- ఇండియా ఎగుమతి చేసిన బండ్లు 63,25,211
- 2025లో 24 శాతం వృద్ధి: సియామ్
న్యూఢిల్లీ: ఇండియా నుంచి బండ్ల ఎగుమతులు 2025లో 24శాతం పెరిగి 63,25,211 యూనిట్లకు చేరాయి. 2024లో ఇవి 50,98,474 యూనిట్లు మాత్రమే ఉండగా, ఇంటర్నేషనల్ మార్కెట్లలో డిమాండ్ పెరగడంతో ఎగుమతులు ఊపందుకున్నాయి. ప్యాసింజర్ వాహనాల (కార్లు, వ్యాన్‌లు, యుటిలిటీ బండ్ల) ఎగుమతులు 8,63,233 యూనిట్లకు చేరుకున్నాయి.
ఇది 2024 తో పోలిస్తే 16శాతం ఎక్కువ. ఎస్‌యూవీ, ఎంయూవీ వంటి యుటిలిటీ వాహనాల ఎగుమతులు 32శాతం పెరిగి 4,27,219 యూనిట్లకు, సెడాన్, హ్యాచ్‌బ్యాక్ వంటి కార్ల ఎగుమతులు 3శాతం పెరిగి 4,25,396 యూనిట్లకు చేరాయి. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి ప్రాంతాల్లో డిమాండ్ స్థిరంగా ఉందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ తెలిపింది.
మారుతి సుజుకి 2025లో 3.95 లక్షల బండ్లను ఎగుమతి చేసి ముందంజలో నిలిచింది. 2024లో ఎగుమతి చేసిన 3.26 లక్షల యూనిట్లతో పోలిస్తే గణనీయమైన వృద్ధి నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 4 లక్షల యూనిట్లను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం భారత ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల్లో 46శాతం వాటా మారుతిదే ఉంది.
టూ వీలర్ బండ్ల ఎగుమతులు 2025లో 24శాతం పెరిగి 49,39,706 యూనిట్లకు చేరాయి. మోటార్‌సైకిళ్ల ఎగుమతులు 27శాతం పెరిగి 43,01,927 యూనిట్లకు, స్కూటర్ల ఎగుమతులు 8శాతం పెరిగి 6,20,241 యూనిట్లకు ఎగిశాయి. త్రీ వీలర్ వాహనాల ఎగుమతులు 43శాతం పెరిగి 4,25,527 యూనిట్లకు, కమర్షియల్ వాహనాలు 27శాతం పెరిగి 91,759 యూనిట్లకు చేరాయి.
