లక్ష మందితో ఇందిరమ్మ ఫోర్స్!

లక్ష మందితో ఇందిరమ్మ ఫోర్స్!
  •  ఆరు గ్యారంటీల అమలు కోసం గ్రామాలు, పట్టణాల్లో కమిటీలు
  • మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ ఆదేశం 
  • ఒక్కో కమిటీలో ఐదుగురు సభ్యులు
  • రెండు మూడ్రోజుల్లోనే ఉత్తర్వులు 

హైదరాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీల అమలు కోసం ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్​రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఈ కమిటీల ఏర్పాటుకు సంబంధించి రెండు, మూడ్రోజుల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు తెలిసింది. ప్రతి గ్రామంలో ఒకటి, పట్టణాల్లో అయితే వార్డుకు ఒకటి చొప్పున ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు సమచారం. ఒక్కో కమిటీలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఐదుగురు సభ్యులు ఉండనున్నారు. 

నియోజకవర్గ ఎమ్మెల్యే, ఇన్‌‌చార్జ్ మంత్రి ఆమోదంతో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఆరు గ్యారంటీల్లో భాగమైన ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, రూ.500కే సిలిండర్, గృహజ్యోతి, చేయూత, యువ వికాసం తదితర పథకాలను పేదలకు అందించే బాధ్యతను ఈ కమిటీలకే ప్రభుత్వం అప్పగించనుంది. ఏ పథకానికైనా అర్హుల ఎంపిక ఇందిరమ్మ కమిటీల ద్వారానే జరుగుతుందని సీఎం రేవంత్‌‌ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాలు, పట్టణాలు కలిపితే ఇందిరమ్మ కమిటీల్లో దాదాపు లక్ష మంది ఉండనున్నారు. 

అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించింది. అందులో భాగంగా పథకాల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం పెట్టి అప్లికేషన్లు తీసుకున్నది. ఇప్పటికే కొన్ని గ్యారంటీల అమలు మొదలుపెట్టింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు వంటివి ప్రారంభించింది. ఈ నెల 11 నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు కానుంది. మరికొన్ని రోజుల్లో యువ వికాసం, రైతు భరోసా స్కీమ్స్ కూడా ప్రారంభం కానున్నాయి. 

ఈ నేపథ్యంలో ఈ పథకాలన్నీ అర్హులందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. దీంతో ఆ బాధ్యతలను ఇందిరమ్మ కమిటీలకు అప్పగించాలని సర్కార్ భావిస్తున్నది. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా ఏ సమస్య ఉన్నా, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారని అనుకుంటున్నది. ప్రభుత్వ పథకాలు అందాల్సి ఉన్నా అందకుండా ఇబ్బంది పడుతున్నవారు మండల ఆఫీసులు, జిల్లా కలెక్టరేట్లు, సెక్రటేరియెట్ వరకు రావాల్సిన అవసరం ఉండదని యోచిస్తున్నది. 

ఏపీలో వలంటీర్ వ్యవస్థ మాదిరిగా.. రాష్ట్రంలో ఈ ఇందిరమ్మ కమిటీలు ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా, వేగంగా అందించడానికి తోడ్పడేలా విధివిధానాలు రూపొందిస్తున్నది. గతంలో బీఆర్ఎస్ రైతు సమన్వయ సమితి కమిటీలు వేసిన మాదిరి కాకుండా పకడ్బందీగా ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ కమిటీలకు ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగించడంతో పాటు తగిన గౌరవ వేతనం ఇస్తే ఎలా ఉంటుందనే దానిపైనా చర్చలు చేస్తున్నది. త్వరలో ప్రభుత్వం ఇవ్వనున్న ఉత్తర్వుల్లో గౌరవ వేతనం, ఇతర సదుపాయాలు, కమిటీల బాధ్యతల గురించి స్పష్టత రానుంది.