ఇన్​స్పిరేషన్ : చిన్న గదిలో మొదలై.. ప్రతి ఇంటికి చేరింది!

ఇన్​స్పిరేషన్  : చిన్న గదిలో మొదలై.. ప్రతి ఇంటికి చేరింది!

ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా బిజీ వర్క్​లో ఉన్నప్పుడు సడెన్​గా ఆకలిగా అనిపిస్తే.. మన కళ్లు ముందుగా బిస్కెట్ల కోసమే వెతుకుతాయి. అలాంటి టైంలో బిస్కెట్లు కొనేందుకు స్టాల్​లోకి వెళ్తే.. చాలామంది బ్రిటానియా మాత్రమే కొంటారు. దానికి కారణం.. బ్రిటానియా అంటే బ్రాండ్​ మాత్రమే కాదు వంద ఏండ్లకు పైగా నమ్మకం. ఎన్నో ఏండ్ల నుంచి బ్రిటానియా ఇండియన్స్​ మనసులు దోచుకుంటోంది. ఇంతమందికి దగ్గరైన ఈ బిస్కెట్​ కంపెనీ కోల్‌‌‌‌కతాలోని ఒక చిన్న గదిలో మొదలైంది! ఇప్పుడు బ్రిటానియా ప్రొడక్ట్స్‌‌‌‌ని మన దేశంతో పాటు మరో 60 దేశాల్లో తింటున్నారు. 

బ్రిటానియా.. మన దేశంలోని అతి పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల్లో ఒకటిగా అవతరించింది. కానీ.. ఇది ఒకప్పుడు చిన్న కుటీర పరిశ్రమగా మొదలైంది. దీన్ని 1892లో కొంతమంది బ్రిటిష్ వ్యాపారులు కలిసి పెట్టారు. అప్పట్లో ఈ కంపెనీ కోసం కేవలం 295 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. మొదట్లో సెంట్రల్ కోల్‌‌‌‌కతాలోని ఒక చిన్న ఇంట్లో బిస్కెట్లు తయారు చేసేవాళ్లు. తర్వాత కొన్నాళ్లకు సంస్థకు లాభాలు పెరగడంతో 1897లో గుప్తా బ్రదర్స్​ ఈ కంపెనీని కొన్నారు. వాళ్లలో ముఖ్యంగా నళిన్ చంద్ర గుప్తా అనే లాయర్​ కంపెనీ బాధ్యతలు తీసుకున్నాడు.  అప్పట్లో ‘వీఎస్​ బ్రదర్స్​’ పేరుతో బిస్కెట్లు తయారు చేసేవాళ్లు.

అలా కంపెనీ కొన్నాళ్లు నడిచిన తర్వాత1918లో కోల్‌‌‌‌కతాలో ఉన్న బ్రిటిష్​ బిజినెస్​మెన్​ సీహెచ్​ హోమ్స్‌‌‌‌ కంపెనీలో పార్ట్‌‌‌‌నర్​గా చేరాడు. అప్పుడే దీనికి ‘ది బ్రిటానియా బిస్కెట్ కంపెనీ లిమిటెడ్’(బీబీకో) అని పేరు పెట్టారు. ఆ తర్వాత లాభాలు కూడా బాగానే వచ్చాయి. అంతేకాదు.. 1910లో కరెంట్​ రావడంతో కంపెనీలో మెషిన్లు వాడడం మొదలైంది. దాంతో లాభాలు పెరిగాయి.

సైన్యానికి బిస్కెట్లు  

వ్యాపారం పెరిగిన తర్వాత 1924లో ముంబైలో కూడా ఒక ఫ్యాక్టరీ పెట్టారు. ఇక రెండో ప్రపంచం యుద్ధం మొదలైన తర్వాత ఈ కంపెనీకి చాలా పెద్ద కాంట్రాక్ట్‌‌‌‌ దక్కింది. రెండో  ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న బ్రిటిష్ సైనికులకు ప్రతిరోజూ బిస్కెట్లు ఇచ్చేవాళ్లు. దాంతో బిస్కెట్లకు డిమాండ్​ బాగా పెరిగింది.  బ్రిటానియా బిస్కెట్ కంపెనీ కొన్నేండ్లపాటు బ్రిటిష్ సైన్యానికి బిస్కెట్లను సరఫరా చేసింది. కొన్నిసార్లు సాయుధ దళాల కోసం బిస్కెట్లను తయారుచేయడానికి ఫ్యాక్టరీ కెపాసిటీలో 95శాతం వాడాల్సి వచ్చేది. కంపెనీ బిస్కెట్ల అమ్మకాలు విపరీతంగా పెరగడంతో లాభాలు బాగా వచ్చాయి. సైన్యానికి బిస్కెట్లు సప్లై చేయడంతో యుద్ధం తర్వాత కూడా కంపెనీకి చాలా మంచి గుర్తింపు దక్కింది. దాంతో కంపెనీ అమ్మకాలు పెరిగాయి.

అలా అంచెలంచెలుగా ఎదిగిన ఈ  కంపెనీకి ప్రస్తుత పేరు ‘బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్‌‌‌‌’ అని1979లో పెట్టారు.1978లోనే బ్రిటానియా పబ్లిక్ ఇష్యూ విడుదల చేసింది. అప్పటినుంచి ఇది పూర్తి ఇండియన్​ కంపెనీగా మారింది. కాకపోతే.. యూకే బేస్​డ్​ కంపెనీ అసోసియేటెడ్ బిస్కెట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌‌‌‌కి ఇందులో 38శాతం  వాటా ఉండేది.  

వాడియా గ్రూప్​

బ్రిటానియా కంపెనీని చివరగా బొంబాయికి చెందిన టెక్స్‌‌‌‌టైల్ టైకూన్​ నుస్లీ వాడియా, ఫ్రెంచ్ ఫుడ్ దిగ్గజం డానోన్ సాయంతో1993లో కొన్నారు. అప్పటి బ్రిటానియా చైర్మన్ రాజన్ పిళ్లై నుంచి వీళ్ల చేతుల్లోకి వచ్చింది. కానీ.. 2007లో డానోన్​ కంపెనీతో వాడియా గ్రూప్​కు గొడవలు అయ్యాయి. ఎందుకంటే.. వాడియా గ్రూప్​ అనుమతి లేకుండానే డానోన్ విదేశాల్లో బ్రిటానియా ‘‘టైగర్” బ్రాండ్‌‌‌‌ను రిజిస్టర్​ చేసుకుంది. దాంతో రెండు కంపెనీలకు గొడవలయ్యాయి. అదేటైంలో ఇండియాలో స్వతంత్రంగా వ్యాపారం చేయాలని కూడా డానోన్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఆ ప్రయత్నాలను వాడియా గ్రూప్ అడ్డుకుంది. దాంతో 2009లో గ్రూప్ డానోన్ తన దగ్గరున్న 25శాతం  వాటాను వాడియా గ్రూప్​కు అమ్మేసింది. దాంతో వాడియా గ్రూప్​ బ్రిటానియా ఇండస్ట్రీస్​ లిమిటెడ్​లో అతిపెద్ద వాటాదారుగా అవతరించింది. 

అంచెలంచెలుగా.. 

కంపెనీ ఎన్నో ఏండ్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు ప్రజల అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగా ప్రొడక్ట్స్‌‌‌‌ తీసుకొస్తుంది. ఇది వరకు బిస్కెట్లను ఆకలేసినప్పుడు మాత్రమే తినేవాళ్లు. కానీ.. కొన్నేండ్ల నుంచి టీలో ముంచుకుని తింటున్నారు. అందుకే టీలో ముంచుకుని తినేందుకు ప్రత్యేకంగా కొన్ని రకాల బిస్కెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అందుకే ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా.. ఉదయం టీ టైంలో బ్రిటానియా బిస్కెట్లు కూడా ఉండాల్సిందే. చిన్న పిల్లలు తినేందుకు మిల్క్ బిస్కెట్లు, పెద్దవాళ్లు తినేందుకు డైజెస్టివ్​ బిస్కెట్లు, టీలో ముంచుకుని తినేందుకు రస్క్​, ఆకలేసినప్పుడు తినేందుకు డ్రై ఫ్రూట్స్​ బిస్కెట్లు ఇలా..

రకరకాల బిస్కెట్లను మార్కెట్‌‌‌‌లోకి తీసుకొచ్చి ఆకట్టుకుంటుంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కూడా బ్రిటానియా ఎప్పుడూ ముందుంటుంది. 1921లోనే ఈ కంపెనీ   గ్యాస్ ఒవెన్‌‌‌‌లను దిగుమతి చేసుకుంది. దాంతో బిస్కెట్ల ప్రొడక్షన్​ బాగా పెరిగింది. అంతేకాదు..  1983లోనే బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అమ్మకాలు 100 కోట్ల రూపాయలు దాటాయి. 

మార్కెటింగ్​ 

బ్రిటానియా ఎప్పుడూ కొత్తగా మార్కెటింగ్‌‌‌‌ చేస్తుంటుంది. అంతేకాకుండా మార్కెట్​ పెంచుకోవడానికి కొత్త ప్రొడక్ట్స్‌‌‌‌ తీసుకొస్తుంటుంది. సందర్భాన్ని బట్టి, అవసరాలకు అనుగుణంగా బిస్కెట్ల ప్యాకేజింగ్ సైజ్​లను తీసుకొస్తుంటారు. ఉదాహరణకు క్విక్​ శ్నాక్​ కోసం 5-రూపాయల ప్యాక్‌‌‌‌ని తీసుకొచ్చారు. కిరాణా సామాన్ల కోసం వెళ్లినప్పుడు కొనేందుకు పెద్ద ప్యాక్​లను అందుబాటులో ఉంచారు. పైగా తమ బిస్కెట్లు, ఇతర ప్రొడక్ట్స్ పోషకమైనవి, ఆరోగ్యకరమైనవి అని ప్రమోట్​ చేస్తుంటారు.

తమ ఉత్పత్తులు నమ్మదగినవని చెప్పేందుకు రకరకాల యాడ్స్​ చేస్తుంటారు. అంతెందుకు 2006లో పిల్లల కోసం తీసుకొచ్చిన  బ్రిటానియా మిల్క్ బిక్కీస్​లో క్యాల్షియం, అయోడిన్, ఐరన్, విటమిన్లు B1, B6, B12, D  ఉంటాయని చెప్పింది. 

రకరకాల ప్రొడక్ట్స్​

బ్రిటానియా బిస్కెట్లు మాత్రమే కాదు.. క్వాలిటీ రోల్డ్, స్లైస్​డ్​ బ్రెడ్స్, కేకుల అమ్మకాలు మొదలుపెట్టింది. ఢిల్లీలో కొత్త ప్లాంట్‌‌‌‌ ఏర్పాటు చేసిన తర్వాత1954లో బ్రెడ్‌‌‌‌ తయారు చేయడం మొదలుపెట్టింది. ఢిల్లీలో బ్రెడ్​ అమ్మకాలు బాగా పెరిగాయి. అక్కడ వచ్చిన సక్సెస్​తో కోల్‌‌‌‌కతా, చెన్నైలో కూడా బ్రెడ్స్​ తయారు చేయడం మొదలుపెట్టారు. 1955లో ‘బోర్బన్’ బిస్కెట్లను తీసుకొచ్చారు. 1963లో బ్రిటానియా కేకులు మార్కెట్‌‌‌‌లోకి వచ్చాయి. 1986లో ఎంతో ప్రజాదరణ పొందిన ‘‘గుడ్ డే’’ బిస్కెట్లు తీసుకొచ్చారు.

1993లో ‘‘లిటిల్ హార్ట్స్’’, ‘‘50–50’’ బిస్కెట్లను అమ్మడం మొదలుపెట్టారు. అప్పట్లో లిటిల్‌‌‌‌హార్ట్స్‌‌‌‌కి బాగా గిరాకీ ఉండేది. యూత్​ ఎక్కువగా కొనేవాళ్లు. తమకు ఇష్టమైనవాళ్లకు గిఫ్ట్‌‌‌‌గా కూడా ఇచ్చేవాళ్లు. అంతేకాదు.. బ్రిటానియా మిల్క్​ ప్రొడక్ట్స్‌‌‌‌ రంగంలోకి కూడా అడుగు పెట్టింది.1997లో మిల్క్‌‌‌‌ ప్రొడక్ట్స్‌‌‌‌ అమ్మకాలు మొదలయ్యాయి. అదే టైంలో దేశవ్యాప్తంగా అనేక కొత్త తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అదే ఏడాదిలో బ్రిటానియా ‘జిమ్ జామ్, టైగర్ బిస్కెట్లు, చెకర్స్’ లాంటివి వచ్చాయి. 

60 దేశాలకు విస్తరించింది 

ఒక చిన్న కుటీర పరిశ్రమగా మొదలైన ఈ కంపెనీ ప్రొడక్ట్స్​ ఇప్పుడు మన దేశంతోపాటు మరో 60 కంటే ఎక్కువ దేశాల్లో అమ్ముడవుతున్నాయి. బ్రిటానియా ఇండియాలో టాప్​ బ్రాండ్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. అంతెందుకు ఇండియాలోని బిస్కెట్​ మార్కెట్‌‌‌‌లో బ్రిటానియా వాటా దాదాపు 38 శాతం ఉంటుందని ఒక అంచనా. భారతదేశంలోని 100 అత్యంత విశ్వసనీయ కంపెనీల లిస్ట్‌‌‌‌లో బ్రిటానియా చేరింది. అంతేకాదు.. డిసెంబర్ 2022 నాటికి  బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,08,992.90 కోట్లకు చేరింది.

అదే టైంలో బ్రిటానియా ఇండస్ట్రీస్ ఇండియాలో చీజ్ ప్రొడక్ట్స్‌‌‌‌ని డెవలప్​ చేయడానికి ఫ్రాన్స్‌‌‌‌కు చెందిన బెల్ఎస్​ఏతో కలిసి జాయింట్ వెంచర్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వెంచర్ కింద బెల్ ఎస్​ఏ కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన బ్రిటానియా డైరీ ప్రైవేట్​ లిమిటెడ్​లో 262 కోట్లతో 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. ప్రస్తుతం కంపెనీ ప్రొడక్షన్​ కెపాసిటీ సంవత్సరానికి 4,33,000 టన్నులుగా ఉంది. 

స్వస్త్ ఖావో.. తన్ మన్ జగావో

1992లో బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన ప్లాటినం జూబ్లీ చేసుకుంది. ఆ మరుసటి సంవత్సరమే వాడియా గ్రూప్​ కంపెనీని కొన్నది. అదే టైంలో బ్రిటానియా ప్రొడక్ట్స్‌‌‌‌ నుంచి ట్రాన్స్​ ఫ్యాట్​ని తొలగించారు. అందుకే  ‘‘స్వస్త్ ఖావో.. తన్ మన్ జగావో” అనే నినాదంతో అమ్మకాలు చేశారు. అంతేకాదు.. ట్రాన్స్​ ఫ్యాట్​లేని బిస్కెట్‌‌‌‌ ప్రొడక్ట్స్‌‌‌‌ని తయారుచేసిన మొదటి కంపెనీగా కూడా బ్రిటానియాకు పేరుంది.