తగ్గిన హోల్​సేల్​ ధరలు

తగ్గిన హోల్​సేల్​ ధరలు

న్యూఢిల్లీ : ఆహార వస్తువులు/పదార్థాల ధరల తగ్గుదల కారణంగా టోకు ధరల ఆధారిత ఇన్​ఫ్లేషన్ (డబ్ల్యూపీఐ) ఈ ఏడాది జులైలో ఐదు నెలల కనిష్టం 13.93 శాతానికి పడిపోయింది. డబ్ల్యూపీఐ ఆధారిత ఇన్​ఫ్లేషన్ వరుసగా రెండవ నెలలోనూ నెమ్మదించింది. టోకు ధరలు మరింత తగ్గుముఖం పడతాయనే ఆశలను పెంచింది. టోకు ధరల సూచీ ఆధారిత ఇన్​ఫ్లేషన్ మేలో రికార్డు స్థాయిలో 15.88 శాతానికి చేరుకున్న తర్వాత, జూన్‌‌‌‌‌‌‌‌లో 15.18 శాతానికి తగ్గింది. ఫిబ్రవరిలో ఇది 13.43 శాతంగా ఉంది. పోయిన ఏడాది జులైలో ఇది 11.57 శాతంగా ఉంది.

డబ్ల్యూపీఐ ఇన్​ఫ్లేషన్ జులైలో తగ్గినా, 2021 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నుంచి ఇప్పటికీ రెండంకెల స్థాయిలోనే కొనసాగుతోంది. ఆహార వస్తువుల ఇన్​ఫ్లేషన్ జూన్‌‌‌‌‌‌‌‌లో 14.39 శాతం నుంచి జులైలో 10.77 శాతానికి తగ్గింది. కూరగాయల ధరల పెరుగుదల రేటు పోయిన నెలలో 56.75 శాతం నుంచి జులైలో 18.25 శాతానికి పడింది. ఇంధనం, పవర్ ఇన్​ఫ్లేషన్ జులైలో 43.75 శాతం ఉంది. పోయిన నెలలో 40.38 శాతంగా ఉంది. మానుఫ్యాక్చర్డ్​ ప్రొడక్టులు, నూనె గింజల ఇన్​ఫ్లేషన్ వరుసగా 8.16 శాతం, 4.06 శాతంగా రికార్డయింది.