వర్గీకరణ లేని మహిళా బిల్లుతో బీసీ కులాలకు అన్యాయం

వర్గీకరణ లేని మహిళా బిల్లుతో బీసీ కులాలకు అన్యాయం

76 ఏండ్ల ప్రజాస్వామ్య దేశంలో ఓబీసీ కులాల్లోని సుమారు 2400 కులాలకు అసెంబ్లీ,  లోక్​సభల్లో ప్రాతినిధ్యం లేని పరిస్థితి నేటికీ ఉన్నది. ఉత్తరాదిన ప్రధాన పార్టీలైన సమాజవాది, బహుజన సమాజ్, రాష్ట్రీయ జనతాదళ్ యునైటెడ్, దక్షిణాదిన అన్నా డీఎంకె, డీఎంకె పార్టీలు మినహా అన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు అగ్రకుల పునాదుల మీద ఏర్పడినవే. అందుకే వారి విధానాలు వారి కులాల ప్రయోజనాల కోసమే అన్నట్టుగా ఉంటున్నాయి. భారత రాజ్యాంగ రచనలోనే వెనుకబడిన కులాలకు అన్యాయం జరిగింది. అసలు దేశంలో  వెనుకబడిన కులాలే లేవన్నట్లుగా రాజ్యాంగాన్ని రాసి వెనుకబడిన కులాలను కాస్త సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులుగా చిత్రీకరించారు. 

ఇందులో దాగి ఉన్న మర్మాన్ని నిశితంగా గమనిస్తే.. కులాలను తరగతులుగా ఎప్పుడైతే రాజ్యాంగంలో సూచించారో, ఆనాడే వెనుకబడిన కులాల అస్థిత్వం కనుమరుగైంది. అందుకే రాజ్యాంగంలో వెనుకబడిన కులమే లేదని చెబుతున్నప్పుడు బీసీ కులగణన ఎందుకు చేస్తారు?, బీసీ రిజర్వేషన్లపై క్రీమీలేయర్ విధానాన్ని ఎందుకు ఎత్తివేస్తారు?, మొత్తం వర్టికల్ రిజర్వేషన్ 50 శాతం పరిమితిని ఎందుకు ఎత్తివేస్తారు? ఇలాంటి అనేక న్యాయపరమైన చిక్కుముడుల పరిష్కారానికి  వెనుకబడిన కులాల హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని సవరించి రాజ్యాంగంలోని వెనుకబడిన తరగతులకు సంబందించిన  అధికరణల్లో ‘తరగతులు’ అనే పదాన్ని ‘కులాలుగా’ మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అప్పుడే బీసీ కులాలకు న్యాయం జరుగుతుంది. 

రిజర్వేషన్ల వర్గీకరణ జరగాల్సిందే..

ప్రపంచ దేశాల్లో నేటికీ లింగ వివక్షత కొనసాగుతోంది. మన దేశంలో లింగ వివక్షత కంటే కుల వివక్ష ప్రధానంగా కనిపిస్తుంది. ప్రపంచ దేశాల చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం10 నుంచి 40 శాతం వరకు ఉంది. వేల సంవత్సరాల నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో బీసీ కులాలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేనిదే జనాభా దామాషా పద్ధతిలో వారికి వాటా దక్కదని నేటి గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత లోక్​సభలో సుమారు 80(14%) మంది, రాజ్యసభలో సుమారు 30(13%) మంది మహిళలు ఉన్నారు. వారిలో 90% మంది మహిళలు అగ్రకులాలకు చెందిన వారే ఉన్నారు. ఇక బీసీలకు సంబంధించి లోక్​సభలో110 (20%) మంది, రాజ్యసభలో 49 (20%) మంది సభ్యులు ఉన్నారు. అలాగే బీసీల ప్రాతినిధ్యం1950 నుంచి నేటి వరకు గమనించినట్లయితే లోక్​సభ, రాజ్యసభ, అసెంబ్లీల్లో ప్రాతినిధ్యం 20 శాతానికి మించడం లేదు. అందుకే అధికార, ప్రతిపక్ష పార్టీలు మహిళా బిల్లుతో పాటుగా, బీసీ కులాలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు వర్గీకరణతో అమలు చేసే విధంగా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించి న్యాయం చేయాలి. లేదంటే దేశంలోని బీసీ కులాలు ఏకమై స్వతంత్ర రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకుని వారి ఓట్లు వారే వేసుకొని రాజ్యాధికారంలోకి రావాలి. లేదంటే గత కాలపు గడ్డు పరిస్థితులే కొనసాగుతాయి. 

కేంద్ర ప్రభుత్వం106వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టసభలైన లోకసభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించబోతున్నది. ఈ బిల్లు చట్టంగా మారి అమలైతే.. దేశంలో 50 శాతానికి పైగా జనాభా కలిగిన సుమారు 2,640 వెనుకబడిన కులాలకు రాజకీయంగా అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నది.

రిజర్వేషన్​వాళ్ల కోసమేనా?

1951 నుంచి రాజ్యాంగంలోని ఆర్టికల్ 330, 332, 334 అధికరణల ద్వారా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి జనాభా దామాషా పద్ధతిలో చట్టసభలైన లోక్​సభ, అసెంబ్లీల్లో మొదటి పది సంవత్సరాల కోసం రిజర్వేషన్లు కల్పించారు. రిజర్వేషన్ల అమలు పరిమితిని ప్రతి పది సంవత్సరాలకు ఒక్కసారి మరో పది సంవత్సరాలను పొడిగిస్తూ, కేంద్ర ప్రభుత్వం 2020లో 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్లను 2030 వరకు పొడిగించింది. అలాగే ఆంగ్లో ఇండియన్ లకు ఆర్టికల్ 331, 333 ద్వారా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో ప్రాతినిధ్యం కల్పించారు. అయితే 2020లో కేంద్ర ప్రభుత్వం 104వ రాజ్యాంగ సవరణలో ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్లను రద్దు చేసింది. నేడు కేంద్ర ప్రభుత్వం 106వ రాజ్యాంగ సవరణ ద్వారా నూతనంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 330ఎ, 332ఎ, 334ఎ, 239ఎఎ లను చేరుస్తూ మొత్తం మహిళా జనాభాలో 50 శాతానికి పైగా మెజారిటీ కలిగిన వెనుకబడిన కులాలకు చెందిన మహిళలను విస్మరించి మహిళలకు గంపగుత్తగా 33 శాతం ఎస్సీ, ఎస్టీ మహిళలకు వారి కోటాలో 33 శాతం రిజర్వేషన్లను ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో కల్పిస్తున్నారు. ఫలితంగా నూతన సవరణ బిల్లు నేరుగా అగ్రకులాల కోసం 33 శాతం రిజర్వేషన్లు కల్పించుకున్నట్లు అయింది. అందుకే దక్షిణాదిన ద్రవిడ రాజకీయ పార్టీలు, ఉత్తరాదిన సమాజ్ వాది, బహుజన సమాజ్, రాష్ట్రీయ జనతాదళ్ వంటి రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు కూడా సబ్ కోటా పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఎవరి కోటా వాళ్లకు కావాలి

దేశంలో స్థానిక సంస్థలైన గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని 1992/1993లో 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 243టీ, అనుబంధ ఆర్టికల్స్​ను చేరుస్తూ 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ప్రాతినిధ్యం కల్పించారు. అలాగే మహిళలకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో ప్రాతినిధ్యం కల్పించాలని మొదటి సారిగా1996లో మహిళా బిల్లును తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత 2010లో ఇదే మహిళా బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. కానీ, లోక్​సభలో ఆనాడు సమాధి వాది, బహుజన సమాజ్ వాది, రాష్ట్రీయ జనతాదళ్, డీఎంకె, అన్నాడీఎంకే తదితర రాజకీయ పార్టీలు సదరు మహిళా బిల్లులో బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసి, లోక్​సభలో బిల్లును అడ్డుకున్నారు. నాటి నుంచి నేటి వరకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు బీసీ మహిళలను మహిళలుగా గుర్తించలేదు. అందుకే నేడు బీసీ మహిళా రిజర్వేషన్లను విస్మరించి మహిళా బిల్లును ముందుకు తీసుకెళుతున్నాయి.

 కోడెపాక కుమార స్వామి,  
సోషల్​ ఎనలిస్ట్