
- ఏండ్లకేండ్లుగా చెల్లించని రాష్ట్ర సర్కారు
హైదరాబాద్, వెలుగు: టీఎస్ ఐపాస్‌తో దేశంలోనే పారిశ్రామిక విప్లవం తెచ్చామని చెప్తున్న కేసీఆర్ సర్కారు.. రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మాత్రం సబ్సిడీలు ఇస్తలేదు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మూడేండ్లుగా, ఇతరులకు ఏడేండ్లుగా రాయితీలు రావడం లేదు. ప్రచార ఆర్భాటం కోసం మంత్రులు చెక్కులివ్వడం మినహా పైసా కూడా రిలీజ్ చేయడం లేదు. దీంతో పరిశ్రమలను నడుపలేక నిర్వాహకులు తంటాలు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఇతర చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు రూ. 3,580.38 కోట్లు రాయితీల రూపంలో ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఏండ్లకేండ్లుగా వీటిని ఇవ్వకపోవడంతో పలు పరిశ్రమలు మూసివేసే దశలో ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా సబ్సిడీలు రిలీజ్ చేయాలని, లేకుంటే లక్షలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదముందని నిర్వాహకులు అంటున్నారు.
ఎవరికి ఎంత రావాలంటే..?
ఎస్సీ, ఎస్టీ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి టీ ప్రైడ్ తీసుకువచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. ఎస్సీ స్పెషల్ డెవలప్‌మెంట్‌ఫండ్, ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఏటా బడ్జెట్లోనే వీరికి పారిశ్రామిక రాయితీల కోసం నిధులు కేటాయిస్తున్నది. కానీ ఆ నిధులు రిలీజ్ చేయకుండా ఏటా పేపర్ల మీదే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నది. రాష్ట్రంలో ఎస్సీలు ఏర్పాటు చేసిన 14,459 పరిశ్రమలకు ప్రభుత్వం రూ.603.70 కోట్ల సబ్సిడీలు బకాయి పడింది. ఎస్టీలు ఏర్పాటు చేసిన 18,400 పరిశ్రమలకు రూ.796.34 కోట్లు ఇవ్వాల్సి ఉంది. 2020 నుంచి ఏటా అరకొర తప్ప పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయడం లేదు. ఇతర పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన 19,109 ఇండస్ట్రీస్‌కు రూ. 2,109.73 కోట్ల రాయితీలు ఇవ్వాల్సి ఉంది. దివ్యాంగ పారిశ్రామికవేత్తలు 1,454 పరిశ్రమలు ఏర్పాటు చేయగా.. వారికి రూ.70.61 కోట్లు ఇవ్వాల్సి ఉంది. వీరికి 2016 నుంచి సబ్సిడీలు రిలీజ్ చేయడం లేదు. మొత్తంగా ప్రభుత్వం చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు రూ.3,580.38 కోట్ల సబ్సిడీ సొమ్మును సర్కారు బకాయి పడింది. ఈ మొత్తం రిలీజ్ చేయాలని ప్రభుత్వ పెద్దలు, ఫైనాన్స్, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ల చుట్టూ నిర్వాహకులు చెప్పులరిగేలా తిరిగినా ఫాయిదా ఉంటలేదు.
రూ.2,503 కోట్లకు ఇస్తామన్నది రూ.32 కోట్లే
2022 – 23 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఎస్సీ ఎస్డీఎఫ్, ఎస్టీ ఎస్డీఎఫ్ నుంచి రూ.2,503.58 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో రూ.1,254.17 కోట్లకే బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు. అందులో రూ.32.74 కోట్లు మాత్రమే రిలీజ్ చేసేందుకు ఎల్వోసీ జారీ చేశారు. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనున్నా మిగతా నిధులు రిలీజ్ చేసేందుకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏమాత్రం సుముఖంగా లేదని పరిశ్రమల నిర్వాహకులు అంటున్నారు. అధికారులను అడిగితే సబ్సిడీలు రిలీజ్ చేసేందుకు డబ్బులు లేవని, ప్రభుత్వ ప్రయారిటీల మేరకే తాము అందుబాటులో ఉన్న నిధులను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామనే జవాబు వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరెంట్ బిల్లులూ అటే!
టీఎస్ఐపాస్, టీ ప్రైడ్ లో భాగంగా రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పే వాళ్లకు భూ కేటాయింపులతో పాటు కరెంట్ బిల్లుల చెల్లింపుల్లో రాయితీలు సహా పలు రకాల ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రంలోని 8,057 పరిశ్రమలకు రూ. 491.10 కోట్ల కరెంట్ బిల్లు రాయితీలు ఇవ్వాల్సి ఉంది. వీటికి స్టేట్ లెవల్, డిస్ట్రిక్ లెవెల్ కమిటీలు ఆమోదం తెలిపి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు పంపాయి. కానీ, పైసా రావడం లేదని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, పావలా వడ్డీ కింద 7,017 పరిశ్రమలకు రూ.440.79 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీలో భాగంగా సేల్స్ టాక్స్ రూపేణ రూ.823.24 కోట్లు, స్టాంప్ డ్యూటీ కింద రూ.53.54 కోట్లు, ల్యాండ్ కాస్ట్ కింద రూ.1.99 కోట్లు, ల్యాండ్ కన్వర్షన్ కోసం రూ.18 లక్షలు, బొగ్గు కొనుగోళ్లకు కాను రీయింబర్స్ మెంట్ రూపంలో రూ.38.66 కోట్లు, కలప కొనుగోలుకు రూ.34.05 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఇన్సెంటివ్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ లో భాగంగా ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ రూపంలో రూ.93 లక్షలు, సేల్స్ టాక్స్ రూ.18.48 కోట్లు, స్టాంప్ డ్యూటీ కింద రూ.8 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం ఎప్పటికి రిలీజ్ చేస్తరో, అసలు ఇస్తరో లేదో తెలియక నిర్వాహకులు తిప్పలు పడుతున్నారు. బ్యాంక్ లోన్లకు ఈఎంఐలు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నామని, పరిస్థితి ఇట్లనే కొనసాగితే పరిశ్రమలను మూసేయడం మినహా తమకు ఇంకోమార్గం లేదని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేటీఆర్ చెక్కు ఇచ్చినా పైసలు రాలే
రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన మంత్రి కేటీఆర్ చెక్కు ఇచ్చి పదిన్నర నెలలవుతున్నా అది పాస్ కావడంలేదు. నెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో అసలు డబ్బులు వస్తాయా లేదా అని పారిశ్రామిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. అంబేద్కర్ జయంతికి ఒక రోజు ముందు, అంటే 2022 ఏప్రిల్ 13న దళిత పారిశ్రామికవేత్తలకు రూ.200 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని మంత్రి కేటీఆర్ చెక్కు రూపంలో అందించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించిన దళితులకు ఈమేరకు వేర్వేరు చెక్కులు కూడా ఇచ్చారు. కేటీఆర్ చెక్కు ఇచ్చినంక పైసలు రావా అనుకొని కొందరు బ్యాంకుల్లో వాటిని వేసుకున్నారు కూడా. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆ సబ్సిడీలను రిలీజ్ చేయకపోవడంతో బ్యాంకర్లు పారిశ్రామికవేత్తలకు ఫోన్లు చేసి చెక్కులు వాపస్ తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వంలో ఇన్ ఫ్లూయెన్స్ చేయగల కొంత మంది మాత్రం నానా తంటాలు పడి తమకు రావాల్సిన సబ్సిడీని తెచ్చుకోగలిగారు. ఇలా రూ. 20 కోట్ల వరకు రిలీజ్ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. మిగతా 90 శాతం అంటే రూ.180 కోట్లు అలాగే ఉండిపోయాయి. వాటి కోసం దళిత పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నా పైసా రిలీజ్ చేయడం లేదు.