మర్డర్‌‌ కేసు తప్పించుకోవడానికి ‘దృశ్యం’ సినిమా స్కెచ్​

మర్డర్‌‌ కేసు తప్పించుకోవడానికి ‘దృశ్యం’ సినిమా స్కెచ్​

న్యూఢిల్లీ: హిట్‌‌‌‌ మూవీ ‘దృశ్యం’ చూసే ఉంటారుగా. అందులో హీరో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి తాను చూసిన సినిమాల్లోని సీన్‌‌‌‌లనే రియల్‌‌‌‌ లైఫ్‌‌‌‌లో అప్లై చేసి పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటాడు. అచ్చం అలానే బయటపడాలనుకొని ఢిల్లీలో ఓ హత్య కేసులో జైలు కెళ్లి వచ్చిన ఓ వ్యక్తి ప్లాన్‌‌‌‌ చేశాడు. తన ఫ్రెండ్స్‌‌‌‌ సాయంతో పోలీసులను తప్పుదోవ పట్టించాలనుకున్నాడు. కానీ ప్లాన్‌‌‌‌ బెడిసికొట్టి అడ్డంగా దొరికిపోయాడు.  

 ఫ్రెండ్స్‌‌‌‌కు దృశ్యం సినిమా చూపించి..

ఉత్తర ఢిల్లీకి చెందిన అమర్‌‌‌‌పాల్‌‌‌‌.. తన ఇంటిపక్కనుండే ఓంబీర్‌‌‌‌ కుటుంబంతో ఎప్పుడూ గొడవపడేవాడు. జూన్‌‌‌‌ 29న కూడా మరోసారి గొడవ జరగ్గా ఆ కొట్లాటలో ఓంబీర్ తల్లి చనిపోయింది. ఆ మర్డర్‌‌‌‌ కేసులో అరెస్టయిన అమర్‌‌‌‌పాల్‌‌‌‌.. 60 రోజుల బెయిల్‌‌‌‌తో ఈమధ్యనే బయటికి వచ్చాడు. రాగానే తనపై కేసును వెనక్కి తీసుకోవాలని ఓంబీర్‌‌‌‌ కుటుంబంపై ఒత్తిడి తెచ్చాడు. వాళ్లు  వినకపోవడంతో ‘దృశ్యం’ సినిమాలోలాగ ప్లాన్‌‌‌‌ వేశాడు. తన సోదరుడు గుడ్డు, కజిన్‌‌‌‌ అనిల్‌‌‌‌ను ఇంటికి పిలిచి వాళ్లకు దృశ్యం సినిమా చూపించాడు. ఆ సినిమాలో లాగా సీన్‌‌‌‌లు, సాక్ష్యాలను మార్చేద్దామని వాళ్లకు చెప్పాడు.

ఖైబర్‌‌‌‌ పాస్‌‌‌‌ దగ్గర ప్లాన్‌‌‌‌ అమలు

ప్లాన్‌‌‌‌లో భాగంగా ఓంబీర్‌‌‌‌ కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని పక్కనున్న వాళ్లను అమర్‌‌‌‌పాల్‌‌‌‌ నమ్మించే ప్రయత్నం చేశాడు. ఓంబీర్‌‌‌‌ తల్లిని తాను చంపలేదని చెప్పేవాడు. ఈ క్రమంలోనే ఒక దేశీ పిస్టల్‌‌‌‌ను, బుల్లెట్‌‌‌‌ ప్యాలెట్స్‌‌‌‌ను అమర్‌‌‌‌ కొన్నాడు. తనను చనిపోకుండా కాల్చాలని గుడ్డు, అనిల్‌‌‌‌కు చెప్పాడు. అనిల్‌‌‌‌.. తన బావ మనీశ్‌‌‌‌ను కూడా ప్లాన్‌‌‌‌లో చేర్చుకున్నాడు. ప్లాన్‌‌‌‌ను అమలు చేసేందుకు అమర్‌‌‌‌.. తాను తరచూ వెళ్లే, తనకు ఎక్కువ మంది పరిచయమున్న ఖైబర్‌‌‌‌ పాస్‌‌‌‌ను సెలెక్ట్‌‌‌‌ చేసుకున్నాడు. అక్కడికి వెళ్లి అనిల్‌‌‌‌, గుడ్డు, మనీశ్‌‌‌‌ కోసం వెయిట్‌‌‌‌ చేశాడు. ప్లాన్‌‌‌‌ ప్రకారం వాళ్లు ముగ్గురూ ఖైబర్‌‌‌‌ పాస్‌‌‌‌కు వెళ్లారు. అమర్‌‌‌‌ను అనిల్‌‌‌‌ కాల్చి పరారయ్యాడు. గాయాలతో తన ఫ్రెండ్స్‌‌‌‌ ఇంటికి వెళ్లిన అమర్‌‌‌‌.. ఓంబీర్‌‌‌‌ కుటుంబం తనను చంపాలనుకుంటోందని చెప్పాడు. ఆ తర్వాత అనిల్‌‌‌‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. దీంతో అమర్‌‌‌‌ను మరోసారి అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న గుడ్డు, మనీశ్‌‌‌‌ల కోసం  గాలిస్తున్నారు.