కొండ కోనల నడుమ ఉన్న ఆ స్కూల్లో... పండుగ వాతావరణం కనిపిస్తోంది. దానికి కారణం ‘డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్’ ఆ రోజు ఆ స్కూల్‌కి విజిట్‌కి వస్తున్నారు. ఆయనతో పాటు కొంతమంది స్టాఫ్ కూడా. ఆ ఏర్పాట్లన్నీ హెడ్ మాస్టర్ చూసుకుంటున్నారు. అనుకున్నట్టుగానే కాసేపట్లో ఆ అధికారి తన మందీ మార్బలంతో వచ్చేశారు. సభ ప్రారంభమైంది. స్కూల్ విద్యార్థులంతా నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. ప్రారంభోపన్యాసాలు పూర్తయ్యాక ఆఫీసర్‌ని మాట్లాడవలసిందిగా కోరారు హెడ్ మాస్టర్. ఆఫీసర్ మైక్ అందుకుని... “ పిల్లలూ... బాగున్నారా... బాగా చదువుకుంటున్నారా...’’ అని మొదలుపెట్టారు. ‘‘ఓ... బాగా చదువుకుంటున్నాం...’’ అని పిల్లలందరూ కోరస్‌గా చెప్పారు. “వెరీగుడ్. నేను కూడా మీలాగే బుద్ధిగా చదువుకుని ఈరోజు ఇలా ఆఫీసర్‌ని అయ్యా” అన్నారు. ఆ మాట వినగానే పిల్లలంతా చప్పట్లు కొట్టారు. “పిల్లలూ.. మీకో కథ చెప్తా వింటారా..’’ ‘‘చెప్పండి సార్ వింటాం’’ అన్నారు పిల్లలు ముక్తకంఠంతో.“ సరే... వినండి మరి..’’ అని కథ చెప్పడం మొదలుపెట్టారు ఆఫీసర్.
ఆ ఇంట్లో చాలా అర్థం కాని పరిస్థితి నెలకొంది. అనారోగ్యంతో మంచం మీద పడుకున్న రాజారాం తన పదిహేడేండ్ల కొడుకు వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు. ‘మూతి మీద మీసం కూడా సరిగ్గా రాలేదు. లోకం పోకడ తెలియని తన కొడుకుని అంత దూరం ఒంటరిగా ఎలా పంపించాలి’ అని అతని మనసులో బాధ పడ్డాడు. ఆ సమయంలో ఈ పరిస్థితికి కారణమైన సంఘటనలు అతని కళ్ళ ముందు కదిలాయి. “నేను ఎంసెట్ పరీక్ష రాస్తా నాన్నా?’’ అని అడిగాడు నవీన్. కొడుకు వైపు అయోమయంగా చూశాడు రాజారాం. ఉత్తరాంధ్రలోని అటవీ ప్రాంతంలో ఉన్న బాగా వెనకబడిన పల్లెటూరు అది. ఆ ఊరికి దగ్గర్లో ఉన్న వేరే పల్లెటూళ్లో టీచర్‌గా పని చేస్తున్నాడు రాజారాం. పొద్దున్న సైకిల్ మీద బయలు దేరుతాడు. మధ్యలో ఉన్న చిన్న ఏరుని దాటి, అవతలి పక్క ఉన్న ఊరికి వెళ్ళి అక్కడి స్కూల్లో పాఠాలు చెప్పి వస్తూ ఉంటాడు. చాలామంది టీచర్లు అక్కడ పని చేయలేక పారిపోయారు. పిల్లలు కూడా సరిగ్గా స్కూల్‌కి వెళ్లరు. రాజారాం ఆ ఊరికి టీచర్‌గా వచ్చాక, పరిస్థితి కొంచెం నయం అయింది. పిల్లల్లో మార్పు వచ్చింది. స్కూల్‌కి రావడం ప్రారంభించారు.
ఎండైనా, వానైనా మిన్ను విరిగి మీద పడ్డా కూడా స్కూల్ తెరవడం మానడు రాజారాం. సిన్సియర్‌గా స్కూల్‌కి వచ్చి పాఠాలు చెప్తాడు. అటువంటి నేపథ్యంలో... కొడుకుని ఇంటర్మీడియట్ దాకా చదివించాడు. అదీ తమ ఊరికి దగ్గర్లో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో. తర్వాత తనలాగే కొడుకుని టీచింగ్ ఫీల్డ్ వైపు తీసుకురావాలని ఆశ పడ్డాడు. ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి పెద్ద పెద్ద చదువులు తమ బోటి వాళ్ళకి అందని ద్రాక్ష అని అతని అభిప్రాయం. కానీ కొడుకు మనసులో ఉన్న ఈ కోరిక అతన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. “ఎందుకు రా... ఏదో ఒక డిగ్రీ చేసి నాలాగే టీచర్‌వి అవుదువు గాని’’ అని కొడుక్కి నచ్చజెప్పాడు రాజారాం.“లేదు నాన్నా... నేను ఎంసెట్ రాస్తా. ఇంజనీరింగ్ చదువుతా’’ అన్నాడు నవీన్.
“మన పరిస్థితి నీకు తెలుసు కదా.. మన ఊరు మారుమూల ప్రాంతంలో ఉంది. నువ్వు ఇంటర్మీడియట్ చదవడానికే నానా తంటాలు పడాల్సి వచ్చింది. మన ఊరికి పోస్ట్ ద్వారా ఒక లెటర్ రావాలన్నా చాలా రోజులు పడుతుంది. సరైన ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా లేదు. అన్నింటికీ మించి మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే’’ అని చెప్పాడు రాజారాం.“నాకు అవన్నీ తెలీవు నాన్నా.. నేను ఎంసెట్ రాస్తా. ఇంజనీరింగ్ చదువుతా’’ అని మొండికేశాడు నవీన్. కొడుకు మంకు పట్టు చూసి కాదనలేకపోయాడు రాజారాం. ‘‘తన కొడుకు ఏ ధైర్యంతో ఇలా అడుగుతున్నాడో’’ అతనికి అంతుబట్టలేదు. అయినా ‘సరే’ నన్నాడు. సంతోషంతో నవీన్ ఎంసెట్ పరీక్షకు అప్లై చేశాడు. అనుకున్న రోజు రానే వచ్చింది. వాళ్ళ ఊరికి పది కిలో మీటర్ల దూరంలో ఉన్న చిన్న టౌన్‌లో పరీక్ష సెంటర్ వచ్చింది. కొడుకుని ఎగ్జామ్ సెంటర్‌కి తీసుకెళ్ళాలంటే పొద్దున నాలుగ్గంటలకి బయల్దేరాలి అని అంచనా వేసుకుని, సైకిల్‌ని రెడీగా పెట్టుకున్నాడు రాజారాం. తెల్లవారు జామున నవీన్‌ని నిద్ర లేపి, రెడీ అవ్వమన్నాడు. తర్వాత సైకిల్ వెనక నవీన్‌ని కూర్చోబెట్టుకుని బయలుదేరాడు. ఇంకా తెల్లారలేదు. చీకటిగా ఉంది. దారి బాగాలేదు. కొండల మధ్య నుంచి చెట్టూ చేమా దాటుకుంటూ తొక్కుకుంటూ వెళ్తున్నాడు. ఐదు కిలో మీటర్లు వెళ్ళాక రాయి గుచ్చుకుని సడన్‌గా సైకిల్ టైర్ పంక్చర్ అయింది. చెమటలు కారుతున్నాయి రాజారాం ఒంటి మీద. సైకిల్ దిగి ఉసూరుమంటూ ఇద్దరూ నడక మొదలుపెట్టారు. కొంత దూరం వెళ్ళాక ‘నేను నడవలేను నాన్నా’ అని మొరాయించాడు నవీన్. సరే అని అతన్ని సైకిల్ మీద కూర్చోబెట్టి తోసుకుంటూ నడవసాగాడు రాజారాం. తన కోసం తండ్రి పడుతున్న బాధని గమనిస్తున్నాడు నవీన్. గమ్యం ముఖ్యమైనప్పుడు ఎదురయ్యే సమస్యలని లెక్క చేయకూడదని అర్థం చేసుకున్నాడు. ఎలాగైతేనేం ఎగ్జామ్ సెంటర్‌కి టైంకి చేరుకున్నారు. పరీక్ష రాశాక, సైకిల్ పంక్చర్ వేయించుకుని ఇంటికి వెళ్లారు. ఈ సంఘటన నవీన్ మనసులో బలమైన ముద్ర వేసింది.
ఎంసెట్‌లో నవీన్‌కి మంచి ర్యాంక్ వచ్చింది. కొడుకుని మనసారా హత్తుకున్నాడు రాజారాం. మంచి కాలేజీలో సీటు దొరికింది నవీన్‌కి. కాకపోతే, అది వాళ్ళ ప్రాంతానికి చాలా దూరంలో ఉన్న రాయలసీమలో. ‘‘నవీన్ అంత దూరం వెళ్లి, కాలేజీలో చదవగలడా?’’ అని ఆలోచనలో పడ్డాడు రాజారాం. ఆ భగవంతుని మీద భారం వేసి, కొడుకుని పంపడానికే నిశ్చయించుకున్నాడు. కాలేజీలో చేరడానికి ఇంకా టైం ఉండటంతో ఇంటి దగ్గర హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు నవీన్. నెలలు గడిచిపోయాయి. కాలేజీ అడ్మిషన్ టైం దగ్గరపడింది. సడన్‌గా రాజారాం ఆరోగ్యం పాడైంది. బెడ్ రెస్ట్‌లో తీసుకోమన్నారు డాక్టర్లు. “నాన్నా..’’ అని నవీన్ పిలవడంతో ఆలోచనల్లోంచి తేరుకున్నాడు రాజారాం. “నేను ఒక్కడినే వెళ్ళి జాయిన్ అవుతా నాన్నా..’’ చెప్పాడు నవీన్. ఆశ్చర్యంగా తన వంక చూశాడు రాజారాం. “నవీన్, ఒక్కడివే అంత దూరం అదీ తెలియని ప్రాంతానికి వెళ్తానంటున్నావ్. అసలు నీ ధైర్యం ఏంటి?’’ ప్రశ్నించాడు రాజారాం. “నా ధైర్యం నువ్వే నాన్నా...’’ అన్నాడు నవీన్. “నేనా.. ఎలా!’’ ఆశ్చర్యపోయాడు రాజారాం.“నువ్వు మర్చిపోవచ్చు. కానీ ఆ సంఘటన నేను మర్చిపోలేను నాన్నా’’ అని ఆగి,‘‘... బాగా వర్షాలు పడి ఏరు నిండుగా పొంగుతున్నా లెక్కచేయకుండా నువ్వు స్కూల్‌కి వెళ్ళిన రోజు’’ అన్నాడు .రాజారాంకి ఆ రోజు జరిగింది కళ్ళ ముందు కదిలింది.
వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఏట్లో మోకాళ్ళ లోతు నీళ్ళు. ఏదో రకంగా స్కూల్‌కి వెళ్ళి వస్తున్నాడు రాజారాం. స్కూల్ పిల్లలకి పరీక్షలు వచ్చాయి. తప్పకుండా కండక్ట్ చెయ్యాలి అనుకున్నాడు రాజారాం. అందుకే పొద్దున్నే సైకిల్ మీద స్కూల్‌కి బయల్దేరాడు. మధ్యలో సైకిల్‌ని నడిపించుకుంటూ ఏట్లోకి దిగి నెమ్మదిగా దాటుతున్నాడు. ఇంతలో ఏరు పొంగింది. నీటి మట్టం పెరుగుతోంది. నడుము లోతు నీళ్లలో ఉన్నాడు రాజారాం. దూరం నుంచి చూస్తున్న వాళ్ళు ‘‘సార్.. వెనక్కి వచ్చేయండి’’ అని అరుస్తున్నారు. అయినా రాజారాం ముందుకే వెళ్తున్నాడు. చేతిలో ఉన్న సైకిల్ ఇంకా ఇబ్బంది పెడుతోంది. దాన్ని ఎత్తి తలపైన పెట్టుకున్నాడు. నెమ్మదిగా ఏరు దాటుతున్నాడు. నీటి మట్టం అతని మెడ దాకా పెరిగింది. ప్రవాహం పెరిగింది. అయినా రాజారాం వెనక్కి తగ్గలేదు. సైకిల్‌ని వదల్లేదు. మొండిగా ముందుకే వెళ్తున్నాడు. అది ఎవరో నవీన్‌కి చెప్పారు. వెంటనే నవీన్ పరుగెత్తుకుంటూ వెళ్లాడు. తల మీద సైకిల్‌తో వాళ్ల నాన్న ఏరు దాటుతుండటాన్ని భయం భయంగా చూశాడు. దేవుడి దయ వల్ల నీటి మట్టం ఇంకా పెరగలేదు. రాజారాం అలాగే ముందుకెళ్ళి అవతలి గట్టుని చేరుకున్నాడు. గట్టు మీదకు వెళ్ళి సైకిల్‌ని కింద పెట్టి ఇవతలి గట్టు నున్న కొడుకుని చూస్తూ చేతులూపాడు. ఆ తర్వాత స్కూల్‌కి వెళ్ళి పిల్లలకి పరీక్షలు కండక్ట్ చేశాడు. జరిగింది గుర్తు చేసుకుని.. “అవును. ఆరోజు నేను కొంచెం ధైర్యం చేశా’’ అన్నాడు రాజారాం. భారంగా నిట్టూర్చాడు నవీన్. “ఆ పట్టుదల, తెగింపు, పని మీద నీకున్న అంకితభావం నన్ను బాగా కదిలించాయి నాన్నా. ఒక పని అనుకున్నప్పుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా సాధించి తీరాలని అర్థమైంది నాకు. ఆ స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్న. నేను ఒక్కడినే ఇంజనీరింగ్ అడ్మిషన్‌కి వెళ్ళగలను నాన్నా. భయపడకు’’ అని భరోసా ఇచ్చాడు. ఆనందంగా నవ్వాడు రాజారాం.
“ పిల్లలూ అదీ కథ ...బాగుందా’’ అన్నాడు ఆఫీసర్. “చాలా బాగుంది సార్..’’ అంటూ చప్పట్లు కొట్టారు. హెడ్ మాస్టార్ ఆఫీసర్‌ని అభావంగా చూశాడు. “ఇప్పుడు మన హెడ్ మాస్టర్ని బెస్ట్ టీచర్ అవార్డ్‌తో సత్కరిద్దాం’’ అని శాలువా, షీల్డ్ చేతిలోకి తీసుకున్నాడు ఆఫీసర్. హడ్మాస్టర్ని సత్కరించి ఆ ఆఫీసర్. అందరూ అవాక్కయ్యారు.ఆ ఆఫీసర్ కళ్లు చెమ్మగిల్లాయి. “చిల్డ్రన్, నేను చెప్పిన కథలో ఉన్న రాజారాం ఎవరో కాదు. మీ హెడ్ మాస్టరే. ఆయన కొడుకుని నేనే. జీవితంలో భయాన్ని వదిలేసి, ఇంతవరకు వచ్చానంటే అది ఆయన వల్లే. సక్సెస్‌ను అందుకున్నది ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోనే. ఇంజనీరింగ్ పూర్తయ్యాక, గ్రూప్స్ ఎగ్జామ్ రాశా. ఈరోజు ఆఫీసర్‌గా మీ ముందు నిలబడ్డా. ఆరోజు నేను భయపడి వెనకడుగు వేసి ఉంటే, ఈ స్థాయికి వచ్చేవాడినా? చెప్పండి. సాహసం అంటే ఏదో కాదు, మన చుట్టూ ఉన్న అంధకారపు కోటని బద్దలు కొట్టడమే సాహసం. మీరు కూడా సాహసాలు చెయ్యండి. జీవితంలో పైకి రండి’’ అని నవ్వాడు. కొడుకుని దగ్గరకు తీసుకున్నారు హెడ్ మాస్టర్ రాజారాం.
చివరగా ఆఫీసర్ నవీన్ ‘‘పిల్లలూ బాగా పాఠాలు చెప్పి ఆయన మీకు బెస్ట్ టీచర్ అయితే, జీవితంలో సమస్యల ప్రవాహాన్ని ఎలా దాటాలో నేర్పి, నాకు బెస్ట్ టీచర్ అయ్యారు. హి ఈజ్ ఆల్వేజ్ ది బెస్ట్ టీచర్.’’ అంటూ ముగించాడు. ఆయన ప్రసంగానికి పిల్లల మనసు సంతృప్తితో నిండిపోయాయి.
ఫోన్ : 9490956012