ఇందిరమ్మ ఇళ్లలో వేగం..! ఆగస్టులో ఉమ్మడి నల్గొండలో 3600 ఇండ్లకు శంకుస్థాపనలు

 ఇందిరమ్మ ఇళ్లలో వేగం..! ఆగస్టులో ఉమ్మడి నల్గొండలో 3600 ఇండ్లకు శంకుస్థాపనలు
  • పనులు ప్రారంభమైన చోట వేగంగా నిర్మాణాలు
  • సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు మొత్తం 27,008 ఇళ్లు మంజూరు

నల్గొండ, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో వేగం పెరిగింది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు అర్హులైన లబ్ధిదారులు మందుకు వస్తున్నారు.  మొదట్లో ప్రభుత్వ నిబంధనలు, తదితర కారణాలతో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు అంతగా ఆసక్తి చూపలేదు. లబ్ధిదారుల్లో అవగాహన పెరగడం, బిల్లులు సక్రమంగా రావడంతో నిరుపేదలైన ప్రజలు వీటి నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఒక్క ఆగస్టు నెలలోనే సూర్యాపేట, నలగొండ జిల్లాలో 3,600 ఇళ్లకు భూమి పూజలు జరిగాయి.

మొత్తం 27,008 ఇండ్లు మంజూరు 

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది.  రూ. 5 లక్షలతో ప్రభుత్వం రూపొందించిన నమునాలో ఇంటి నిర్మాణాలు లబ్ధిదారుడే నిర్మించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను కేటాయించారు.

సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తుంగతుర్తి నియోజకవర్గాలకు 3500 చొప్పున ఇళ్లు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 8,744 ఇళ్లుమంజూరయ్యాయి. నల్గొండ జిల్లాకు 18,264 ఇండ్లు మంజూరయ్యాయి. 

వేగంగా శంకుస్ధాపనలు.. పనులు..

మొదట మంచి రోజులు లేకపోవడం ప్రభుత్వం విధించిన నిబంధనలతో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. క్రమంగా ప్రజల్లో అవగాహన రావడం, ఇంటి నిర్మాణాలు బాగానే ఉండడంతో ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. బిల్లులు సైతం ఎప్పటికప్పుడు చెల్లిస్తుండడంతో ఇంటి నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు ఇంటి నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు దాదాపు రూ.25 కోట్లను వారి అకౌంట్లలో జమ అయ్యాయి. 

నల్గొండ జిల్లాలో రూ. 32 కోట్లకు పైగా లబ్ధిదారుల ఖాతాలో జమయ్యాయి.  శ్రావణ మాసం రావడంతో ఆగస్టులో భూమి పూజలు ఊపందుకున్నాయి. ఈ నెలలో  సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 1034 మంది అర్హులైన పేదలు ఇందిరమ్మ ఇంటికి భూమిపూజ చేయగా నల్గొండలో  2566  మంది భూమి పూజ చేశారు. 

యాదాద్రిలో 'ఇందిరమ్మ' స్పీడ్​

యాదాద్రి, వెలుగు :  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో యాదాద్రి జిల్లా స్పీడ్​గా ముందుకు సాగుతోంది. మంజూరైన ఇండ్లలో 55 శాతం ఇండ్ల నిర్మాణం పురోగతిలో ఉండి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. యాదాద్రి జిల్లాకు మొదటి విడతలో 9707 ఇండ్లను అలకేట్​ చేశారు. వీటిలో 9495 మంది లబ్ధిదారులకు మంజూరు చేశారు.  వీటిలో 7743 ఇండ్లకు ముగ్గులు పోయగా 5138 బేస్‌మెంట్ లెవల్, ఆపై లెవల్స్​లో నిర్మాణం పూర్తయింది.  వీటిలో 3558 మందికి రూ. లక్ష చొప్పున మొదటి విడత బిల్లు వారి అకౌంట్లలో జమ అయ్యాయి.

 గోడల వరకూ నిర్మాణం పూర్తైన 497 ఇండ్లకు రూ. 2 లక్షల చొప్పున జమ కాగా, స్లాబ్​ లెవల్​కు చేరుకున్న 141 ఇండ్లకు రూ. 4 లక్షల చొప్పున అకౌంట్లలో జమ అయ్యాయి. బేస్‌మెంట్ పూర్తి చేసుకున్న మరో 942 ఇండ్లకు రూ. లక్ష చొప్పున జమ కావాల్సి ఉంది. నిర్మాణం పూర్తైన 10 ఇండ్లకు మరో రూ. లక్ష చొప్పున జమ చేయాల్సి ఉంది. మొత్తంగా జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లకు ఇప్పటివరకూ రూ. 51 కోట్లను జమ చేశారు.  

పీడీకి ఎండీ అభినందన

ఇండ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన యాదాద్రి జిల్లాను హౌసింగ్​ డిపార్ట్​మెంట్​ ఎండీ వీపీ గౌతమ్​ అభినందించారు. జిల్లా హౌసింగ్​ పీడీ విజయ్​ సింగ్​కు ప్రశంసాపత్రం అందించిన ఆయన గిఫ్ట్​గా ల్యాప్​ ట్యాప్​ అందించారు. 

లబ్ధిదారులు ముందుకు రావాలి : అర్హులైన ప్రతి ఒక్క నిరుపేదకు ఇంటిని మంజూరు చేస్తోంది. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టాలి. బిల్లులను సైతం వెంట వెంటనే ప్రభుత్వం చెల్లిస్తోంది.- సిద్ధార్ధ, హౌజింగ్‌పీడీ, సూర్యాపేట జిల్లా