
- 2024–25 లో రూ.23,622 కోట్లకు.. గత పదేళ్లలో 34 రెట్ల వృద్ధి
- 2029 నాటికి రూ.50 వేల కోట్ల ఎగుమతులు సాధిస్తామన్న డిఫెన్స్ మినిస్ట్రీ
న్యూఢిల్లీ: ఇండియా డిఫెన్స్ ఎగుమతులు గత పదేళ్లలో 34 రెట్లు పెరిగాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.23,622 కోట్లకు చేరాయి. దేశ డిఫెన్స్ ఎగుమతులు 2013–-14 లో రూ.686 కోట్లుగా నమోదయ్యాయి. ఆపరేషన్ సిందూర్ గ్రాండ్ సక్సెస్ సాధించింది. దీంతో స్వదేశీ బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్స్, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్స్, డీ4 యాంటీ-డ్రోన్ సిస్టమ్స్‌కు గ్లోబల్‌గా మంచి పేరు దక్కింది. చాలా దేశాలు వీటిని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ముఖ్యంగా బ్రహ్మోస్, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ కోసం ఇప్పటికే ఇండియాతో చర్చలు జరుపుతున్నాయి.
బ్రెజిల్, ఫిలిఫ్పీన్స్, మలేషియా వంటి దేశాలు ఇండియా నుంచి డిఫెన్స్ ప్రొడక్ట్‌లను కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నాయి. దీంతో 2029 నాటికి ఇండియా డిఫెన్స్ ఎగుమతులు రూ.50 వేల కోట్లకు చేరుకుంటాయని అంచనా. "భారత్ దాదాపు 80 దేశాలకు డిఫెన్స్ ప్రొడక్ట్‌లను ఎగుమతి చేస్తోంది. 2029 నాటికి రూ.50 వేల కోట్ల టార్గెట్‌ను చేరుకుంటాం. గ్లోబల్‌గా డిఫెన్స్ ఎగుమతుల్లో మన స్థానాన్ని బలోపేతం చేసుకుంటాం" అని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎక్స్‌లో పేర్కొంది.
రక్షణ ఎగుమతుల్లో రికార్డు గ్రోత్
భారత రక్షణ ఎగుమతులు ఆల్-టైమ్ హై లెవెల్ అయిన రూ.23,622 కోట్లకు (సుమారు 2.76 బిలియన్ డాలర్లకు) చేరాయి. ఇది 2023–24 లో రూ.21,083 కోట్లుగా ఉంది. 12 శాతం గ్రోత్ నమోదైంది. కేంద్రం తీసుకొచ్చిన 'ఆత్మనిర్భర్ భారత్' ఇనీషియేటివ్ కింద డిఫెన్స్ ఎగుమతులు రికార్డ్ లెవెల్‌కు చేరాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. "భారత డిఫెన్స్ సెక్టార్ ఎప్పుడూ లేనంత బలంగా పెరుగుతోంది" అని ఆయన పేర్కొన్నారు. డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (డీపీఎస్‌యూలు) ఎగుమతులు 42.85 శాతం పెరిగాయని, భారత రక్షణ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఆమోదం లభిస్తోందని అన్నారు.
పాలసీ సంస్కరణలు..
2024-–25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 1,762 ఎగుమతి ఆథరైజేషన్స్ జారీ చేసింది. ఇది అంతకు ముందు ఆర్థికసంవత్సరంతో పోలిస్తే 16.92 శాతం ఎక్కువ. ఎగుమతిదారుల సంఖ్య కూడా సుమారు 17.4 శాతం పెరిగింది. ఆయుధాలు, మందుగుండు సామగ్రి, కాంపోనెంట్స్, సబ్‌సిస్టమ్స్‌తో సహా దాదాపు 80 దేశాలకు భారత్ ఎగుమతి చేసింది. 2029 నాటికి 50 వేల కోట్ల రూపాయల ఎగుమతి టార్గెట్‌తో ప్రభుత్వం చాలా పాలసీ రిఫార్మ్స్ తీసుకొచ్చింది. ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ ప్రాసెస్‌ను సింపుల్ చేయడం, లైసెన్స్ వ్యాలిడిటీ పొడిగింపు, కొన్ని ఐటెమ్స్‌కు లైసెన్స్ అవసరం లేకపోవడం వంటివి ఇందులో ఉన్నాయి.
డిఫెన్స్ స్టార్టప్‌ల వైపు ఇన్వెస్టర్లు..
ఆపరేషన్ సిందూర్ గ్రాండ్ సక్సెస్ కావడంతో ఇండియా డిఫెన్స్ సెక్టార్‌పై వెంచర్ క్యాపిటలిస్టుల ఆసక్తి పెరిగింది. డిఫెన్స్ టెక్, డ్రోన్ స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తున్నారు. ట్రాక్సన్ డేటా ప్రకారం, ఇండియాలో డ్రోన్ స్టార్టప్‌లు ఇప్పటివరకు 414 మిలియన్ డాలర్ల (రూ.3,560 కోట్ల) ఈక్విటీ ఫండింగ్ సేకరించాయి. దేశంలో మొత్తం 487 డ్రోన్ స్టార్టప్‌లు ఉన్నాయి. వీటిలో ఐడియాఫోర్జ్, జెన్ టెక్నాలజీస్, డ్రోన్‌ఆచార్య, గరుడ ఏరోస్పేస్, మరుత్ డ్రోన్స్ వంటివి ఉన్నాయి. వీటిలో 132 స్టార్టప్‌లకు ఫండింగ్ వచ్చింది. 28 స్టార్టప్‌లు సిరీస్ ఏ ప్లస్ ఫండింగ్ పొందాయి. ఈ డ్రోన్స్ చాలావరకు సివిలియన్ పనులకు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌స్పెక్షన్‌కు ఉపయోగపడతాయి. ఐడియాఫోర్జ్ లాంటి స్టార్టప్‌లు సివిల్, డిఫెన్స్ రెండు రకాల పనులకూ ఉపయోగపడే డ్రోన్లను తయారు చేస్తున్నాయి.
కొన్ని స్టార్టప్‌లు డిఫెన్స్ టెక్‌లో కూడా ఉన్నాయి. ట్రాక్సన్ డేటా ప్రకారం, ఇండియాలో 136 మిలిటరీ టెక్ స్టార్టప్‌లు ఉన్నాయి. వీటిలో న్యూస్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ వంటివి ఉన్నాయి. వెంచర్ క్యాటలిస్ట్‌లు ఇప్పటికే గరుడ ఏరోస్పేస్, రెడ్‌వింగ్, స్కై ఎయిర్, టెక్ ఈగల్, నెక్స్ట్‌క్యూబ్ లాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశాయి. రానున్న కాలంలో డిఫెన్స్ సెక్టార్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఎనలిస్టులు భావిస్తున్నారు.