కేసీఆర్ దోస్త్ ఆగవ్వకు ఇందిరమ్మ ఇల్లు.. బీఆర్ఎస్ హయాంలో నెరవేరని కల

కేసీఆర్ దోస్త్ ఆగవ్వకు ఇందిరమ్మ ఇల్లు.. బీఆర్ఎస్ హయాంలో నెరవేరని కల
  • వాసాలమర్రిలో ఇల్లు కట్టిస్తానని అప్పట్లో హామీ ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్​
  • బీఆర్ఎస్​ హయాంలో నెరవేరని కల
  • కాంగ్రెస్ ​అధికారంలోకి వచ్చాక వాసాలమర్రిలో ఆగవ్వ 
  • సహా 112 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
  • ఇల్లు పూర్తికావడంతో ఆగవ్వను కలిసి ముచ్చటించిన హౌసింగ్​ ఎండీ గౌతమ్​
  • కాంగ్రెస్ ​వచ్చాక నా కల నెరవేరింది: ఆగవ్వ

యాదాద్రి, వెలుగు:  కేసీఆర్​ దోస్త్​ ఆగవ్వ గుర్తున్నదా? యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రికి చెందిన ఈమెను అప్పట్లో  కేసీఆర్ ​తన దోస్త్​గా చెప్పుకున్నారు. ఎర్రవెల్లి నుంచి యాదాద్రికి రోడ్డు విస్తరణలో భాగంగా నాటి బీఆర్ఎస్​ ప్రభుత్వం  వాసాలమర్రి గ్రామాన్ని పూర్తిగా నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలో సీఎం హోదాలో వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్న కేసీఆర్​.. ఇండ్లు కోల్పోయిన అందరికీ ప్రభుత్వ నిధులతో పక్కా భవనాలు, పంచాయతీ ఆఫీ సు, స్కూలు, పీహెచ్​సీ, కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 22 జూన్ 2021న గ్రామంలో సభ పెట్టి ఊరోళ్లందరికీ జోర్దార్​ దావత్​కూడా ఇచ్చాడు. అప్పుడు కేసీఆర్ ​ఆగవ్వ పక్కనే కూర్చొని భోజనం చేశారు. కానీ ఆ తర్వాత వాసాలమర్రిని, అక్కడ ఇండ్ల నిర్మాణాన్ని నాటి సర్కారు పట్టించుకోలేదు. 

కాంగ్రెస్ ​సర్కారు రావడంతో మారిన సీన్​.. 

 కాంగ్రెస్​ సర్కార్​ కొలువు తీరిన తర్వాత వాసాలమర్రిపై స్పెషల్ ​ఫోకస్ ​పెట్టింది. ఆగవ్వ సహా గ్రామంలో ఇండ్లు కోల్పోయిన112 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. చకచకా నిధులు మంజూరుచేయడంతో ఇండ్ల నిర్మాణం పూర్తి కావడంతో వాసాలమర్రికి కొత్త కళ వచ్చింది. కాగా, ఇంట్లో నివాసం ఉంటున్న ఆగవ్వను హౌసింగ్​ ఎండీ గౌతమ్​, యాదాద్రి కలెక్టర్​ అనురాగ్​ జయంతి సోమవారం పలకరించారు.  'ఆగవ్వా.. ఎలా ఉన్నారు? కొత్త ఇల్లు బాగుందా?’ అని పలకరించారు. దీనికి ఆగవ్వ “చాలా సంతోషంగా ఉన్న సారూ.. సొంత ఇంట్ల ఉండాలన్నది నా కల. ఆ ప్రభుత్వంలో తీరలే. కాంగ్రెస్​ సర్కారు వచ్చాక నా  కల నెరవేరింది. ఇప్పుడు బాగుంది. ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు” అని ఆగవ్వ తెలిపారు.

అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు: హౌసింగ్​ ఎండీ గౌతమ్​ 

 అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ అన్నారు. కలెక్టర్​ అనురాగ్​ జయంతి, అడిషనల్​ కలెక్టర్​ ఏ భాస్కరరావుతో కలిసి సింగన్న గూడెంలో డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు, భువనగిరి మండలం అనంతారం, తుర్కపల్లి మండలం వాసాలమర్రి, కొండపురంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వాసాలమర్రిలో పూరి గుడిసెలో ఉంటున్న వారితో మాట్లాడారు. అదే విధంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ముచ్చటించారు. అనంతరం హౌసింగ్​ డిపార్ట్​మెంట్​ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. మంజూరైన ఇండ్లు, పురోగతిలో ఉన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రౌండింగ్​ కాని ఇండ్ల గురించి ఆరా తీశారు.రెండో విడతలో పూరి గుడిసె, రేకుల షెడ్స్​లో నివసించే వారిని గుర్తించి వారికి ప్రయారిటీ ఇవ్వాలని ఆదేశించారు. ఆయన వెంట హౌసింగ్ పీడీ అలివేలు, ఎంపీడీవోలు, ఏఈలు ఉన్నారు.