ఫెర్టిలైజర్స్ డీలర్లపై ఇదేం ఎంక్వయిరీ?

ఫెర్టిలైజర్స్ డీలర్లపై ఇదేం ఎంక్వయిరీ?
  • ఆఫీసుకు పిలిచి సంతకాలు తీసుకున్న అధికారులు
  • వ్యవసాయ శాఖలో వసూళ్ల దందాపై నిగ్గు తేలేదెలా?

మంచిర్యాల, వెలుగు: వ్యవసాయ శాఖలో వసూళ్ల దందాపై ఎంక్వయిరీ పక్కదారి పట్టింది. ఫర్టిలైజర్స్ డీలర్లను పర్సనల్​గా కలిసి సీక్రెట్​గా ఎంక్వయిరీ చేయాల్సిన ఆఫీసర్లు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ముందే, వారి ఆఫీసులోనే ఎంక్వయిరీ చేయడం విడ్డూరంగా కనిపిస్తోంది. యూరియా ఇండెంట్ కోసం ఫర్టిలైజర్స్ డీలర్స్ దగ్గర కొంతమంది అధికారులు పైసలు వసూలు చేస్తున్న వైనంపై ‘వెలుగు’ పేపర్​లో కథనాలు వచ్చాయి.

దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు అదే శాఖకు చెందిన భీమిని ఏడీఏ ఇంతియాజ్ అమ్మద్ ను విచారణ అధికారిగా నియమించారు. ఆయన మంగళవారం సాయంత్రం చెన్నూర్ ఏవో ఆఫీస్ కు ఫర్టిలైజర్స్ డీలర్​ను పిలిపించుకొని తూతూమంత్రంగా విచారణ జరిపారు. తమను ఎవరూ పైసలు అడగలేదని సంతకాలు తీసుకున్నారు. ఓవైపు చెన్నూర్ ఏడీఏ బాపు, మరోవైపు ఏఓ కవిత ముందే వారిని ఎంక్వయిరీ చేశారు. సోమవారమే ఏడీఏ బాపు ఫర్టిలైజర్స్ డీలర్లకు ఫోన్ చేసి ‘ఆఫీసర్లు ఎంక్వయిరీకి వస్తరు.. అంతా ఉత్తదే అని చెప్పాలె.. ఏమైనా ఉంటే మనం మనం చూసుకుందాం.. లేదంటే పరిస్థితి వేరేగా ఉంటది’ అని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఫర్టిలైజర్ డీలర్లు  వాస్తవాలు చెప్పడానికి  జంకుతున్నారు.


ఈ విషయాలన్నీ తెలిసి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ముందే, వారి ఆఫీసులోనే ఎంక్వయిరీ చేస్తుండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలా ఎంక్వయిరీ చేస్తే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ శాఖలో జిల్లా ఆఫీసు నుంచి క్లస్టర్ లెవల్ వరకు జరుగుతున్న అక్రమాలు నిగ్గు తేలాలంటే ఇతర డిపార్ట్​మెంట్ అధికారులతో సీక్రెట్​గా ఎంక్వయిరీ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.