ఊట్కూర్, వెలుగు: ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడంలో పేదల కల నెరవేరిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. సోమవారం మండలంలోని పులిమామిడి గ్రామంలో ఇందిరమ్మ గృహ ప్రవేశంలో సర్పంచ్ త్రివేణి చెన్నప్ప, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యగ్నేశ్వర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఇల్లు లేని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు మంజూరు చేసి సొంతింటి కల నెరవేర్చడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని, లబ్ధిదారులు సకాలంలో ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో కిశోర్ కుమార్, సూర్యప్రకాశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, పెద్ద సూరయ్య గౌడ్, రేణుక నరేశ్, ధన్వాడ బాలరాజ్ పాల్గొన్నారు.
