ఎన్నికల షెడ్యూల్​కు ముందే ఇందిరమ్మ ఇండ్ల గైడ్​లైన్స్!

ఎన్నికల షెడ్యూల్​కు ముందే ఇందిరమ్మ ఇండ్ల గైడ్​లైన్స్!
  • సొంత జాగా ఉన్న వారికే తొలి దశలో ప్రాధాన్యం
  •     ప్రజావాణిలో 25 లక్షల అప్లికేషన్లు
  •     గ్రామసభ ద్వారా లబ్ధిదారుల ఎంపిక
  •     ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు
  •     బడ్జెట్ లో  రూ.7740 కోట్లు కేటాయింపు

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇంటి స్కీమ్ గైడ్ లైన్స్ ను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. వచ్చే నెలలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్  రిలీజ్ చేసేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో షెడ్యూల్  విడుదలకు ముందే గైడ్ లైన్స్ రిలీజ్  చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్  ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇండ్ల స్కీం కూడా ఒకటి. 

ఈ స్కీమ్ గైడ్ లైన్స్ ను ఇప్పటికే హౌసింగ్  అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. సీఎం రేవంత్, హౌసింగ్  మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాటిని పరిశీలించి ఫైనల్  చేయనున్నారు. ఒకవేళ మార్పులు చేర్పులు ఉన్నా వెంటనే చేసి ఉత్తర్వులు రిలీజ్  చేయనున్నారని సమాచారం. గైడ్ లైన్స్ లో  ఇతర రాష్ర్టాల్లో అమలవుతున్న ఇండ్ల స్కీమ్ లపై అధికారులు ఇప్పటికే స్టడీ చేశారు. ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్లు, గతంలో ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్  ఇండ్లు తీసుకోని వారు, సొంత జాగా ఉండి ఎలాంటి నిర్మాణం చేయని వారిని పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఉన్నట్లు సమాచారం. 

100 శాతం సబ్సిడీ

కొత్త ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ఎంతో కీలకమైంది. ఈ స్కీమ్ ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 100 శాతం సబ్సిడీతో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలతో పాటు సొంత జాగాలేని వారికి ఇంటి జాగా ఇచ్చి నిధులు అందిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్  హామీ ఇచ్చింది. తొలి దశలో సొంత జాగా ఉన్నవారికి ప్రాధాన్యం ఇచ్చి తరువాతి దశలో జాగాలేని వారిని గుర్తించి ఆర్థిక సహాయం చేయనున్నారు. 

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 చొప్పున ఇండ్లు ఇస్తామని ఇటీవల బడ్జెట్ లో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ స్కీమ్ కు ఓటాన్  అకౌంట్ బడ్జెట్ లో రూ.7,740 కోట్లు కేటాయించారు. ఎన్నికల తరువాత ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ లో మరిన్ని నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కాగా, ఇందిరమ్మ ఇండ్లకు పీఎం ఆవాస్  స్కీమ్ కింద ఫండ్స్ రానున్నాయి. గత బీఆర్ఎస్  సర్కారులో డబుల్  బెడ్ రూమ్  స్కీమ్ కు ఇంటి నిర్మాణం చేసిన చివరకు లబ్ధిదారుల ఎంపిక చేసిన నేపథ్యంలో పీఎం ఆవాస్ స్కీమ్  కింద 8 ఏండ్లలో రూ.1100 కోట్లు మాత్రమే అందాయి. 

పక్కాగా లబ్ధిదారుల ఎంపిక

డబుల్  బెడ్ రూమ్  ఇండ్లు, గృహలక్ష్మి స్కీమ్ ల విషయంలో గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అధికార పార్టీ కార్యకర్తలు, సొంత ఇళ్లు ఉన్నవారికి, అప్పటి ఎమ్మెల్యేలు ఇచ్చిన వ్యక్తులకు, అనర్హులకు డబుల్ ఇళ్లు, గృహలక్ష్మి స్కీమ్ ల లబ్ధిదారుల లిస్టులో  చోటు దక్కిందని ప్రతిపక్షాలతో పాటు అన్ని ప్రజాసంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 

ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను పకడ్బందీగా అమలు చేయాలని సీఎం రేవంత్  నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గ్రామసభ నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నారు. ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇంటి స్కీమ్ కు రాష్ర్టవ్యాప్తంగా 25 లక్షల అప్లికేషన్లు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో ఇండ్లు లేనివారు, సొంత జాగా ఉండి ఇండ్లు లేనివారు ఇలా అర్హులను గ్రామసభ నిర్వహించి సెలెక్ట్  చేయనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు, గృహలక్ష్మి స్కీమ్ కు అప్లై చేసుకున్న వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటారని సమాచారం.