సమం చేస్తరా.. సమర్పిస్తరా..? ఇవాళ (అక్టోబర్ 23) ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. రోహిత్‌‌‌‌, కోహ్లీపైనే ఫోకస్

సమం చేస్తరా.. సమర్పిస్తరా..? ఇవాళ (అక్టోబర్ 23) ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. రోహిత్‌‌‌‌, కోహ్లీపైనే ఫోకస్
  • ఉ. 9 నుంచి స్టార్ స్పోర్ట్స్‌‌‌‌, జియో హాట్‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌

అడిలైడ్:  ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్‌‌‌‌లో టీమిండియా మరో కఠిన సవాల్‌‌‌‌కు సిద్ధమైంది. తొలి వన్డేలో చిత్తుగా ఓడిన గిల్‌‌‌‌సేన తీవ్ర ఒత్తిడిలో గురువారం (అక్టోబర్ 23) జరిగే రెండో మ్యాచ్‌‌‌‌లో కంగారూ టీమ్‌‌‌‌తో చావో రేవో తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌‌‌‌లో గెలిచి సిరీస్‌‌‌‌లో నిలవాలని ఇండియా పట్టుదలగా ఉండగా... మరో విజయంతో అడిలైడ్‌‌‌‌లోనే సిరీస్ సొంతం చేసుకోవాలని ఆసీస్‌‌‌‌ భావిస్తోంది.  

ఆల్‌‌‌‌రౌండర్లపై అతిగా ఆధారపడుతున్న గిల్‌‌‌‌సేనకు హోమ్‌‌‌‌టీమ్‌‌‌‌ నుంచి మరో పరీక్ష ఎదురవనుంది. పెర్త్‌‌‌‌లో వర్షం అంతరాయం కలిగించిన తొలి వన్డే ఇండియాకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఆట పదేపదే నిలిచిపోవడం వల్ల బ్యాటింగ్ లయ దెబ్బతిని, చివరికి గిల్‌‌‌‌సేన  ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 

ఆసీస్ పేసర్లు జోష్ హేజిల్‌‌‌‌వుడ్, మిచెల్ స్టార్క్ కొత్త బాల్‌‌‌‌తో సృష్టించిన బీభత్సానికి ఇండియా టాపార్డర్ కుప్పకూలింది. కెప్టెన్ గిల్, సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్‌‌‌‌‌‌‌‌ పెవిలియన్‌‌‌‌కు క్యూ కట్టారు. కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌, ఆల్‌‌‌‌రౌండర్ అక్షర్ పటేల్ కాసేపు మెరిపించినా.. చిన్న టార్గెట్ (137)ను కాపాడుకోవడంలో సిరాజ్ నేతృత్వంలోని బౌలింగ్‌‌‌‌ యూనిట్‌‌‌‌ కూడా పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఆ మ్యాచ్‌‌‌‌లో ఇండియా‌‌‌‌కు దక్కిన సానుకూలాంశాలు చాలా తక్కువ. ఇప్పుడు ఆ పరాజయాన్ని మరిచి ఈ పోరును గిల్‌‌‌‌సేన్ సరికొత్తగా మొదలు పెట్టాలి. 

కాంబినేషన్ మారుస్తారా?    

టీమిండియా బ్యాటింగ్ భారం మరోసారి కెప్టెన్‌‌‌‌ గిల్‌‌‌‌తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపైనే ఉంది. తొలి వన్డేలో విఫలమైన  ‘రోకో’ రెండో వన్డేలో భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా రోహిత్ అడిలైడ్ నెట్స్‌‌‌‌లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో ఎక్కువ సమయం శ్రమించాడు. త్రో-డౌన్ స్పెషలిస్టుల బాల్స్‌‌‌‌ ఎదుర్కొంటూ తన బ్యాటింగ్‌‌‌‌కు పదును పెట్టాడు. మరోవైపు మంగళవారం నెట్స్‌‌‌‌లో తీవ్రంగా శ్రమించిన కోహ్లీ బుధవారం ప్రాక్టీస్‌‌‌‌కు దూరంగా ఉన్నాడు. మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌లో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతగా ఆడాల్సి ఉంటుంది.   

ఇక, హార్దిక్ పాండ్యా లేకపోవడం ఇండియా జట్టు సమతుల్యతను దెబ్బతీసింది. 8వ నంబర్‌‌‌‌‌‌‌‌ వరకూ బ్యాటింగ్‌‌‌‌ చేసే ప్లేయర్ కోసం హెడ్ కోచ్ గంభీర్ వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డిని ఆడించడం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. తొలి మ్యాచ్‌‌‌‌లో తేలిపోయిన హర్షిత్ రాణా స్థానంలో ఎక్స్‌‌‌‌ట్రా పేస్‌‌‌‌, బౌన్స్ రాబట్టగల ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అలాగే వికెట్లు తీసే సత్తా ఉన్న సమర్థుడైన కుల్దీప్ యాదవ్‌‌‌‌ను సుందర్ కోసం పక్కన పెట్టడంపై విమర్శలు వచ్చాయి. అయితే, అడిలైడ్ గ్రౌండ్ బౌండరీలు చిన్నవిగా ఉండటం కుల్దీప్‌‌‌‌కు ప్రతికూలాంశంగా మారవచ్చు. దాంతో సుందర్‌‌‌‌‌‌‌‌కు మరో చాన్స్ రావొచ్చు. 

బరిలోకి జంపా, క్యారీ

రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్‌‌‌‌తో పాటు కీపర్‌‌‌‌‌‌‌‌ అలెక్స్‌‌‌‌ క్యారీ, స్పిన్నర్ ఆడమ్ జంపా లేకుండానే ఆడి తొలి మ్యాచ్‌‌‌‌లో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా ఫుల్ జోష్‌‌‌‌లో ఉంది. అడిలైడ్‌‌‌‌లోనూ గెలిచి సిరీస్ నెగ్గాలని చూస్తోంది.  పెర్త్‌‌‌‌లో ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ నడ్డి విరిచిన స్టార్ పేసర్లు స్టార్క్‌‌‌‌, హేజిల్‌‌‌‌వుడ్ నుంచి గిల్‌‌‌‌సేనకు మరోసారి ప్రమాదం పొంచి ఉంది. ఈ మ్యాచ్‌‌‌‌కు  క్యారీ, జంపా  తిరిగి రావడంతో ఆ టీమ్ బలం మరింత పెరిగింది. వీళ్ల రాకతో తొలి వన్డేలో ఆడిన జోష్ ఫిలిప్‌‌‌‌, మాట్ కునెమన్ బెంచ్​కు  పరిమితం కానున్నారు. తొలి వన్డేలో విఫలమైనా అడిలైడ్ లో అద్భుతమైన రికార్డు ఉన్న మాథ్యూ షార్ట్‌‌‌‌కు మరో అవకాశం దక్కనుంది.

పిచ్/వాతావరణం

 అడిలైడ్ ఓవల్ పిచ్ ఎప్పుడూ బ్యాటింగ్‌‌‌‌కు స్వర్గధామం. బౌండరీలు చిన్నవిగా ఉండటంతో ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. మ్యాచ్‌‌‌‌కు ముందు అడిలైడ్‌‌‌‌లో వర్షం కురిసినా గురువారం వాతావరణం పొడిగా, చల్లగా ఉంటుందని అంచనా.

తుది జట్లు (అంచనా)

ఇండియా: గిల్ (కెప్టెన్), రోహిత్ , కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రాహుల్ (కీపర్), అక్షర్,  సుందర్/కుల్దీప్ యాదవ్, నితీష్ రెడ్డి, ప్రసిద్ కృష్ణ/హర్షిత్ రాణా, అర్ష్‌‌‌‌దీప్, సిరాజ్.

ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్),హెడ్, మాథ్యూ షార్ట్, క్యారీ (వికెట్ కీపర్), రెన్‌‌‌‌షా, కనోలి, ఓవెన్, స్టార్క్, నేథన్ ఎలీస్, హేజిల్‌‌‌‌వుడ్, ఆడమ్ జంపా.

54  విరాట్ కోహ్లీ మరో 54 రన్స్ చేస్తే వన్డేల్లో హయ్యెస్ట్‌‌‌‌ స్కోరర్ల జాబితాలో కుమార సంగక్కరను దాటి రెండో ప్లేస్‌‌‌‌కు చేరుకుంటాడు.
5  మిచెల్ స్టార్క్ 250 వన్డే వికెట్ల క్లబ్‌‌‌‌లో చేరడానికి 5 వికెట్ల దూరంలో ఉన్నాడు.

అడిలైడ్‌‌‌‌లో 2008 జనవరి తర్వాత ఇండియా‌‌‌‌పై ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ గెలవలేదు. 2011, 2019 ఇక్కడ ఆసీస్‌తో ఆడిన చివరి రెండు వన్డేల్లో ఇండియా టార్గెట్లు ఛేజ్ చేసి గెలిచింది.