
ఈసారి ఏడు శాతం కంటే తక్కువే ఉండొచ్చు
న్యూఢిల్లీ: మన ఆర్థిక వ్యవస్థ బాగానే ఉన్నా, ఇన్ఫ్లేషన్ (ధరల భారం) మాత్రం ఇప్పటికీ ఇబ్బందికరంగానే ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఇన్ఫ్లేషన్ టార్గెట్ 2–6 శాతాన్ని మార్చాల్సిన అవసరం లేదని అన్నారు. త్వరలోనే ఇది నాలుగు శాతానికి తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో 7.4 శాతం, ఆగస్టులో ఏడు శాతం రిటైల్ ఇన్ఫ్లేషన్ నమోదు కావడంతో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఇన్ఫ్లేషన్ గత తొమ్మిది నెలలుగా ఆరు శాతం కంటే ఎక్కువగానే నమోదయింది. ఢిల్లీలో శనివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘అక్టోబరు ఇన్ఫ్లేషన్ నంబర్లు సోమవారం విడుదలవుతాయి. ఈసారి ఇన్ఫ్లేషన్ ఏడుశాతం కంటే తక్కువే ఉంటుందని అనుకుంటున్నాం. ఈ సమస్యతో మనం సమర్థంగా పోరాడుతున్నాం. ఎన్నో ఇబ్బందులతో సతమతమవుతున్న సంవత్సరంలోనే ఇండియా జీ20 పగ్గాలు చేపడుతోంది. జీ20లోని చాలా దేశాల కంటే ఇండియా మాక్రోఎకనమిక్ ఫండమెంటల్స్ బాగున్నాయి. ఫారెక్స్ రిజర్వులను ఆర్బీఐ విరివిగా వాడుతున్నదంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆపదల్లో వాడుకోవడం కోసం ఫారిన్ కరెన్సీ పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్నాం. వర్షం వస్తేనే గొడుగు అవసరం ఉంటుంది. మాకు ప్రస్తుతం ఫారిన్ కరెన్సీని వాడుకోవాల్సిన అవసరం లేదు. అవసరమైనన్ని నిల్వలు మా దగ్గర ఉన్నాయి”అని ఆయన వివరించారు. బంగారం నిల్వలు భారీగా తగ్గడంతో ఈ ఏడాది నవంబర్ 4తో ముగిసిన వారానికి భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు 1.087 బిలియన్ డాలర్లు తగ్గి 529.994 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2021 అక్టోబర్ లో వీటి విలువ 645 బిలియన్ డాలర్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది.
మనం వేగంగా ఎదుగుతున్నం...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందన్న నమ్మకం తనకు ఉందని దాస్ అన్నారు. ఈసారి మన ఎకానమీ ఏడుశాతం గ్రోత్ సాధించడం ఖాయమని, ఇది 6.8 శాతం పెరుగుతుందని ఐఎంఎఫ్ కూడా చెప్పిందని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. మాక్రోఎకనమిక్ ఫండమెంటల్స్ బాగుండటం, ఫైనాన్షియల్ సెక్టార్నిలదొక్కుకోవడం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడుశాతం వృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. బ్యాంకింగ్, నాన్–బ్యాంకింగ్ సెక్టార్ల మద్దతుతో మనదేశ ఎకానమీ పటిష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇండియా సహా ప్రపంచంలోని అన్ని దేశాలకు చాలా షాకులు తగులుతున్నాయని చెప్పారు. కరోనా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, గ్లోబల్గా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం... అందరికీ ఇబ్బందేనని వివరించారు. ‘‘యూఎస్ తోపాటు ఇతర ధనిక దేశాలు ద్రవ్యవిధానాన్ని కఠినతరం చేయడం వల్ల ఫైనాన్షియల్ మార్కెట్లకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భారత్ వంటి వర్ధమాన దేశాలపైనా ఈ ఎఫెక్ట్ ఉంది. యూరప్ దేశాలలో మాంద్యం పరిస్థితులు కనిపిస్తున్నాయి కానీ దానిని తప్పించుకోగలిగే అవకాశాలూ ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగానే ఉన్నా, మిగతా దేశాల్లో గ్రోత్ నెమ్మదించింది. ఇండియా పరిస్థితులు బాగానే ఉన్నాయి”ఆయన వివరించారు.