గత ఆరు నెలల్లో తగ్గిన ఐపీఓల జోరు..6 నెలల్లో 14 ఐపీఓలే..

గత ఆరు నెలల్లో తగ్గిన ఐపీఓల జోరు..6 నెలల్లో 14 ఐపీఓలే..

ముంబై : ఈ ఫైనాన్షియల్​ ఇయర్​ మొదటి ఆరు నెలల్లో ఐపీఓల జోరు తగ్గింది. ఈ ఆరు నెలల కాలంలో 14 కంపెనీలు రూ. 35,456 కోట్లను ఐపీఓల ద్వారా సేకరించాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 32 శాతం తగ్గాయి. కిందటేడాది మొదటి ఆరు నెలల్లో 25 ఐపీఓలు మార్కెట్లోకి వచ్చాయి. కాకపోతే, సెబీ అనుమతి ఇప్పటికే పొంది ఐపీఓకి రావడానికి రెడీగా 71 కంపెనీల దాకా ఉన్నట్లు ప్రైమ్​ డేటాబేస్​ వెల్లడించింది. మరో 43 కంపెనీలు సెబీ అప్రూవల్​కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. మొత్తం 114 కంపెనీలు ఐపీఓ ప్లాన్​లో ఉండగా, వీటిలో 10 కొత్త తరపు టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయని వివరించింది. ఈ ఫైనాన్షియల్​ ఇయర్​ తొలి ఆరు నెలల్లో ఎల్​ఐసీ ఐపీఓ కూడా ఉందని ప్రైమ్​ డేటాబేస్​ ఎండీ ప్రణవ్​ హాల్దియా చెప్పారు.

ఐపీఓ ద్వారా రూ. 20,557 కోట్లను ఎల్ఐసీ  సమీకరించింది. దేశంలో ఇప్పటిదాకా ఇదే అతి పెద్ద ఐపీఓ. డెల్హివరీ, రెయిన్​బో చిల్డ్రన్స్​ హాస్పిటల్స్ కూడా ఇదే టైములో ఐపీఓలకు వచ్చాయి. ఐపీఓలకు వచ్చిన 14 కంపెనీలలో ఒకే ఒక్క కొత్త తరపు టెక్నాలజీ కంపెనీ ​డెల్హివరీ ఉంది. 14లో నాలుగు ఐపీఓలకు మాత్రమే భారీగా రెస్పాన్స్​ వచ్చింది. మిగిలిన ఐపీఓలు 1 నుంచి 3 రెట్లు ఎక్కువ సబ్​స్క్రిప్షన్​ పొందగలిగాయి. రిటెయిల్​ ఇన్వెస్టర్ల అప్లికేషన్లు కూడా బాగా తగ్గిపోయాయి. అంతకు ముందు ఏడాదిలో  రిటెయిల్​ ఇన్వెస్టర్ల  అప్లికేషన్లు సగటున 15.56 లక్షలైతే, ఈ ఏడాదిలో ఇది 7.57 లక్షలకే పరిమితమైనట్లు ప్రణవ్​ హాల్దియా చెప్పారు.