ప్రజాస్వామ్యంపై పెరుగుతున్న నియంతృత్వ ప్రభావం

ప్రజాస్వామ్యంపై పెరుగుతున్న నియంతృత్వ ప్రభావం

కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ

రాయ్‌పూర్: కొందరు జాతి, పేద వ్యతిరేక శక్తులు దేశంలో అసహనాన్ని, విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. సదరు శక్తులు దేశంలో హింసను కూడా రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు. దేశ ప్రజాస్వామ్యంపై నియంతృత్వ పోకడల ప్రభావం పెరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం సాధించిన 75 ఏళ్ల తర్వాత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని దేశ గొప్ప నాయకులు ఊహించి ఉండకపోవచ్చునన్నరు. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణ పనుల ఆరంభ వేడుకల్లో ఆమె వర్చువల్‌గా పాల్గొన్నారు. హిందీలో రికార్డెడ్ వీడియో మెసేజ్‌ను సోనియా పంపారు.

‘ఇప్పుడు చెడు ఆలోచనలు ఆధిపత్యం చూపిస్తున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రమాదంలో పడింది. ప్రజాస్వామ్య సంస్థలు వ్యర్థమవుతున్నాయి. గత కొంత కాలం నుంచి దేశాన్ని నిరోధించే యత్నాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యం ముందు సరికొత్త సవాళ్లు నిలిచాయి. పేద, జాతి వ్యతిరేక శక్తులు ప్రజలను తమలో తాము ఘర్షించుకునేలా చేస్తూ విద్వేషాగ్నిని రగిలిస్తున్నాయి’ అని సోనియా పేర్కొన్నారు.