వడ్ల కొనుగోళ్లలో రైతులకు తీవ్ర అన్యాయం

 వడ్ల కొనుగోళ్లలో రైతులకు తీవ్ర అన్యాయం
  • కొనుగోలు కేంద్రాలు, మిల్లుల్లో దోపిడీ
  • కొనంగనే ఆన్ లైన్ లో ఎంటర్ చేస్తలే.. పట్టించుకోని సర్కార్
  • రూ.వెయ్యికోట్లపైనే దోపిడీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు అరి గోస పడుతున్నారు. తాలు, తేమ, తరుగు పేరుతో కొనుగోలు సెంటర్లలో నిర్వాహకులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రాష్ట్ర సర్కారు పట్టిం చుకోకపోవడంతో ఎక్కడ చూసినా ఇదే వ్యవహారం సాగుతున్నది. కొన్ని చోట్ల కొనుగోలు సెంటర్లలో వడ్లు కాంటా అయినా కూడా కోతలు తప్పడం లేదు.

లారీ లోడ్ మిల్లర్లకు చేరినంక కూడా వడ్లు నాణ్యత లేవంటూ, తాలు పేరుతో బస్తాలకు బస్తాలు కోత పెడుతున్నారు. నిబంధనల ప్రకారం కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు 40 కిలోల తూకం ఉండే బస్తాకు 400 గ్రాముల వడ్లను మాత్రమే తరుగు కింద తీసుకోవాలి. కానీ.. తేమ, తాలు, తరుగు, ఇతర ఖర్చులకు అని చెప్తూ.. క్వింటాల్ వడ్లకు ఐదారు కిలోలు తూకం కట్‌‌‌‌ చేసుకుంటున్నారు.

సెంటర్ల నుంచి లారీల్లో రైస్ మిల్లులకు చేరిన తరువాత మరోసారి వడ్లు బాగాలేవంటూ మిల్లర్లు బస్తాకు కిలో నుంచి రెండు కిలోల వరకూ కోత పెడుతున్నారు. దీంతో రెండు చోట్లా కలిపి రైతులు ఒక బస్తాకు 2 నుంచి 3 కిలోల వరకు.. క్వింటాల్ వడ్లకు 5 నుంచి 7 కిలోల వరకు నష్టపోతున్నారు.

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఎంటర్‌‌‌‌ చేస్తలేరు 

కొనుగోలు సెంటర్లలో రైతుల ధాన్యాన్ని తూకం వేసి, వివరాలను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నమోదు చేసి రైతుల కు ట్రక్‌‌‌‌ షీట్‌‌‌‌ ఇవ్వాలి. కానీ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నమోదు చేయకుండా రైతులకు ఒక రిసీప్ట్‌‌‌‌ ఇచ్చి లారీలను మిల్లర్లకు పంపుతున్నారు. మిల్లర్లు ధాన్యం దించుకుని చెక్‌‌‌‌ చేసుకుని ఓకే అన్న తర్వాతే రైతులకు ట్రక్ షీట్ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నమోదు చేస్తున్న రు. రైతులను మిల్లుల వద్దకు రానివ్వకుండా నిర్వాహకులకే సమాచారం ఇస్తున్నారు. ఇలా మిల్లర్లు, సెంటర్ల నిర్వాహకులు, అధికారులు కుమ్మ క్కై కోతలు పెడుతున్నరు. అన్ని జిల్లాల్లోనూ ఈ దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

ఏడు లక్షల టన్నుల దోపిడీ

రాష్ట్రంలో ప్రతి సీజన్‌‌‌‌కు రూ. వెయ్యి కోట్ల మేర డైరెక్ట్ గా రైతులు దోపిడీకి గురవుతున్నారు. సర్కారు ఈ సీజన్‌‌‌‌లో కోటి టన్నుల వడ్లు సేకరించాలని టార్గెట్‌‌‌‌ పెట్టుకున్నది. సెంటర్లలో, మిల్లుల్లో కలిపి క్వింటాలుకు 7 కిలోల వరకూ దోపిడీ జరుగుతోంది. కోటి టన్నులు సేకరిస్తే.. దాదాపు 7 లక్షల టన్నులు రైతులకు నేరుగా కోతపడే అవకాశం ఉంది. క్వింటాల్‌‌‌‌కు మద్దతు ధర రూ.2,060 చొప్పున లెక్కిస్తే.. 7 లక్షల టన్నులకు రూ.1,442 కోట్ల మేరకు రైతులు దోపిడీకి గురవుతున్నారు.

ప్రభుత్వం చర్యలు తీస్కోవాలె 

రైతుల వడ్లు కాంటా కాగానే వచ్చిన తూకం, రావాల్సిన పైసల వివరాలను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నమోదు చేయాలి. అప్పుడే రైతుల అకౌంట్లో పడిన పైసలు కరెక్ట్‌‌‌‌గా వచ్చినయా? లేదా? తెలుసుకోవచ్చు. అందుకే వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయకుంటే రైతులకు నష్టమే. రైతులను ఇటు కొనుగోలు సెంటర్లలో, అటు మిల్లుల్లోనూ దోపిడీ చేస్తున్నారు. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీస్కోవాలె. - అన్వేశ్​ రెడ్డి, ప్రెసిడెంట్‌‌‌‌, కిసాన్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌