కోల్కతా: కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఈవెంట్ అట్టర్ ప్లాప్ కావడం టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు కురిపించుకున్నాయి. మెస్సీ ఈవెంట్లో గందరగోళ పరిస్థితులు నెలకొనడంపై స్పందించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెస్సీ, అతని అభిమానులకు హృదయపూర్వకంగా ఆమె క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి దిద్దుబాటు చర్యలు సిఫార్స్ చేయడానికి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
మరోవైపు ఈ ఘటనపై స్పందించిన ప్రతిపక్ష బీజేపీ టీఎంసీ ప్రభుత్వ వైఫ్యలం వల్లే మెస్సీ కార్యక్రమంలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయని దుమ్మెత్తిపోసింది. కోల్ కతాలో వరల్డ్ స్టార్ ప్లేయర్ మెస్సీ ఈవెంట్ ఫెయిల్ కావడం యావత్ రాష్ట్రంతో పాటు ఫుట్‌బాల్ క్రీడకు అవమానం అని బీజేపీ విమర్శించింది. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం మమతా బెనర్జీ మొసలి కన్నీరు కార్చారని ఎదురు దాడి చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రజల భావోద్వేగాలపై టీఎంసీ ప్రభుత్వం ప్రత్యక్ష దాడిని ప్రారంభించిందని ఫైర్ అయ్యింది.
ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్, ఆయన మంత్రివర్గ సహోద్యోగి సుజిత్ బోస్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. తక్షణమే వారిని పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది బీజేపీ. ప్రేక్షకులకు డబ్బు రిఫండ్ చేయాలని సూచించింది. బీజేపీ విమర్శలకు టీఎంసీ కౌంటర్ ఇచ్చింది. మెస్సీ ఈవెంట్ ప్రభుత్వం నిర్వహించలేదని.. ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని స్పష్టం చేసింది.
కాగా, గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా శనివారం (డిసెంబర్ 13) కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియానికి మెస్సీ వచ్చారు. ఈ గ్రౌండ్లో మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో తమ అభిమాన ప్లేయర్ ఆటను కళ్లారా చూసేందుకు వేలకు వేలు పెట్టి టికెట్ కొని స్టేడియానికి తరలివచ్చారు ప్రేక్షకులు. కానీ మెస్సీ మ్యాచ్ ఆడకపోవడంతో అభిమానుల ఆశలు అడియాశలు అయ్యాయి. అంతేకాకుండా స్టేడియంలో మెస్సీ పట్టుమని పది నిమిషాలు కూడా ఉండలేదు. దీంతో మెస్సీ మ్యాచ్ ఆడతాడని ఆశించి వేలకు వేలు పెట్టి టికెట్లు కొన్న అభిమానుల కోపం కట్టలు తెంచుకుంది.
12 వేలు పెట్టి టికెట్ కొంటే ఇలా ఉసూరుమనిపించడం దారుణమని గోట్ ఫ్యాన్స్ కోపంతో రగిలిపోయారు. ఈ క్రమంలోనే స్టేడియంలో సీట్లు ధ్వంసం చేశారు. కుర్చీలు విరగ్గొట్టారు. స్టేడియంలోకి వాటర్ బాటిళ్లు విసిరేసి అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. కొందరు ఫ్యాన్స్ బారికేడ్లు దాటుకొని లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగ ప్రవేశ చేసి అభిమానులను చెదరగొట్టారు. ఫ్యాన్స్ గొడవ చేయడంతో మెస్సీ టీమ్ సొరంగం ద్వారా బయటకు వెళ్లిపోయారు. మెస్సీ మ్యాచ్ ఆడతారని ఊరించి చివరకు ఉసూరుమనిపించడంతో ఐదు నిమిషాల్లో మెస్సీ అభిమానులు సాల్ట్ లేక్ స్టేడియం లోపల రచ్చ రచ్చ చేశారు.

