అదిరిందయ్యా చంద్రం..
కొత్త ఇల్లు..
కొత్త బండి..
కొత్త భార్య.. అద్భుతం... అంటూ టీవీలో వచ్చిన ఈ అడ్వర్టైజ్మెంట్ చాలామందికి పరిచయమే. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ ఇంటికి వచ్చిన అదే వ్యక్తి వస్తాడు. అప్పుడు కారు పాతబడిపోతుంది. భార్య వయసు పెరుగుతుంది. కానీ.. ఏషియన్ పెయింట్స్ వేసిన ఇల్లు మాత్రం చెక్కు చెదరకుండా, కొత్తదానిలా మెరుస్తుంటుంది. అచ్చం ఆ ఇంటి పెయింట్ లాగానే ఏషియన్ పెయింట్స్ బ్రాండ్ ఇమేజ్ కూడా దశాబ్దాల నుంచి చెదిరిపోవడం లేదు. గ్యారేజీలో పనిచేసే నలుగురు ఫ్రెండ్స్ కలిసి పెట్టిన ఈ కంపెనీ ఇప్పుడు 60కి పైగా దేశాల్లో పెయింట్స్ అమ్మే స్థాయికి ఎదిగింది.
రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇండియాలో పెయింట్స్కి బాగా డిమాండ్ పెరిగింది. అందుకు కారణం.. అవసరాలకు సరిపడా పెయింట్ అందుబాటులో లేకపోవడమే. అప్పటివరకు ఎక్కువగా విదేశాల నుంచి పెయింట్స్ దిగుమతి చేసుకునేవాళ్లు. కానీ.. యుద్ధం వల్ల దిగుమతులపై తాత్కాలిక నిషేధం విధించింది అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్. అప్పటివరకు ఇండియాలో షాలిమార్ పెయింట్స్‌తో పాటు కొన్ని కంపెనీలు మాత్రమే పెయింట్స్‌ని ఉత్పత్తి చేస్తుండేవి.
అదే టైంలో మార్కెట్లో పెయింట్స్‌కు ఉన్న డిమాండ్ గుర్తించిన 26 ఏండ్ల చంపక్‌లాల్ చోక్సీ కంపెనీ పెట్టాలని డిసైడ్ అయ్యాడు. ఆ ఐడియాను తన ముగ్గురు ఫ్రెండ్స్ తోపాటు చిమన్‌లాల్ చోక్సీ, సూర్యకాంత్ దని, అరవింద్‌కి చెప్పాడు. వాళ్లు కూడా మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడానికి అదే మంచి టైం అనుకున్నారు. చంపక్లాల్తో కలిసి 1942లో ముంబయిలో ఏషియన్ పెయింట్స్ కంపెనీని మొదలుపెట్టారు. ఈ కంపెనీ పెట్టకముందు వీళ్లంతా ఒక చిన్న గ్యారేజీలో పనిచేసేవాళ్లు.
ఎన్నో వ్యూహాలు
ఏషియన్ పెయింట్స్ 1942లో చాలా చిన్న కంపెనీగా మొదలై.. చంపక్‌లాల్ ఐడియాల వల్ల పదేండ్లలోనే టాప్ కంపెనీల పక్కన చేరింది. 1952 నాటికి ఏషియన్ పెయింట్స్ టర్నోవర్ ఏడాదికి 23 కోట్ల రూపాయలకు చేరింది. 1967 నాటికి ఇండియాలో నెంబర్ వన్ కంపెనీగా ఎదిగింది. ఇండియన్స్ ఫేవరెట్ బ్రాండ్‌గా మారింది. అప్పటినుంచి ఈ రోజు వరకు ఆ స్థానాన్ని అలానే నిలబెట్టుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఇండియాలో మొదటి స్థానంలో ఉండడమే కాదు.. ఆసియాలో రెండో అతి పెద్ద డెకరేటివ్ కోటింగ్స్ ప్రొడక్షన్ కంపెనీగా పేరు తెచ్చుకుంది.
ఎన్నో ఒడిదుడుకులు
చిన్న గ్యారేజీలో పనిచేసే స్థాయి నుంచి సొంత కంపెనీ పెట్టే వరకు ఎదగడం ఒక ఎత్తైతే.. కంపెనీని లాభాల వైపు నడిపించడం మరో ఎత్తు. చంపక్‌లాల్ కంపెనీ పెట్టిన కొత్తలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అప్పటికే ముంబయి మార్కెట్లో పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. వాళ్లే చిన్న టౌన్లకు పెయింట్స్‌ని సప్లై చేసేవాళ్లు. కాబట్టి కంపెనీలకు ముంబయిలోనే అమ్మకాలు ఎక్కువ జరిగేవి. కానీ... ఆ డిస్ట్రిబ్యూటర్లు ఏషియన్ పెయింట్స్ అమ్మడానికి ఇష్టపడలేదు. దాంతో చంపక్‌లాల్ ఒక ప్లాన్ వేశాడు. మార్కెట్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్ల మీద ఆధారపడడం కంటే.. తనే ఒక డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి అనుకున్నాడు. సిటీల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లను నమ్ముకునే బదులు టౌన్లలోనే కొందరికి డీలర్‌షిప్ ఇవ్వాలి అనుకున్నాడు.
మహారాష్ట్రలోని సతారాలోని సాంగ్లీలో డైరెక్ట్ డీలర్‌షిప్‌ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత ప్రతి టౌన్లో డైరెక్ట్ డీలర్లను నియమించి నేరుగా వాళ్లకే పెయింట్స్ సప్లై చేశాడు. అప్పటివరకు టౌన్లలో ఉండే వ్యాపారులు సిటీలకు వెళ్లి పెయింట్స్ కొనేవాళ్లు. కానీ.. ఏషియన్ పెయింట్స్ తమ ఊరి వరకు సప్లై చేస్తుండడంతో వాటినే ఎక్కువగా అమ్మడం మొదలుపెట్టారు. పైగా డిస్ట్రిబ్యూటర్లు అమ్మే ధర కంటే.. కంపెనీ తక్కువ ధరకు అమ్మింది. ఇదెలా సాధ్యమైందంటే.. డైరెక్ట్‌గా డీలర్లకు ఇవ్వడం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది.
ఇదంతా చూసిన ముంబయిలోని పెద్ద డిస్ట్రిబ్యూటర్లు వాళ్లంతట వాళ్లే ఏషియన్ పెయింట్స్ అమ్ముతామని కంపెనీ దగ్గరకు వెళ్లాయి. ఏషియన్ పెయింట్స్‌ను స్టోర్ చేసుకోవడం, అమ్మడం మొదలుపెట్టాయి. దాంతో సిటీల్లో మార్కెట్ పెరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఏషియన్ పెయింట్స్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు మెట్రో నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు కంపెనీ నెట్వర్క్ బాగా విస్తరించింది. గ్రామాల వరకు డైరెక్ట్‌గా కంపెనీ నుంచే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అందుకే సిటీలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువ అమ్మకాలు జరుగుతుంటాయి.
కొత్త ఎత్తులు
డీలర్‌షిప్ వ్యవస్థ తీసుకొచ్చి సొంత మార్కెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత కూడా కంపెనీ ఎదుగుదల కోసం కొత్త ప్లాన్స్ ఆలోచించాడు చంపక్‌లాల్. ఎప్పుడూ మార్కెట్‌ని గమనిస్తూ.. ప్రొడక్ట్స్‌లో మార్పులు చేస్తుండేవాడు. కస్టమర్‌కు కావాల్సిన దాన్ని ఎలాగైనా అందించాలనే లక్ష్యంతో పనిచేసేవాడు. అలాంటి ఆలోచనల వల్లే పెయింట్స్‌లో ఏషియన్ బ్రాండ్‌గా ఎదిగింది. మార్కెట్ పెంచుకునే ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకునేవాడు కాదు చంపక్‌లాల్. ఉదాహరణకు.. తమిళనాడులో ‘పొంగల్’, మహారాష్ట్రలో ‘పోలా’ పండుగలప్పడు ఎద్దులను పూజిస్తుంటారు.
వాటి కొమ్ములకు రంగులు వేస్తుంటారు. అలాంటి టైంలో రంగు డబ్బాలు బాగా కొంటుంటారు. కానీ.. తక్కువ క్వాంటిటీ డబ్బాలు మార్కెట్లో దొరికేవి కావు. దాంతో కొందరు రంగు డబ్బాలు కొనడం మానేసేవాళ్లు. ఆ విషయం తెలుసుకున్న చంపక్‌లాల్100, 150 మిల్లీ లీటర్ల చిన్న రంగు డబ్బాలను మార్కెట్లోకి తెచ్చాడు. ఎద్దుల కొమ్ములకు పూస్తారు కాబట్టి బ్రైట్‌గా కనిపించేందుకు ప్రత్యేకంగా రంగులు తయారుచేయించాడు. ఎద్దులు వాటి కొమ్ముల్ని బురదలో రుద్దినా కలర్ డల్ కాకుండా ఉండేలా క్వాలిటీ పెయింట్‌ని తీసుకొచ్చాడు. ఆ ఐడియా బాగా సక్సెస్ అయింది. దాంతో పండుగలప్పుడు ఏషియన్ పెయింట్స్ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.
డిస్టెంపర్ లాంచ్
ఇదివరకు చాలామంది ఇండ్లకు సున్నం వేసుకునేవాళ్లు. ఆ సున్నం బట్టలకు అంటుకునేది. కొద్దిరోజుల్లోనే కలర్ డిమ్ అయ్యేది. అప్పట్లో బట్టలకు అంటుకోని ప్లాస్టిక్ ఎమల్షన్ సున్నం కూడా మార్కెట్లో దొరికేది. కానీ.. ఈ సున్నం ధర మామూలు సున్నంతో పోలిస్తే.. ఐదు రెట్లు ఎక్కువ. అందుకే మిడిల్ క్లాస్ వాళ్లు మామూలు సున్నాన్నే వాడేవాళ్లు. ఇది గమనించిన చంపక్‌లాల్.. సున్నం కంటే కాస్త ఎక్కువ ధరలో, ప్లాస్టిక్ ఎమల్షన్ కంటే చాలా తక్కువ ధరలో దొరికే ఒక ప్రొడక్ట్‌ని డిజైన్ చేశాడు. అదే ఏషియన్ పెయింట్స్
నుంచి వచ్చిన వాషబుల్ డిస్టెంపర్. దీని మీద నీళ్లు పడ్డా కలర్ తగ్గదు. ఈ ప్రొడక్ట్ మార్కెట్లో బాగా సక్సెస్ అయ్యింది. ఏషియన్ పెయింట్స్ అతిపెద్ద పెయింట్ కంపెనీగా ఎదగడానికి ఇది కూడా ఒక కారణమే.
ఉద్యోగులతో..
తమ ఉద్యోగులతో మంచి రిలేషన్షిప్ మెయింటెన్ చేస్తుంటుంది కంపెనీ. అంతేకాదు.. టాలెంట్ ఉన్నవాళ్లకే ఉద్యోగాలు ఇస్తుంటుంది. ఏషియన్ పెయింట్స్ సక్సెస్‌లో వాళ్ల పాత్ర కూడా బోలెడంత ఉంది. ఇందులో చేరిన వాళ్లలో చాలామంది రిటైర్ అయ్యేవరకు ఇక్కడే పని చేస్తారు. అంతెందుకు ఇదివరకు ఈ కంపెనీకి సీఈవోగా పనిచేసిన కేబీఎస్ ఆనంద్ కూడా1970లో ఏషియన్ పెయింట్స్ ఉద్యోగి.
నయా టెక్నాలజీ
ఏషియన్ పెయింట్స్1974లోనే కంప్యూటర్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంది. కంపెనీకి లాభాలు తెచ్చే ఏ టెక్నాలజీ మార్కెట్లోకి వచ్చినా.. వెంటనే అమలు చేస్తుంది. కంపెనీల్లో పే రోల్, అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్‌ల కోసమే కంప్యూటర్లను వాడుతున్న రోజుల్లో ఏషియన్ పెయింట్స్ కంప్యూటర్‌ల సాయంతో డేటా అనలిటిక్స్ చేసేది. ఆ డేటాతో డిమాండ్, సప్లై గురించి తెలుసుకునేది. ఏషియన్ పెయింట్స్ ఎప్పుడూ కోర్ బిజినెస్ మీద ఫోకస్ పెడుతుంది. అంటే.. ప్రొడక్ట్‌ని కస్టమర్‌కి కావాల్సినట్టు కస్టమైజ్ చేసి ఇస్తుంటుంది. దీనివల్ల అన్ని రకాల కస్టమర్లకు దగ్గరైంది. ప్రస్తుతం సిటీలతోపాటు చిన్న చిన్న టౌన్లలో కూడా కస్టమర్లకు కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. అందుకోసం ఏషియన్ పెయింట్స్ డీలర్లకు కొన్ని మెషిన్స్ ఇస్తారు. వాటి ద్వారా కస్టమర్లకు కావాల్సిన ఎలాంటి కలర్ అయినా అప్పటికప్పుడు మిక్స్ చేసిస్తారు.
మార్కెట్ వాటా
ప్రస్తుతం ఇండియాలో పెయింట్ ఇండస్ట్రీ మార్కెట్ వాటాలో దాదాపు 50 శాతం వాటా ఏషియన్ పెయింట్స్ సొంతం చేసుకుంది. అంతేకాదు.. కొన్ని దశాబ్దాల నుంచి ఈ కంపెనీ గ్రోత్ రేట్ ఏడాదికి 20 శాతం కంటే ఎక్కువగానే ఉంది. ఈ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద కంపెనీల్లో ఏ ఒక్కటీ ఏషియన్‌ను దాటలేకపోయింది. ప్రస్తుతం ఈ కంపెనీకి 27 మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో ప్రొడక్ట్స్ అమ్ముతోంది. కేవలం ఇండియాలోనే ఈ కంపెనీకి లక్షా 50 వేల మందికి పైగా రిటైలర్స్ ఉన్నారు. డెకరేటివ్ కోటింగ్స్ కేటగిరీలో ప్రపంచంలోనే ఏడో అతి పెద్ద కంపెనీగా గుర్తింపు పొందింది ఏషియన్ పెయింట్స్.
