చెన్నూరులో ఇందిరా మహిళా శక్తి సంబరాలు.. రూ.25 కోట్ల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి వివేక్

చెన్నూరులో ఇందిరా మహిళా శక్తి సంబరాలు.. రూ.25 కోట్ల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి వివేక్

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఆదివారం (జులై 20) చెన్నూరు మండలం కిష్టంపేట లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 246 స్వయం మహిళా సంఘాలకు రూ.25 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పంపిణీ చేశారు.  చెన్నూరు, కోటపల్లి, భీమారం మండలాల్లో కొత్తగా మంజూరు అయిన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు మంత్రి వివేక్. 

ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడారు. గత ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలపరుస్తామని చెప్పి విస్మరించిందని అన్నారు. మహిళలను కోటీశ్వరులను చేస్తానని కేసీఆర్ కోటీశ్వరుడు అయ్యారని విమర్శించారు.  కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్ష కోట్లు వృథా చేశారని.. కాంట్రాక్టర్లు ధనవంతులు అయ్యారని తెలిపారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను  అమలు చేస్తున్నట్లు చెప్పారు మంత్రి వివేక్. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని.. వడ్డీ లేని రుణాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు,  200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. 

చెన్నూరు నియోజకవర్గంలో గ్రామాల్లో మెరుగైన రవాణా వ్యవస్థ కోసం రోడ్లు వేయించడం జరిగిందని చెప్పారు. చెన్నూరు నుంచి కొత్తగా 5 బస్ సర్వీసులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. బస్ డిపో కోసం ఇప్పటికే రవాణా శాఖ మంత్రి కి చెప్పడం జరిగిందని అన్నారు. సోమనపల్లి గ్రామంలో నూతనంగా 200 కోట్ల రూపాయల నిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం విద్యా, వైద్యం కోసం పెద్ద పీట వేస్తుందని తెలిపారు. 

నియోజకవర్గ ప్రజలకు18 నెలల్లో సుమారు 500 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు. రేషన్ కార్డు ఉన్న వారికి అందరికీ సన్న బియ్యం ఇస్తున్నామని.. సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నట్లు చెప్పారు. చెన్నూరు నియోజకవర్గంలో సుమారు 8,000 కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని తెలిపారు. ఇక ఎండాకాలంలో 200 బోర్లు వేసి నీటి ఎద్దడి లేకుండా చేసినట్లు గుర్తు చేశారు మంత్రి వివేక్.