
న్యూఢిల్లీ: ఇండియాలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 2.07 శాతానికి పెరిగింది. అంతకుముందు నెలలో ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయి 1.55 శాతానికి దిగొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో ఏడాది లెక్కన "హై బేస్ ఎఫెక్ట్" ప్రభావం లేకపోవడం, ఆహార ధరలు మళ్లీ పెరగడంతో ద్రవ్యోల్బణం పెరిగింది. కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) లో కీలకంగా ఉన్న ఆహార ధరలు ఆగస్టులో ఏడాది లెక్కన 0.69శాతం తగ్గాయి.
ఈ ఏడాది జులైలో 1.76శాతం దిగొచ్చాయి. కూరగాయల ధరలు ఆగస్టులో 15.92శాతం తగ్గగా, జులైలో 20.69శాతం తగ్గాయి. ఆగస్టు, సెప్టెంబరులో అధిక వర్షాలతో వరి, పత్తి, సోయాబీన్, పప్పుదినుసుల పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో రానున్న క్వార్టర్లలో ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆర్‌బీఐ పెట్టుకున్న టార్గెట్ 4 శాతానికి దిగువన వరుసగా ఏడో నెలలోనూ ద్రవ్యోల్బణం నమోదైంది.
ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉండడంతో ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ గత నెలలో వడ్డీ రేట్లు 5.50శాతం వద్ద నిలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 100 బేసిస్ పాయింట్ల తగ్గించిన తర్వాత వడ్డీ రేట్లను మార్చలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్‌లో ద్రవ్యోల్బణం పెరగొచ్చని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 3.1శాతంగా నమోదవుతుందని పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో వేసిన అంచనా 3.7 శాతం నుంచి తగ్గించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్‌లో ద్రవ్యోల్బణం 4.9శాతంగా ఉంటుందని పేర్కొంది. ఇది షార్ట్‌టర్మ్ టార్గెట్ 4శాతం కంటే ఎక్కువ.