యూట్యూబర్​: ఉద్యోగం మానేసి వంట పని...

యూట్యూబర్​: ఉద్యోగం మానేసి వంట పని...

కొత్త వంట గురించి తెలుసుకోవాలని యూట్యూబ్‌‌‌‌‌‌‌‌లో వెతికితే.. కుప్పలు తెప్పలుగా వీడియోలు కనిపిస్తాయి. ఐదారేండ్ల క్రితం పరిస్థితి ఇలా ఉండేది కాదు. రీజనల్‌‌‌‌ లాంగ్వేజ్​ల్లో చాలా తక్కువమంది ఛానెల్స్‌‌‌‌ నడిపేవాళ్లు. అలాంటి తక్కువ మందిలో ఒకరు కర్నాటకకు చెందిన రేఖ. కన్నడలో కుకింగ్‌‌‌‌ ఛానెల్స్‌‌‌‌ ఎక్కువగా లేని టైంలో ఛానెల్ మొదలు పెట్టింది. ఇప్పుడు ఆమె ఛానెల్‌‌‌‌కు 25 లక్షల మంది సబ్‌‌‌‌స్క్రయిబర్స్  ఉన్నారు. ఛానెల్‌‌‌‌ మొదలుపెట్టడం చాలా తేలిక. కానీ.. ఇంతమంది సబ్‌‌‌‌స్క్రయిబర్స్‌‌‌‌ని సంపాదించుకోవడం, అప్‌‌‌‌లోడ్ చేసిన కంటెంట్‌‌‌‌కు  వ్యూయర్స్​ మెచ్చుకోలు పొందడం అంత ఈజీ కాదు. 

కర్నాటకలోని బెంగళూరుకు సమీపంలోని బయ్యప్ప గ్రామంలో పుట్టింది రేఖ. తర్వాత వాళ్ల కుటుంబం హెబ్బగోడిలో స్థిరపడింది. తండ్రి  మేస్త్రీ పని చేసేవాడు. తల్లి గృహిణి. రేఖకు చిన్నప్పటి నుంచి చదువంటే ఇష్టం ఉండేది కాదు. ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌సీ(టెన్త్‌‌‌‌ క్లాస్‌‌‌‌) ఫెయిల్‌‌‌‌ అయ్యింది. రెండోసారి ఎగ్జామ్స్‌‌‌‌ రాసినా లాభం లేకపోయింది. ఆమెకు మళ్ళీ చదవాలి అనిపించలేదు. ఏడో తరగతి నుంచే అమ్మ వంట చేస్తుంటే బాగా గమనించేది. అలా వంట చేయడం నేర్చుకుంది. దాంతో పదో తరగతి తరువాత ఏడాది పాటు అమ్మకు వంటలో సాయం చేస్తూ ఇంట్లోనే ఉండిపోయింది.  ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో ఏదైనా పని చేయాలి అనుకుంది. రేఖకు టైలరింగ్‌‌‌‌ మీద ఆసక్తి ఉండేది. అందుకే ఒక గార్మెంట్స్‌‌‌‌ ఫ్యాక్టరీలో పనికి కుదిరింది. మొదట్లో నెలకు1,200 రూపాయల జీతం ఇచ్చేవాళ్లు. కానీ.. పని మాత్రం చాలా కష్టంగా ఉండేది. చిన్న తప్పు చేసినా అందరూ తిట్టేవాళ్లు.  దాంతో చాలా బాధపడేది. కానీ.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అక్కడే నాలుగేండ్లు పనిచేసింది. ఆ ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌తో మరో పెద్ద కంపెనీలో చేరింది. ఆ కంపెనీలో మొదటి జీతం 4,000 రూపాయలు. 

కంపెనీలోనూ వంట

రెండో కంపెనీ రేఖకు బాగా నచ్చింది. అక్కడ అందరూ బాగా ప్రోత్సహించేవాళ్లు. తప్పు చేస్తే.. సరిచేసేవాళ్లు. ‘మహిళా దినోత్సవం, దసరా’ లాంటి స్పెషల్‌‌‌‌ డేస్‌‌‌‌లో కంపెనీలో కాంపిటీషన్స్​ పెట్టేవాళ్లు. రంగోలీ, కుకింగ్‌‌‌‌, మెహందీ, ఆటల పోటీల్లో పాల్గొని గిఫ్ట్స్‌‌‌‌ గెలుచుకునేది రేఖ. ఆ పోటీల్లో రేఖ చేసిన వంటలను చాలామంది మెచ్చుకునేవాళ్లు. అలా అప్పుడే ఆమెకు కుకింగ్‌‌‌‌ ఛానెల్‌‌‌‌ ఐడియా వచ్చింది. కానీ.. అందుకు కావాల్సిన ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌ లేకపోవడంతో అది ఐడియాగానే ఆగిపోయింది. 

అలా మొదలైంది

రెండో కంపెనీలో ఐదేళ్లు పనిచేశాక అకస్మాత్తుగా రేఖ ఆరోగ్యం పాడైంది. ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం ఉద్యోగం మానేసింది. ఆమె పరిస్థితి చూసి, కంపెనీ సిబ్బంది కూడా సాయం చేశారు.  కానీ.. పూర్తిగా కోలుకునే సరికి ఆమె అప్పటివరకు దాచుకున్న డబ్బంతా ఆవిరైపోయింది. ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. కానీ.. అదే ఏడాది రేఖ తమ్ముడి చదువు పూర్తయింది. ఇన్ఫోసిస్‌‌‌‌లో ఉద్యోగంలో చేరాడు. దాంతో అతని సపోర్ట్‌‌‌‌తో యూట్యూబ్‌‌‌‌ ఛానెల్‌‌‌‌ పెట్టాలి అనుకుంది. వెంటనే ఇద్దరూ కలిసి 2016లో ‘రేఖ అడుగే’ పేరుతో ఛానెల్‌‌‌‌ పెట్టారు. ఛానెల్‌‌‌‌ కోసం ఓ రెండు రెసిపీలు వండి, ఫోన్‌‌‌‌తో వీడియోలు తీశారు. వాటిని అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేశాక చాలా నెగెటివ్‌‌‌‌ కామెంట్స్ వచ్చాయి. అందుకు కారణం. రెసిపీ బాగా లేక కాదు.. వీడియో క్వాలిటీ సరిగ్గా లేక. దాంతో ఆ వీడియోలను యూట్యూబ్‌‌‌‌ నుంచి డిలీట్‌‌‌‌ చేశారు. అప్పట్లో కన్నడలో వంట ఛానెల్స్ పెద్దగా లేవు. హిందీలో నిషా మధులిక, కబితా కిచెన్ అనే యూట్యూబ్ ఛానెల్స్‌‌‌‌ చూసేది రేఖ. వాళ్లు మంచి క్వాలిటీతో వీడియోలు అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేస్తుండడం వల్లే జనాలు ఎక్కువగా చూస్తున్నారని తెలిసింది. దాంతో వెంటనే తెలిసినవాళ్ల దగ్గర అప్పు తీసుకుని కెమెరా కొని, మళ్లీ వీడియోలు చేయడం మొదలుపెట్టింది. ఈసారి ‘పైనాపిల్ కేసరి బాత్’ అనే ఒక డెజర్ట్‌‌‌‌తో మొదలుపెట్టింది. ఇక అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 

ఎగతాళి చేసేవాళ్లే ఎక్కువ

‘‘ఛానెల్ పెడతా’’ అన్నప్పుడు రేఖ తల్లిదండ్రులు బాగా సపోర్ట్‌‌‌‌ చేశారు. కానీ..  బంధువులు, ఇరుగుపొరుగు వాళ్లంతా ఎగతాళి చేశారు. ‘‘యూట్యూబ్‌‌‌‌ కోసం అప్పు చేసి మరీ అంత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది?’’ అని ప్రశ్నించారు. కానీ, రేఖ మాత్రం దేనికీ బాధపడకుండా పేరు తెచ్చుకోవడమే లక్ష్యంగా పనిచేసింది. 

చాలా కష్టపడ్డారు

వీడియోలు అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసిన వెంటనే రేఖ సక్సెస్‌‌‌‌ కాలేదు. మొదటగా పెద్దగా వ్యూస్‌‌‌‌ వచ్చేవి కాదు. వీడియోలకు వచ్చిన కామెంట్స్‌‌‌‌ ద్వారా సబ్‌‌‌‌స్క్రయిబర్స్‌‌‌‌ ఎలాంటి కంటెంట్‌‌‌‌ కావాలి అనుకుంటున్నారో తెలుసుకుని అలాంటి వీడియోలు చేసింది. చాలామంది గిన్నెలు మార్చమని, కొత్త వంటకాలు చూపించమని అడిగేవాళ్లు.  గార్మెంట్ వర్క్స్‌‌‌‌కి వెళ్లినప్పుడు ఇతర రాష్ట్రాల వాళ్లతో కలిసి పనిచేసిన అనుభవం రేఖకు ఉంది. దాంతో వాళ్ల నుంచి ఎన్నో రకాల కొత్త రెసిపీలు తెలుసుకుని వాటి వీడియోలు చేసింది. తెలియని వంటకాలను పరిచయం చేసేసరికి వ్యూస్‌‌‌‌ బాగా పెరిగాయి. ముఖ్యంగా ఆమె తమ్ముడు ఉదయ్‌‌‌‌ చాలా కష్టపడ్డాడు. ఛానెల్ మొదలుపెట్టిన తర్వాత మూడు నాలుగేండ్ల వరకు ఉదయ్ ఉద్యోగం చేస్తూనే ఛానెల్ పనులు చూసేవాడు. ఉద్యోగానికి వెళ్తూ.. బస్సు, ఆటోలో ట్రావెల్‌‌‌‌ చేస్తున్నప్పుడు మొబైల్‌‌‌‌లో వీడియోలు ఎడిట్ చేసి అప్‌‌‌‌లోడ్ చేసేవాడు. కొన్నిసార్లు రాత్రి ఒంటిగంట వరకు ఎడిటింగ్ పనిమీదే ఉండేవాడు. మొదట్లో వారానికి(ప్రతి ఆదివారం) ఒక వీడియో మాత్రమే చేసేవాళ్లు. సబ్‌‌‌‌స్క్రయిబర్స్ సంఖ్య పెరగడంతో ఎక్కువ వీడియోలు పోస్ట్‌‌‌‌ చేయాలని డిసైడ్‌‌‌‌ అయ్యారు. దాంతో ఉదయ్‌‌‌‌ కూడా ఉద్యోగం మానేసి పూర్తిగా యూట్యూబ్‌‌‌‌ వీడియోలు చేయడం మీదే దృష్టిపెట్టాడు. ఆతర్వాత ఛానెల్‌‌‌‌కు సబ్‌‌‌‌స్క్రయిబర్ల సంఖ్య మరింత పెరిగింది. 

పెళ్లి చేసింది

రేఖ యూట్యూబ్‌‌‌‌ నుంచి వచ్చిన డబ్బుతో ఇల్లు రెనొవేషన్ చేయించింది. కొంత డబ్బు డిపాజిట్ చేసుకుంది. చెల్లి పెళ్లి చేసింది. మరో కొత్త కెమెరాతోపాటు కంప్యూటర్, ట్రైపాడ్‌‌‌‌ లాంటివన్నీ కొన్నది. ఇప్పటివరకు ఛానెల్‌‌‌‌లో 1,513 వీడియోలు అప్‌‌‌‌లోడ్ చేసింది. మొదట్లో ఎగతాళి చేసినవాళ్లే ఇప్పుడు ఆమె సంపాదన చూసి పొగుడుతున్నారు. ఆమెని చూసి చాలామంది యూట్యూబ్ ఛానెల్స్ మొదలుపెట్టారు. బయటకు వెళ్లినప్పుడు చాలామంది ఆమెని గుర్తుపట్టి మాట్లాడుతున్నారు. ఆమె ఛానెల్ చూసి చాలామంది వంట నేర్చుకున్నారు కూడా. కొన్ని కంపెనీలు స్పాన్సర్ వీడియోలు చేయమని కూడా అడుగుతున్నాయి. కానీ.. ‘‘డబ్బు కోసం దేన్ని పడితే దాన్ని ప్రమోట్‌‌‌‌ చేయలేను”అంటుంది  రేఖ. ఆమె ‘రేఖ టాలెంట్’ పేరుతో మరో ఛానెల్‌‌‌‌ కూడా నడుపుతోంది.