సంగారెడ్డిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పూర్తయ్యేనా?

సంగారెడ్డిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పూర్తయ్యేనా?
  •     రెండేళ్లుగా కొనసాగుతున్న పనులు
  •      కాంప్లెక్స్ లో 104 షాపులకు ప్లాన్
  •     నాణ్యత లోపాలు.. పట్టించుకోని ఆఫీసర్లు

సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డిలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ ఇంకా పూర్తి కాలేదు. రెండేళ్లుగా కేవలం బేస్మెంట్, పిల్లర్ల స్థాయిలోనే పనులు జరుగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా పనులు ఆలస్యం అవుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. సంగారెడ్డి బైపాస్ రోడ్డు మూలమలుపు వద్ద రెండెకరాల స్థలంలో నిర్మిస్తున్న ఈ కాంప్లెక్స్ కు రూ.6.70 కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయించారు. 

2021 డిసెంబర్ 18న అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయగా వెంటనే టెండర్లు పూర్తిచేసి కాంట్రాక్టర్ కు పనులు అప్పగించారు. అందరికీ సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఒకే దగ్గర వెజ్, నాన్ వెజ్, పూలు, పండ్లు, కూరగాయలు అమ్మేందుకు 104 షాపులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ప్లాన్ చేశారు. ఏడాదిలోగా కాంప్లెక్స్ పనులు పూర్తి చేయాల్సి ఉండగా రెండేళ్లయిన నత్తనడకన సాగుతున్నాయి. 

 ప్రయోజనాలు ఎన్నో..

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ పనులు త్వరగా పూర్తి చేస్తే వ్యాపారులు, ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. గ్రామీణ ప్రాంత రైతులు పండ్లు, కూరగాయలు, పూల అమ్మకాల కోసం ఇక్కడికే రావాల్సి ఉంటుంది. సంగారెడ్డి మున్సిపల్ పరిధిలో ప్రస్తుతం వారాంతపు సంతలు నాలుగు కొనసాగుతుండగా పోతిరెడ్డిపల్లి చౌరస్తా,  బైపాస్ రోడ్డు, పాత బస్టాండ్ లోని భవానీ మందిర్, సినిమా రోడ్డులో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది. 

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ పూర్తయితే ట్రాఫిక్​సమస్య తొలగిపోతుంది. మార్కెట్ లోని షాపులు త్వరగా పూర్తి చేయిస్తే పట్టణ పరిధిలో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా కొనసాగుతున్న మాంసం విక్రయాలకు బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సంగారెడ్డిలో కొనసాగుతున్న మటన్, చికెన్ షాపుల నిర్వహణ తీరు కారణంగా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. 

ఫండ్స్ డిలే

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఫండ్స్ డిలే అవుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పూర్తి కావాల్సిన ఈ కాంప్లెక్స్​ప్రభుత్వం సరైన టైంలో ఫండ్స్ రిలీజ్ చేయకపోవడం వల్లే పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. సదరు కాంట్రాక్టర్ కు కేవలం రూ. కోటి మాత్రమే ఇచ్చినట్టు తెలిసింది. మరో ఐదున్నర కోట్లు రావాల్సి ఉండడంతో పనులు నత్త నడకన సాగుతున్నాయి. మరోవైపు జరిగిన పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. 

నాణ్యత లేని స్టీల్, సిమెంట్, డస్ట్ వాడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం ఆఫీసర్లు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే పనుల జాప్యంతోపాటు నాణ్యత ప్రమాణాలు లోపించాయని వ్యాపారులు సైతం విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్ ఫండ్స్ కొత్త ప్రభుత్వం ద్వారా తెప్పించుకుని పనులు త్వరగా పూర్తి చేయించాలని ప్రజలు కోరుతున్నారు.