విశ్వసం ఉపకారం అప్పుడే!

విశ్వసం ఉపకారం అప్పుడే!

ఒక రాజు పరిపాలన సవ్యంగా లేనప్పుడు ఆ రాజ్య ప్రజలకు ఎటువంటి ఉపకారము జరుగదు. అటువంటి రాజు ఉన్నా లేకున్నా ఒకటేనని పెద్దలు చెప్తారు. గతంలో ఎన్నో సామ్రాజ్యాలలో ఇటువంటి సందర్భాలు కనిపించాయి. అసమర్థులైన పరిపాలకులను- ప్రజలు లేదా ఆ రాజ వంశీకులు రాజ్యభ్రష్టులను చేసిన ఉదంతాలు కోకొల్లలు. రావణాసురుడి పరిపాలన నచ్చకపోవడంతో, విభీషణుడు తన అన్నగారిని సింహాసనం మీద నుంచి తొలగించే శక్తి లేక రాజ్యాన్ని విడిచి రాముడి శరణు కోరాడు. ఆ తరువాత జరిగిన రామరావణ యుద్ధంలో రావణుడు మరణించాడు. విభీషణుడిని రాముడు పట్టాభిషిక్తుని చేశాడు. విభీషణుడు లంకా నగరాన్ని నీతినియమాలతో పరిపాలించాడు.

మహాభారతంలో...

దుర్యోధనుడు పదమూడేండ్ల పాటు పాండవులను అరణ్యాలకు పంపి రాజ్యాన్ని పరిపాలించాడు. పదమూడేండ్లు పూర్తయ్యాక కౌరవపాండవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగింది. కౌరవులు ఓడిపోయారు. పాండవులు ధర్మంగా పరిపాలించి, ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకున్నారు.
అపర రాజనీతివేత్తగా పేరుగాంచిన చాణక్యుడు... మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న నందుల అరాచకాల నుంచి ప్రజలను రక్షించాలనే సదుద్దేశంతో, నందులను రాజ్యభ్రష్టులను చేసి, చంద్రగుప్తుణ్ని సింహాసనం ఎక్కించాడు.

పంచతంత్ర కథలు పరిశీలిస్తే...

సింహం- కుందేలు కథ ఇటువంటిదే. అడవికి రాజైన సింహం అడవిలోని జంతువులను రక్షించడానికి బదులు అహంకారంతో విర్రవీగి జంతువులను చంపి తింటుంటుంది. ఎలాగైనా సింహం బారి నుండి తమను తాము రక్షించుకోవాలనుకుంటాయి జంతువులు. అవన్నీ ఒకరోజు సమావేశమై రోజుకి ఒకరు చొప్పున రాజుకి ఆహారంగా వెళ్లాలి అనుకున్నాయి. ఒక రోజు కుందేలు వంతు వచ్చింది. ఇన్నిరోజులుగా జంతువులన్నీ వంతు ప్రకారం సింహానికి ఆహారంగా వెళ్లాయి. ఎలాగైనా ఈ రోజుతో పీడ వదిలించుకోవాలి అనుకుంది కుందేలు ఉపాయం కారణంగా సింహం నూతిలో దూకి చచ్చిపోయింది. అడవిలోని జంతువులన్నీ తమకు సింహం బాధ తప్పించినందుకు కుందేలును పొగిడాయి. జంతువులన్నీ సుఖంగా కాలం గడిపాయి.

రష్యాను చాలాకాలం జారు చక్రవర్తులు పరిపాలించారు. వారు నిరంకుశంగా పరిపాలించటం మొదలుపెట్టారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఆ విధంగా రష్యా విప్లవంతో జారు చక్రవర్తుల పరిపాలనకు స్వస్తి పలికారు. అదే విధంగా ఫ్రెంచి సామ్రాజ్యంలో లూయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చక్రవర్తుల పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి నిరంకుశ పరిపాలన అంతం చేశారు. చరిత్రలో ఇటువంటి ఉదాహరణలెన్నో. ‘ఆంధ్రపురాణం’లో ఉదాహరణ కనిపిస్తుంది. ఇంతకు నా వచించునది యేమనగా, మన ఱేనికిట్టి సిద్ధాంతము లెవ్వియున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దలకు దట్టవు; చెప్పిన గిట్ట; వింక రాష్ట్రాంతర లబ్ధకీర్తి  విభవాధికమౌ మన యేల్బడిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రజాసంతతి కీ యుపేక్ష యపచారముగా గుపకార మెట్లగున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ఆంధ్రపురాణం, శ్రీకృష్ణదేవరాయ పర్వం 25 పద్యం, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి)విజయనగర సామ్రాజ్యాన్ని విద్యారణ్యులు స్థాపించిన నాటి నుంచి, ఆ రాజ్యాన్ని సంగమ, సాళువ వంశీయులు ప్రజారంజకంగా పరిపాలించి, సువర్ణయుగాన్ని స్థాపించారు. 
అయితే వీరనరసింహరాయలు పరిపాలనలోకి వచ్చిన తరువాత పరిపాలన కుంటుపడటం మొదలవుతుంది. ఆ విషయాన్ని గమనించిన తిమ్మరుసు మనసు కలత చెందుతుంది. ఒకరోజు - తన తమ్ముడైన గోవిందునితో రాజ్య పరిపాలన గురించి చర్చిస్తూ, తన ఆవేదనను తెలుపుతాడు. ఆ సందర్భంలో ‘‘ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. మన రాజుకి ప్రజలను సవ్యంగా పరిపాలించాలనే సిద్ధాంతాలు లేవు. ఒకవేళ మనం చెప్పినా తలకెక్కవు. ఇటువంటి రాజు వలన ప్రజలకు ఏమి ఉపయోగం? ఇటువంటి ప్రభువుల వల్ల ప్రజలకు అపకారమే కానీ ఉపకారం ఏ మాత్రం ఉండదు’ అని చెప్తాడు. 

చేతిలోని ఐదు వేళ్లలో ఒక వేలుకి జబ్బు చేస్తే ఆ వేలుని తొలగించి మిగతా చేతిని రక్షించుకోవాలని పండితులు చెప్తారు. అదే సిద్ధాంతాన్ని అరాచక పరిపాలనకు కూడా ఉపయోగించాలని పై పద్యం అర్థం.దుష్టపరిపాలనకు తలవంచకుండా... ప్రజాస్వామ్య పద్ధతిలో తిరుగుబాటు చేసి సక్రమమైన, సుస్థిర పరిపాలన ఏర్పరచుకోకపోతే ప్రజలకు మేలు జరగదని ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు ‘యామున రాజనీతి’ లో సవివరంగా వివరించాడు.

-డా. వైజయంతి పురాణపండ  ఫోన్​: 80085 51232