రెండు హెలికాప్టర్లను ఢీకొట్టిన విమానం

రెండు హెలికాప్టర్లను ఢీకొట్టిన విమానం

నేపాల్‌ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లుక్లాలోని తెన్‌ జింగ్‌ హిల్లరీ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్‌ అవుతుండగా సమ్మిట్‌ ఎయిర్‌ కు చెందిన ఓ విమానం ప్రమాదవశాత్తూ.. అక్కడి హెలిప్యాడ్‌ లో నిలిపి ఉంచిన రెండు హెలికాప్టర్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విమానం లుక్లా నుంచి కాఠ్‌ మండూకు ప్రయాణించాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని స్థానిక హస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరాల్లో ఒకటైన ఖొమొలుంగామాకు ఈ విమానాశ్రయం అతి సమీపంలో ఉంటుంది. దీంతో ఏప్రిల్‌, మే మాసాల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

నేపాల్‌ కు చెందిన ఓ వైమానిక అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. టేకాఫ్‌ అవుతున్న సమయంలో రన్‌ వేపై నుంచి అదుపుతప్పిన విమానం నేరుగా సమీపంలోని హెలిప్యాడ్‌ లో ఉన్న రెండు హెలికాప్టర్లను ఢీకొట్టింది. దీంతో ఆ సమయంలో అక్కడ ఉన్న ఎస్సై రామ్‌ బహదూర్‌, కోపైలట్‌ ఢుంగానా అక్కడిక్కడే మృతి చెందగా.. ఏఎస్సై బహదూర్‌ శ్రేష్ఠ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలొదిలారు. అలాగే విమానంలో ఉన్న పైలట్‌తో పాటు హెలికాప్టర్‌లోని మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.