న్యూఢిల్లీ: వేదాంత జాయింట్ వెంచర్ నుంచి వైదొలగాలనే ఫాక్స్‌కాన్ నిర్ణయం మన సెమికండక్టర్ ఫ్యాబ్రికేషన్ గోల్‌పై ఎఫెక్ట్ చూపించదని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. రెండు ప్రైవేటు కంపెనీల మధ్య వ్యవహారంలో ప్రభుత్వానికి ఏమీ సంబంధం ఉండదని చెబుతూ, ఇండియా మార్కెట్లో ఇప్పుడు ఆ రెండు కంపెనీలు.. దేనికది సొంతంగా ఏమి చేయొచ్చో, ఎలా చేయొచ్చో ఆలోచించుకోవచ్చని అన్నారు.
పై రెండు కంపెనీలకు సెమికండక్టర్ రంగంలో ముందస్తు అనుభం లేదని, వేరొకరి దగ్గర టెక్నాలజీ తెచ్చుకుందామనుకున్నాయని పేర్కొన్నారు. జాయింట్ వెంచర్ కంపెనీ 28ఎన్ఎం ఫ్యాబ్ కోసం ప్రపోజల్ ఇచ్చాయని, కానీ అందుకవసరమైన టెక్నాలజీ పార్ట్నర్ వాటికి దొరకలేదని రాజీవ్ చంద్రశేఖర్ వివరించారు. జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారానే వేదాంత 40 ఎన్ఎం ఫ్యాబ్ కోసం కొత్త ప్రపోజల్ ఇచ్చిందని, దీనిని పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు. జాయింట్ వెంచర్ నుంచి తప్పుకుంటున్నామని ప్రకటించిన ఫాక్స్‌కాన్, కారణాలేవిటనేది మాత్రం బయటకు చెప్పలేదు.
