
చేర్యాల, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం చేర్యాల ఎంపీడీవో ఆఫీసు ముందు లబ్ధిదారులు ఆందోళన నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయాయ్యని ఎంపీడీవో ఆఫీసులో ప్రొసీడింగ్స్పత్రాలను తీసుకోవాలని గ్రామ సెక్రటరీలు చెప్పారని ఇక్కడికి వస్తే ఇవ్వడం లేదని ఆరోపించారు. ఉదయం 10గంటలకు వచ్చిన లబ్ధిదారులు 4 గంటల పాటు ఆందోళన నిర్వహించారు. వీరికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు.
ఎంపీడీవో వెంటనే వచ్చి ప్రొసీడింగ్స్ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేశారు. ఈ క్రమంలో ఎంపీడీవో ఆఫీసు ముందు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విషయం తెలుసుకున్న చేర్యాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని లబ్ధిదారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. చివరకు ఎంపీడీవో మహమూద్ అలీ వచ్చి రేపు ఉదయం 11 గంటలకు సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ లో ప్రొసీడింగ్స్అందజేస్తామని చెప్పడం తో ఆందోళన విరమించారు.