
- బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల బ్లాక్‌దందా
- రాష్ట్రంలో ఎక్కడా దొరకని పరిస్థితి
- నాలుగైదు బ్రాండ్లున్నా నో స్టాక్
నిన్నమొన్నటి వరకు రెమ్డిసివిర్, టొసిలిజుమాబ్ ఇంజక్షన్ల బ్లాక్ దందా నడిచింది. ఇంకా కొంత నడుస్తూనే ఉంది. ఇపుడు పోస్ట్ కరోనా సైడ్ ఎఫెక్ట్‌గా వస్తున్న బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్ మైకోసిస్) కేసులు ఎక్కువవుతుండటంతో ఆ ట్రీట్‌మెంట్‌కు అవసరమయ్యే మందుల దందా ఎక్కువైంది. మార్కెట్‌లో ఎక్కడా కూడా బ్లాక్ ఫంగస్ ట్రీట్‌మెంట్‌కు వాడే ఇంజక్షన్లు దొరకట్లేదు. ఎవరిని అడిగినా లేవనే చెబుతున్నారు.
హైదరాబాద్, వెలుగు: కరోనా కేసులు పెరగడంతో నిన్నమొన్నటి వరకు రెమ్డిసివిర్, టోలిసిజుమాబ్ ఇంజక్షన్ల బ్లాక్ దందా నడిచింది. ఇంకా కొంత నడుస్తూనే ఉంది. ఇపుడు పోస్ట్ కరోనా సైడ్ ఎఫెక్ట్‌గా వస్తున్న బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్ మైకోసిస్) కేసులు ఎక్కువవుతుండటంతో ఆ ట్రీట్‌మెంట్‌కు అవసరమయ్యే మందుల దందా ఎక్కువైంది. మార్కెట్‌లో ఎక్కడా కూడా బ్లాక్ ఫంగస్ ట్రీట్‌మెంట్‌కు వాడే ఇంజక్షన్లు దొరకట్లేదు. ఎవరిని అడిగినా లేవనే చెబుతున్నరు.
ఒక్కో పేషెంట్‌కు 12 నుంచి 36 వయల్స్!
బ్లాక్ ఫంగస్‌కు సాధారణంగా లైపోజోమల్, ఆంఫోటెరిసిన్ బి ఇంజక్షన్లు వాడుతుంటారు. పేషెంట్ కండీషన్ బట్టి వారం నుంచి 6 వారాల వరకు వీటిని వినియోగిస్తారు. ఒక్కో ఇంజక్షన్ వయల్ రేటు రూ. వెయ్యి నుంచి రూ. 7 వేల వరకు ధర ఉంది. పేషెంట్లకు ఇలాంటి ఇంజక్షన్లు 12 నుంచి 36 వయల్స్ వాడాల్సి వస్తుందని డాక్టర్లు ప్రిస్కైబ్ చేస్తున్నారు. బ్లాక్ ఫంగస్ అరుదైన వ్యాధి కావడంతో మార్కెట్‌లో ఎక్కువ స్టాక్ పెట్టుకోలేదని పంజాగుట్టలోని ఓ ప్రముఖ మెడికల్ షాప్ ఓనర్ తెలిపారు. లైపోజోమల్, ఆంఫోటెరిసిన్–బి మన దగ్గర ఐదారు బ్రాండ్ పేర్లతో దొరుకుతాయి. వీటిని మార్కెటింగ్ చేసే కంపెనీ ప్రతినిధులను సంప్రదించినా వాళ్లూ ఇదే ఆన్సర్ చెబుతున్నారు. ప్రస్తుతం తమ వద్ద స్టాక్ లేదని, స్టాక్ రాగానే పేషెంట్ ట్రీట్‌మెంట్ పొందుతున్న హాస్పిటల్‌లో అందజేస్తామని అంటున్నారు.
రాష్ట్రంలో 200 కేసులు
ప్రస్తుతం రాష్ట్రంలో 200 వరకు బ్లాక్ ఫంగస్ కేసులున్నాయి. మూడ్రోజుల క్రితం గాంధీకి మూడు కేసులొచ్చాయి. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్లకు రోజూ పదుల సంఖ్యలో వస్తున్నాయి. సెకండ్ వేవ్‌లోనే వంద, రెండు వందల మందికి ట్రీట్ మెంట్ ఇచ్చిన హాస్పిటళ్లూ రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ఈ వ్యాధితో చనిపోయారు. ఈ నేపథ్యంలో కోఠిలోని ఈఎన్టీ హాస్పిటల్‌ను దీని ట్రీట్‌మెంట్‌కు నోడల్ హాస్పిటల్‌గా మార్చారు. గుజరాత్‌లో బ్లాక్ ఫంగస్ సోకిన కేసుల్లో 50 శాతం మరణాలున్నాయి. ఇక్కడి డాక్టర్లు కూడా ఇది ప్రాణాంతకమైనదేనని చెబుతున్నారు. ముందే గుర్తిస్తే బయట పడొచ్చని అంటున్నారు. ఇలాంటి కేసులు కనిపించిన తొలి రోజుల్లో అందుబాటులోని మందులతో డాక్టర్లు ట్రీట్‌మెంట్ చేశారు. కేసులు పెరగడంతో ఇంజక్షన్ల కొరత మొదలైంది. వారంలోనే ఇంజక్షన్లు మార్కెట్‌లో కనిపించకుండా పోయాయి. మెడికల్‌షాపుల్లో కౌంటర్ సేల్ చేసే ఈ ఇంజక్షన్లు ఇపుడు రెమ్డిసివిర్ తరహాలో కంపెనీ రిప్రజెంటేటివ్‌ల దగ్గరకు వెళ్లి తీసుకోవాల్సి వస్తోంది.
చిన్న వ్యాధే అంటున్న వైద్యాధికారులు
కంపెనీ ప్రతినిధులమని చెప్పి కొందరు హాస్పిటల్ పరిసరాల్లో ఎక్కువ ధరకు మందులను అమ్మి పోతున్నారు. వారం క్రితం రూ. 4 వేల రేంజ్‌లో ఉన్న ఒక ఇంజక్షన్‌ను మినిస్టర్ రోడ్‌లోని కార్పొరేట్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ పొందుతున్న ఓ పేషెంట్ బంధువులు రూ. 8 వేలకు కొన్నారు. తాజాగా ఒక రకం బ్రాండ్ ఇంజక్షనే కావాలని డాక్టర్చెప్పడంతో రూ. 7 వేల మందును రూ. 50 వేలకు కొనాల్సి వచ్చింది. ట్రీట్‌మెంట్‌కు అవసరమైన మందులు బ్లాక్ మార్కెట్‌కు చేరడంతో పేషెంట్ల బంధువులు ఇబ్బంది పడుతున్నారు. వైద్యాధికారులేమో ఇది చిన్న వ్యాధి అని, మందులు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. అవి ఎక్కడ దొరుకుతాయి, రేటెంత అనే విషయం మాత్రం ఇప్పటికీ చెప్పలేదు. రెమ్డిసివిర్ తరహాలో బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లనూ కంపెనీ కౌంటర్ల ద్వారా అందజేయాలని పేషెంట్ల బంధువులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
గాంధీలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు
రెండ్రోజుల్లో ముగ్గురు మృతి?
పద్మారావునగర్, వెలుగు: కరోనా నోడల్ కేంద్రం గాంధీ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న బ్లాక్ ఫంగస్ పేషేంట్ల సంఖ్య పెరుగుతోంది. వారం క్రితం ముగ్గురు పేషెంట్లు ఉండగా సోమవారం నాటికి ఈ సంఖ్య 16కి పెరిగింది. వీళ్లలో రెండ్రోజుల్లోనే ముగ్గురు మృతి చెందినట్టు సమాచారం. గాంధీ ఆస్పత్రి వర్గాలు మాత్రం ఒక్కరే చనిపోయినట్టు ధ్రువీకరించాయి. ఈ కేసులన్నీ రెఫరల్‌గా రాష్ర్టంలోని ఆయా ప్రాంతాల నుంచి గాంధీకి వచ్చినట్టు తెలిసింది. మెయిన్బిల్డింగులోని 2వ, 7వ ఫ్లోర్‌లో ప్రత్యేక వార్డుల్లో వీళ్లకు ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్టు సమాచారం. బ్లాక్ ఫంగస్ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా కింగ్ కోఠి ఆస్పత్రిని నోడల్ కేంద్రంగా నిర్ణయించినా అక్కడ వసతుల కొరతతో గాంధీలోనే ట్రీట్‌మెంట్ చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.