భూటాన్‌‌కు భారత్ రెండో విడత.. 500 కోట్ల సాయం

భూటాన్‌‌కు భారత్ రెండో విడత.. 500 కోట్ల సాయం

 థింపూ: గ్యాల్‌‌సంగ్ ప్రాజెక్ట్‌‌కు సంబంధించిన ఇన్​ఫ్రాస్టక్చర్​ అభివృద్ధి కోసం భూటాన్‌‌కు భారత్ రెండో విడత రూ.500 కోట్ల సాయాన్ని రిలీజ్ చేసింది. ఈ నెల 23న ప్రధాని మోదీ భూటాన్‌‌లో రెండు రోజులు పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భూటాన్​ అభివృద్ధి కోసం వచ్చే ఐదేండ్లలో రూ.10 వేల కోట్లు అందించనున్నట్టు ప్రకటించారు. మొదటి విడత రూ.500 కోట్లు ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 28న అందజేశారు. 

రెండో విడత నిధులను భూటాన్‌‌లోని భారత రాయబారి సుధాకర్ దలేలా భూటాన్ విదేశాంగ, విదేశీ వాణిజ్య మంత్రి లియోన్‌‌పో డీఎన్ ధుంగ్యేల్‌‌కు అందజేశారు. దీనితో గ్యాల్‌‌సంగ్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కోసం రాయితీ ఫైనాన్సింగ్ ఏర్పాట్లపై అవగాహన ఒప్పందం కింద భారత ప్రభుత్వం మొత్తం వెయ్యి కోట్ల రూపాయలు భూటాన్ ప్రభుత్వానికి విడుదల చేసిందని మంగళవారం భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది