
హాంగ్జౌ (చైనా) : ఇండియా స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు.. ఆసియా గేమ్స్ అథ్లెట్స్ కమిటీలో చోటు దక్కనుంది. ఈ మేరకు సౌత్ ఆసియా జోన్ నుంచి బరిలో ఉన్న సైనా ఏకపక్షంగా గెలిచే చాన్స్ ఉంది. మొత్తం 10 మందితో కూడిన అథ్లెట్ల కమిటీ కోసం గేమ్స్ చరిత్రలోనే తొలిసారి ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) పోలింగ్ నిర్వహిస్తున్నది. మొత్తం 26 నామినేషన్స్ రాగా, ఇందులో సైనాకే ఎక్కువ మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది.
‘అథ్లెట్లందరూ కమిటీలోని 10 మందికి ఓటు వేస్తారు. ఐదు ఓసీఏ జోన్స్.. వెస్ట్ ఆసియా, సెంట్రల్ ఆసియా, సౌత్ ఆసియా, సౌత్ ఈస్ట్ ఆసియా, ఈస్ట్ ఆసియా నుంచి ఒక మహిళ, ఒక పురుష అభ్యర్థి రేస్‌లో ఉన్నారు. ఈ నెల 18 నుంచి అక్టోబర్ 6 వరకు పోలింగ్ జరుగుతుంది. గేమ్స్ విలేజ్ హాంగ్జౌతో పాటు మరో ఐదు ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. అక్టోబర్ 7న విజేతను ప్రకటిస్తాం’ అని ఓసీఏ పేర్కొంది.