
రాజన్నసిరిసిల్ల, వెలుగు : ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న మహిళా సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. సోమవారం సిరిసిల్లలో పర్యటించిన మంత్రి కార్మికులు, ఆసాములతో మాట్లాడారు. చీరల ఉత్పత్తి, ఆదాయానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ... సిరిసిల్ల నేతన్నలకు ఏడదంతా పని కల్పించేందుకు మరిన్ని ఆర్డర్లు ఇస్తామని, వీటికి సంబంధించిన విషయాలపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చిస్తామని చెప్పారు.
ఇందిరమ్మ చీరల రెండో ఆర్డర్‌ను సైతం త్వరలో ఇచ్చేలా సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఆర్డర్లతో ఒక్కో నేత కార్మికుడు నెలకు సుమారు రూ. 25 వేలు సంపాదించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు కాంగ్రెస్ చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తోందన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇస్తే.. కొందరు వ్యక్తులు కోర్టులను ఆశ్రయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్న్ సిగ్నల్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె వెంట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చేనేత జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కేకే.మహేందర్‌రెడ్డి, గడ్డం నర్సయ్య, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వేముల స్వరూప, చొప్పదండి ప్రకాశ్, పాలిస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆడెపు భాస్కర్, వేముల దామోదర్, టెస్కో జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్‌రావు ఉన్నారు.