న్యూఢిల్లీ: గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో డ్రోన్ బాంబు దాడికి గురైన అమెరికన్ కార్గో నౌకకు భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం సాయం చేసింది. జనవరి 18న రాత్రి అమెరికాకు చెందిన ఎంవీ జెన్కో పికార్డి నౌకను లక్ష్యంగా చేసుకుని హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. దీంతో నౌక కొంతభాగం ధ్వంసమైంది. తమకు సాయం కావాలంటూ ఆ నౌక నుంచి రాత్రి 12:30 గంటలకు వచ్చిన అభ్యర్థనపై ఇండియన్ నేవీ స్పందించింది.
ఆ టైంలో గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో యాంటీ పైరసీ నిరోధక గస్తీని నిర్వహిస్తున్న ఐఎన్ఎస్ విశాఖపట్నంను పంపించి సాయాన్ని అందించింది. నౌకలో 22 మంది సిబ్బంది ఉండగా, అందులో 9 మంది ఇండియన్లు ఉన్నారు. డ్రోన్ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలు కూడా అదుపులోకి వచ్చాయి. నౌక వద్దకు చేరుకున్న తర్వాత ఐఎన్ఎస్ విశాఖపట్నంలోని ఎక్స్పర్ట్స్ ఎంవీ జెన్‌కో పికార్డిలోకి ఎక్కి తనిఖీ చేశారు. అనంతరం ఆ నౌక తిరుగు ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు.

