భవిష్యత్ కార్యచరణ ప్రకటించిన ఇందిరా శోభన్..

భవిష్యత్ కార్యచరణ ప్రకటించిన ఇందిరా శోభన్..

వైఎస్ షర్మిల పార్టీకి రాజీనామా చేసిన ఇందిరా శోభన్.. బుధవారం అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. త్వరలోనే తాను హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు. ఉపాధి కల్పనే ద్వేయంగా ‘ఉపాధి భరోసా యాత్ర’ పేరుతో ఈనెల 27 నుంచి పాదయాత్ర చేయనున్నట్లు ఆమె తెలిపారు.

‘ప్రస్తుతానికి నేను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు. ఉద్యోగాలు కోల్పోయిన ఫీల్డ్ అసిస్టెంట్లు, స్టాఫ్ నర్సులు, విద్యా వాలంటీర్లు, జూనియర్ లెక్చరర్ల సమస్యను హుజురాబాద్ వేదికగా లేవనెత్తబోతున్నాం. వారికి అండగా ఉండేందుకే ఉపాధి భరోసా యాత్ర చేస్తున్నాం. నియామకాలు చేపట్టకపోగా.. విధుల నుంచి తొలగించే హక్కు సీఎంకు ఎక్కడిది. ఇచ్చే వాడికి హక్కు ఉంటుంది. కేసీఆర్ ఉద్యోగాలే ఇవ్వలేదు.. అటువంటప్పడు ఎలా తొలగిస్తారు. ఉద్యోగాల నుంచి 54 వేల మందిని తొలగించారు. పని చేసిన వారికి జీతాలు కూడా ఇవ్వలేదు. శ్రమ దోపిడీ, వెట్టిచాకిరి చేయించుకొని అర్థాంతరంగా వదిలేశారు. సమాన పనికి సమాన వేతనమని చెప్పిన సుప్రీంకోర్టు ఆదేశాలను అమలుచేయలేదు. నోటి కాడి ముద్ద లాక్కున్నారు. తెలంగాణ వచ్చాక కూడా ఆత్మహత్యలు జరగడం బాధాకరం. రైతులు, నిరుద్యోగులు వందల మంది చస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను సైతం తొలగించారు. ఒకవైపు కోవిడ్ మరణాలు.. మరోవైపు నిరుద్యోగుల మరణాలు జరుగుతున్నాయి. ప్రైవేట్ ఉద్యోగులకు కరోనా సమయంలో ఇస్తామన్న 2000 రూపాయలు, బియ్యం కూడా అందడం లేదు. గెస్ట్ లెక్చరర్లను కూడా విధులలోకి తీసుకోవడం లేదు. కేసీఆర్ కూతురికి ఉద్యోగం లేదని ఆవురావురుమని ఎమ్మెల్సీ ఇచ్చారు. వాళ్ళ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. హుజురాబాద్ ఎన్నిక కోసమే అభివృద్ధి పనులన్నీ అక్కడే చేస్తున్నారు. అందుకే ఈ సమస్యలన్నింటిపై 27న హుజురాబాద్ కు ‘ఉపాధి భరోసా యాత్ర’ పేరిట పాదయాత్రతో వస్తున్నాను. పదవులు నాకు ముఖ్యం కాదు. ప్రజా సమస్యలపై పోరాడటమే నా ధ్యేయం. హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట ఆలయంలో పూజ అనంతరం యాత్ర ప్రారంభం అవుతుంది. రాజకీయ భవిష్యత్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సీఎంకు ఏమాత్రం అయినా సోయి ఉందా? భూములు అమ్మి మరీ ఎన్నికలకు పోవడం సిగ్గుచేటు. సీఎం 4 లక్షల కోట్లు అప్పులు చేసి.. ఎవరికి మేలు చేశారో చెప్పాలి. కార్పొరేషన్ లోన్లు పెండింగ్ లోనే ఉన్నాయి. దళిత బంధు కాదు పేదల బంధు కావాలి. హుజురాబాద్ ఎన్నికల్లో మా పోరాట పటిమను చూపిస్తాం’ అని ఆమె అన్నారు.