దేశంలోనే అతిపెద్ద కార్ల దొంగ అరెస్ట్

దేశంలోనే అతిపెద్ద కార్ల దొంగ అరెస్ట్
  • నిందితుడిపై ఇప్పటివరకు180 కేసులు నమోదు

న్యూఢిల్లీ: అతనొక సాధారణ ఆటో డ్రైవర్. వచ్చే ఆదాయం విలాసాలకు సరిపోవట్లేదని కార్లను చోరీ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 27 ఏండ్లలో 5 వేలకు పైగా కార్లను దొంగతనం చేశాడు. ఆ డబ్బుతో జల్సా జీవితం మొదలుపెట్టాడు. రాజకీయ నాయకుల అండతో కాంట్రాక్టరుగా మారాడు. ఆయుధాల స్మగ్లింగ్ చేశాడు. చివరకు ఢిల్లీ పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. ఆటోడ్రైవర్ గా పనిచేసే ఢిల్లీలోని ఖాన్‌‌పూర్ ప్రాంతానికి చెందిన అనిల్ చౌహాన్‌‌(52) 1995 నుంచి చోరీలకు అలవాటుపడ్డాడు. అలా 5 వేలకు పైగా కార్లను దొంగిలించి.. దేశంలోనే అతిపెద్ద కార్ల దొంగగా మారాడు.

ఆ కార్లను నేపాల్, కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు తరలించి సంపాదించిన డబ్బుతో ఢిల్లీ, ముంబై తదితర రాష్ట్రాల్లో ఆస్తులు కొన్నాడు. ఆపై అస్సాంకు మకాం మార్చి ప్రభుత్వ కాంట్రాక్టర్‌‌గా మారాడు. ఒక ముఠాను ఏర్పరుచుకుని యూపీ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు ఆయుధాల స్మగ్లింగ్‌‌ మొదలు పెట్టాడు. పక్కా సమాచారంతో నిందితుడిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. అతనిపై ఇప్పటికే 180 కేసులున్నాయని చెప్పారు. అనేకసార్లు అరెస్టయిన అనిల్..2015లో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేతో కలిసి ఐదేండ్లపాటు జైలు జీవితం గడిపి 2020 లో విడుదలయ్యాడని, నిందితుడికి ముగ్గురు భార్యలు, ఏడుగురు పిల్లలు ఉన్నారని పోలీసులు చెప్పారు.