 కోట్లుపై ఆగ్రహం..!

Real Estate: ప్రస్తుతం దేశంలోని చాలా నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకాయి. దీంతో ప్రజలు కూడా రియల్టీ సంస్థలకు బుద్ధి చెప్పేందుకు తాము ఇల్లు కొనబోమని.. అసలు తమకు సొంత ఇల్లు అక్కర్లేదు అన్నట్లు నటిస్తున్నారని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే దేశంలోని మెట్రో నగరాల్లో ప్రజల నుంచి వస్తున్న అధిక ధరలపై తిరుగుబాటు రేట్లను పడిపోయేలా చేస్తోందని కాయిన్ స్విచ్ సహ వ్యవస్థాపకుడు ఆశిష్ సింఘాల్ అన్నారు. కనీసం బాల్కనీ కూడా లేకుండా ఒక 2BHK ఫ్లాట్ రూ.2 కోట్లకు అమ్మటంపై ప్రజలు తమ తిరుగుబాటును ప్రకటించారని అన్నారు సింఘాల్. పైగా సగం జీతం ఆ అపార్ట్మెంట్ల ఈఎంఐల చెల్లింపులకే పోవటం ప్రజలను ఇల్లు కొనాలనే ఆలోచనకు దూరం చేస్తోందని చెప్పారు. 

అలాగే తాజా డేటా ప్రకారం దేశంలోని పెద్ద నగరాల్లో గడచిన క్వార్టర్లో అమ్మకాలు 19 శాతం పడిపోయినట్లు వెల్లడైంది. 2021 తర్వాత అమ్మకాలు ఈ స్థాయికి పడిపోవటం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. దేశ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ ఎన్సీఆర్ లలో అమ్మకాలు అత్యధికంగా 23 శాతం తగ్గగా.. తర్వాత ఉన్న ముంబై, బెంగళూరులో 15 శాతం తగ్గినట్లు తేలింది. రోజురోజుకూ పెరిగిపోతున్న రియల్ ఎస్టేట్ రేట్లపై ఆగ్రహంగా ఉన్న ప్రజలు అమ్మకాలు పడిపోవటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తీరు కొనసాగించాలి ప్రజలు అంటూ రెడిట్ వేదికగా చాలా మంది పోస్టులు పెట్టడం సంచలనంగా మారింది.

ALSO READ : రెంట్ పేరుతో 12.75 లక్షలకు టోకరా ...

ముంబై నగరంలో కనీసం ఒక సింగిల్ బెడ్ రూం ఉన్న ఇల్లు రేటు రూ.కోటి 50లక్షలుగా ఉండటంతో ఒక జనరేషన్ పూర్తిగా సొంత ఇంటి కలకు దూరం అయ్యేలా రియల్టర్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సింఘాల్ తన లింక్డిన్ పోస్టులో చెప్పారు. అందుకే ప్రజలు ఈ దోపిడీని అడ్డుకునేందుకు అసలు తమకు ఇల్లు అక్కర్లేదు అన్నట్లు బేరసారాలు కూడా ఆపేశారని అన్నారు. 

మెుత్తానికి మార్కెట్లలో కొనుగోళ్లు పడిపోవటంతో కొత్త ప్రాజెక్టుల లాంచ్ భారీగా తగ్గటంతో పాటు కొత్త ఇళ్ల సప్లై 30 శాతం పడిపోయిందని తేలింది. అలాగే అమ్ముడుపోని యూనిట్ల వల్ల ప్రతినెల డెవలపర్లకు భారంగా మారి ధరలను తగ్గిస్తారని సింఘాల్ చెప్పారు. హైదరాబాద్ నగరంలో కూడా అమ్మకాలో గత ఏడాది మెుదటి అర్థభాగంతో పోల్చితే 6 శాతం నెగటివ్ గా ఉన్నట్లు రిపోర్ట్ చెప్పింది. చాలా మంది తమ వద్ద డబ్బు ఉన్నా ధరల తగ్గుదల కోసం వేచి చూస్తున్నారని.. ప్రజలు గుడ్డిగా గతంలో మాదిరిగా రియల్ ఎస్టేట్ సంస్థల మాటలకు పడిపోవటం లేదని సింఘాల్ అంటున్నారు.