- టిక్‌టాక్ స్టార్ జేసన్ క్లార్క్ టెర్రిఫిక్ ఫీట్
- వీడియో వైరల్.. 2.1 కోట్ల వ్యూస్
ప్రపంచ వ్యాప్తంగా టిక్‌టాక్ పిచ్చి బాగా ముదిరిపోతోంది. ఏదైనా కొత్తగా చేయాలని ఒక్కొక్కరు ఒక్కో ఫీట్ చేస్తున్నరు. ఈ క్రమంలో ప్రాణాల మీదికి కూడా తెచ్చుకుంటున్నరు. గిట్లనే కొంచెం కొత్తగా చేద్దామనుకున్న టిక్‌టాక్ స్టార్ జేసన్ క్లార్క్ చావు అంచుల దాకా వెళ్లొచ్చాడు. అమెరికాకు చెందిన ఈయన ఇటీవల ఓ టెర్రిఫిక్ ఫీట్ చేయగా, అదికాస్తా బెడిసికొట్టడంతో భయంతో వణికిపోయిండు. ఆ వీడియోను ఆయనే స్వయంగా టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి తన బాధను చెప్పుకొచ్చిండు. జేసన్ క్లార్క్ ఇటీవల తన ఫ్రెండ్, పెట్ డాగ్‌తో కలిసి గడ్డకట్టిన సరస్సుకు వెళ్లిండు. హోల్ ఉన్న ప్రాంతం నుంచి లేక్‌లో దూకిండు. ఈదుకుంటూ చాలా దూరం వెళ్లిండు. అయితే తిరిగి వచ్చేటప్పుడు మాత్రం తొవ్వ మరిచిపోయిండు. బయటకు వద్దామంటే తాను దిగిన హోల్ ఎక్కడ ఉందో కనిపించలేదు. ఎటు చూసినా మంచు గడ్డలే. కిందా మీదా అంతటా అవే. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికే శరీరమంతా గడ్డకట్టిపోతోంది. ఎలాగోలా మెల్లగా హోల్ దొరికింది. ఇంకేముంది… బతుకు జీవుడా అంటూ మనోడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇగో గిట్ల టిక్ టాక్ ఫీట్ చేద్దామనుకుంటే… అదికాస్తా టెర్రిఫిక్ ఫీట్ అయింది. జేసన్ క్లార్క్ ఈ వీడియోను టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘‘చావుకు దగ్గరగా వెళ్లాను. ఇంకోసారి ఇలాంటివి చేయను అంటూ” మనోడు మంచి మాటలు చెప్పిండు ఇగ. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో టిక్‌టాక్‌లో 2.1 కోట్ల, ఇన్ స్టాగ్రామ్ లో 1.6 లక్షల వ్యూస్ వచ్చాయి. జేసన్ క్లార్క్ కు టిక్‌టాక్‌లో 4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.