రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ బీమా..కుటుంబంలో ఒక్కరికే చాన్స్

రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ బీమా..కుటుంబంలో ఒక్కరికే చాన్స్
  • ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్.. గైడ్‌‌లైన్స్‌‌ జారీ చేసిన ప్రణాళికా శాఖ
  •     కుటుంబంలో ఒక్కరికే చాన్స్.. 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్నవారే అర్హులు
  •     పాలసీ ఈయర్‌‌‌‌లో 60 ఏండ్లు దాటినా ఆ ఏడాది వరకు బీమా
  •     రేషన్ కార్డు నంబరే అప్లికేషన్ నంబర్
  •     జీపీలు, మున్సిపల్ వార్డుల్లో నెల రోజుల పాటు నమోదు క్యాంపులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని నిరుపేద, బలహీన వర్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ప్రకటించిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ అమలుకు ప్రణాళికా శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ పథకం కింద ప్రతి అర్హ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించనున్నారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ప్రాధాన్యతనిస్తూ ఒక్కరినే లబ్ధిదారుగా నమోదు చేస్తారు. రేషన్ కార్డు ఉన్నవారితో పాటు లేని కుటుంబాలకూ బీమా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల వారీగా నెల రోజుల పాటు ప్రత్యేక క్యాంపులు నిర్వహించి నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇతర ప్రభుత్వ బీమా పథకాలను కొనసాగిస్తూనే, క్రమంగా వాటన్నింటినీ ఇందిరమ్మ బీమా పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది.

అర్హత ప్రమాణాల – వయోపరిమితి

కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ప్రాధాన్యతనిస్తూ ఒక్కరికే బీమాలో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. నమోదు సమయంలో లబ్ధిదారుడి వయసు 18 నుంచి 59 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1967 నవంబర్ 19 నుంచి 2008 నవంబర్ 18 మధ్య జన్మించినవారు అర్హులు. వయసు నిర్ధారణకు ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. ఆధార్‌‌లో కేవలం పుట్టిన సంవత్సరం ఉంటే, ఆ ఏడాది జులై 1వ తేదీని పుట్టిన తేదీగా పరిగణిస్తారు. ఆధార్‌‌లో పుట్టిన తేదీ తప్పుగా ఉంటే ఆధార్ కేంద్రంలో సరిచేసుకున్న తర్వాతే నమోదు చేసుకోవాలి.

అవసరమైన పత్రాలు

నమోదు కోసం లబ్ధిదారుడి ఆధార్ కార్డు, రేషన్ కార్డు (అందుబాటులో ఉంటే), ప్రస్తుతం వినియోగంలో ఉన్న మొబైల్ నంబర్ ఇవ్వాలి. రేషన్ కార్డు ఈ-కేవైసీ పెండింగ్‌‌లో ఉన్న వారు తమకు కేటాయించిన రేషన్ షాపుల్లో దాన్ని పూర్తి చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డు నంబరునే దరఖాస్తు ఫారం నంబర్‌‌గా పరిగణిస్తారు. ఒక రేషన్ కార్డుపై ఒక్కరే నమోదు చేసుకోవడానికి వీలుంటుంది. ఇతర జిల్లాల రేషన్ కార్డులు ఉన్నవారు తాము నివసిస్తున్న ప్రాంతానికి సమీపంలోని క్యాంపులోనే దరఖాస్తు చేసుకోవచ్చు. వారి వివరాలను సేకరించి పరిశీలన కోసం స్వస్థల జిల్లాల అధికారులకు ఆన్‌‌లైన్‌‌లో పంపిస్తారు. నమోదు విజయవంతమైన వెంటనే లబ్ధిదారుడి మొబైల్ నంబర్‌‌కు ఐడీతో కూడిన ఎస్ఎంఎస్ రసీదు వస్తుంది.

నమోదు నెల రోజుల పాటు క్యాంపులు

గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ స్థాయిలో, పట్టణాల్లో వార్డుల వారీగా నెల రోజులు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, ర్యాంపులు కల్పించాలి. క్యాంపుల తేదీలు, వేదికలు, ఇన్‌‌చార్జ్ అధికారుల వివరాలను ముందుగానే చాటింపు వేయించడంతో పాటు ప్రచారం చేయాలని పేర్కొన్నారు.

నామినీ రూల్స్, వాటాల కేటాయింపు

పాలసీ ప్రారంభమైన తర్వాత సంబంధిత బీమా సంవత్సరంలో లబ్ధిదారుడి వయస్సు 60 ఏళ్లు దాటినా ఆ ఏడాది చివరి వరకు బీమా రక్షణ కొనసాగుతుంది. బీమా పొందిన వ్యక్తి మరణిస్తే నామినీలకు రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తారు. ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా పేర్కొనవచ్చు. పరిహారంలో ఒక్కో నామినీకి ఎంత శాతం ఇవ్వాలనేది దరఖాస్తుదారుడే నిర్ణయించాలి. నామినీల్లో 18 ఏళ్లలోపు మైనర్లు ఉంటే, వారి తరఫున పరిహారం స్వీకరించేందుకు ఒక మేజర్ వ్యక్తిని ‘అపాయింటీ’గా తప్పనిసరిగా పేర్కొనాలి. అపాయింటీ కుటుంబ సభ్యుడే కావాల్సిన అవసరం లేదు.

సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించాలి
సాంకేతిక లోపాలు, డాక్యుమెంట్లలో తేడాలు, పేర్ల సమస్యలున్నాయనే కారణంతో ఏ ఒక్కరినీ నమోదు కేంద్రాల నుంచి వెనక్కి పంపొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి క్యాంపులో ప్రత్యేక హెల్ప్‌‌డెస్క్ ఏర్పాటు చేసి, దరఖాస్తుదారుల సందేహాలు నివృత్తి చేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి మార్గనిర్దేశం చేయాలి. క్యాంపుల్లో పరిష్కారం కాని సమస్యలను రోజువారీ జిల్లా స్థాయి సమీక్షలో పరిశీలించి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని ఆదేశించింది.