బిహార్ లో భారీ గోల్డ్ మైన్

బిహార్ లో భారీ గోల్డ్ మైన్

పేద రాష్ట్రంగా పేరొందిన బిహార్ నేలలో దేశంలోనే అత్యధిక బంగారం నిల్వలు ఉన్నాయని జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) వెల్లడించింది. ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ విషయాన్ని గుర్తించినట్లు తెలిపింది. బిహార్ లోని జముయి జిల్లాలో దాదాపు 222.88 మిలియన్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని పేర్కొంది. ఈ బంగారు గనుల్లో తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలని సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం యోచిస్తోంది. బిహార్ రాష్ట్ర గనులు, జియాలజీ విభాగాలు ఇప్పటికే ఇందుకు సంబంధించి పలు సంస్థలతో చర్చలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. జముయి గోల్డ్ మైన్స్ లో తవ్వకాలు జరిపేందుకు ఆసక్తి చూపుతున్న సంస్థల జాబితాలో జీఎస్ఐ, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) కూడా ఉన్నాయి.

నెల రోజుల్లోగా ఏదైనా ఒక సంస్థతో దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని ఖరారు చేసుకోవాలనే కృత నిశ్చయంతో బిహార్ ప్రభుత్వం ఉంది. జముయి జిల్లాలోని కార్మాతియా, ఝాంఝా, సోనో గ్రామాల పరిధిలోని గనుల్లో బంగారం నిల్వల కోసం తవ్వకాలు జరపాలని రాష్ట్రం నిర్ణయించింది. జముయి జిల్లాలోని గనుల్లో ఉన్న బంగారం నిల్వలు (222.885 మిలియన్ టన్నులు) .. మొత్తం దేశంలోని పసిడి నిల్వల్లో 44 శాతానికి సమానం. ఈవిషయాన్ని సాక్షాత్తూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇటీవల లోక్ సభకు తెలిపారు. 

మరిన్ని వార్తలు..

2 రోజుల్లో కేరళకు రానున్న రుతుపవనాలు

శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం