మంచి రోజుల కోసం ఎదురుచూపులు .. నడిగడ్డలో ముగ్గు పోసే దశలోనే ఇందిరమ్మ ఇండ్లు

మంచి రోజుల కోసం ఎదురుచూపులు .. నడిగడ్డలో ముగ్గు పోసే దశలోనే ఇందిరమ్మ ఇండ్లు
  • పనులు స్పీడప్​ చేయడంపై కలెక్టర్​ ఫోకస్
  • శ్రావణ మాసం కావడంతో పనులు ప్రారంభించే అవకాశం

గద్వాల, వెలుగు: మంచి ముహూర్తాలు లేకపోవడంతో జోగులాంబ గద్వాల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నెమ్మదిగా సాగుతోంది. జిల్లాకు 6,488 ఇండ్లు మంజూరు కాగా, 453 ఇండ్లు మాత్రమే బేస్​మెంట్​ లెవల్​కు చేరుకున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచేందుకు కలెక్టర్  ఫీల్డ్​ విజిట్​ చేస్తున్నారు. ఇప్పటి వరకు మంచి ముహూర్తాలు లేకపోవడంతో ఇండ్ల నిర్మాణం ఆలస్యమైందని, శ్రావణమాసం రావడంతో పనులు స్పీడప్​ అయ్యే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు.

6,488 ఇండ్లు శాంక్షన్..

జోగులాంబ గద్వాల జిల్లాకు 6,488 ఇందిరమ్మ ఇండ్లు మంజూరవగా, గద్వాల నియోజకవర్గానికి 3,500, అలంపూర్  నియోజకవర్గానికి 2,988 ఇండ్లు కేటాయించారు. ఇప్పటివరకు 3,440 ఇండ్లకు ముగ్గు పోశారు. ఇందులో 453 ఇండ్లు బేస్​మెంట్  లెవల్ కు చేరుకున్నాయి. జిల్లాలోని ధరూర్  మండలంలో ఇండ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. మండలానికి 872 ఇండ్లు మంజూరు కాగా, 386 ఇండ్లకు ముగ్గు పోశారు. 71 ఇండ్లు బేస్​మెంట్  లెవల్ కు చేరుకున్నాయి. గద్వాల మున్సిపాలిటీకి 414 మంజూరు కాగా, వంద ఇండ్లకు మాత్రమే ముగ్గు పోశారు.

ముహూర్తాలు లేకపోవడం, ఇసుక కొరతే కారణం!

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ప్రొసీడింగ్స్  లబ్ధిదారుల చేతికి వచ్చిన తరువాత మంచి ముహూర్తాలు లేకపోవడంతో పనులు ప్రారంభించేందుకు ముందుకు రాలేదు. ప్రస్తుతం శ్రావణమాసం, మంచి ముహూర్తాలు ఉండడంతో ఇండ్ల పనులు ప్రారంభించుకునేందుకు ముందుకు వస్తున్నారు. గద్వాల నియోజకవర్గంలో ఇసుక కొరత ఉండడంతో ఇండ్ల నిర్మాణానికి ఇబ్బందికరంగా మారుతోంది.

కలెక్టర్  స్పెషల్  ఫోకస్..

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని స్పీడప్​ చేయడంపై కలెక్టర్  సంతోష్​ ఫోకస్  పెట్టారు. రివ్యూ మీటింగ్ లు పెడుతూ, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ లబ్ధిదారులు, ఆఫీసర్లను పనులు స్పీడ్​ అందుకునేలా చూస్తున్నారు. ప్రతి రోజు నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. వచ్చే వారంలోగా ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పనుల స్టార్ట్​ చేస్తున్నారు..

ఇందిరమ్మ ఇండ్ల పనులను ఇప్పుడిప్పుడే మొదలుపెడుతున్నారు. ఇసుక సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్  చర్యలు తీసుకుంటున్నారు. లోకల్ గా దొరికే ఇసుక తీసుకెళ్లేందుకు పర్మిషన్​ ఇవ్వాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఇప్పుడు ముహూర్తాలు బాగుండడంతో లబ్ధిదారులు పనులు ప్రారంభిస్తున్నారు.

శ్రీనివాసరావు, స్పెషల్  డిప్యూటీ కలెక్టర్(ఇందిరమ్మ ఇండ్ల ఇన్​చార్జి)