- ఇప్పటికే సస్పెండైన ఈవో, సీనియర్ అసిస్టెంట్
- ఆరేండ్ల రికార్డును పరిశీలించిన అధికారులు
- తాజాగా టెండర్‌దారుల నుంచి వివరాల సేకరణ
- రెండు, మూడు రోజుల్లో నివేదిక అందించే చాన్స్
- మరికొందరు దోషులుగా తేలనున్నట్లు సమాచారం
జగిత్యాల, వెలుగు : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో టెండర్ల సొమ్ము దుర్వినియోగంపై విచారణ తుది దశకు చేరింది. ఇటీవల అధికారులు ఆరేండ్ల రికార్డులు పరిశీలించడం తో పాటు టెండర్ దారులను కూడా విచారించారు. కాగా.. మరో రెండు- మూడు రోజుల్లో నివేదిక ఉన్నతాధికారులకు అందించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఘటనలో మరికొందరు అధికారులు దోషులుగా తేలే చాన్స్ ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే ఆలయ ఈవో, సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్ అయ్యారు.
ముందస్తు టెండర్లతో వెలుగులోకి..
కొండగట్టు ఆలయ అధికారులు గతేడాది మార్చిలో 13 షాపుల కు టెండర్లు పిలిచారు. రెండు నెలల ముందుగానే లీజులు ఇచ్చారు. కాగా.. జూనియర్ అసిస్టెంట్ ఇచ్చిన రసీదులతో టెండర్‌దారులు నో డ్యూ సర్టిఫికెట్ కోసం ఈవోకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ వివరాలు క్యాష్ బుక్‌లో నమోదు కాలేదు. ఉన్నతాధికారుల సంతకాలు కూడా లేవు. ఆపై డబ్బులు కూడా ఆలయ అకౌంట్ లో జమ కాలేదని తేలింది.
కొబ్బరికాయల షాపులో రూ.31.80 లక్షలు, హోటల్ రూ.50 వేలు, కిరాణా షాప్ రూ.60 వేలు, పూలు, -పండ్ల షాపులో రూ.3 లక్షలు, సులభ్ కాంప్లెక్స్ లో రూ.2 లక్షలు దాకా అక్రమాలు జరిగినట్టు బయటపడింది. ఇలా మొత్తంగా రూ.37.90 లక్షల వరకు అక్రమాలు చేసినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఈవో వెంకటేశ్ఫిర్యాదుతో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ చారిని సస్పెండ్ చేసి, మల్యాల పోలీస్‌స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
రూ.కోటి దాకా అవినీతి జరిగినట్టు అంచనా..
టెండర్ సొమ్ము దుర్వినియోగంపై ఉన్నతాధికారుల ఆదేశాలతో గతేడాది మార్చి19న అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ జ్యోతి కొండగట్టుకు వచ్చి ఆలయ రికార్డులను తనిఖీ చేశారు. దీంతో రూ.37.90 లక్షలతో పాటు మరో రూ.14 లక్షలు కూడా దుర్వినియోగమైనట్టు తేలింది. మొత్తంగా రూ.52 లక్షలు సొంతానికి వాడుకున్నట్లు తెలియడంతో పాటు ఈవో వెంకటేశ్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించి అదే నెల 23న సస్పెండ్ చేశారు.
అనంతరం అధికారులు 2018 నుంచి జరిగిన లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకుని పూర్తిగా విచారణ చేశారు. తాజాగా ఈనెల 3న ఆలయ సిబ్బంది, టెండర్ దారులను విచారించారు. టెండర్ దారులు సమర్పించిన బిల్లులను అధికారులు పరిశీలించారు.
దీంతో మరో రూ.20 నుంచి 30 లక్షలు పక్కదారి పట్టినట్లు అంచనా వేశారు. ఇలా మొత్తంగా రూ. కోటి దాకా అవినీతికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆఫీసర్లు ఎంక్వైరీ రిపోర్ట్ ను మరో రెండు, మూడు రోజుల్లో ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిసింది. అవినీతి సొమ్ముతో పాటు అధికారుల మరిన్నీ అక్రమాలు బయటపడే చాన్స్ ఉంది.
