జనాన్ని కదిలించిన మేధావులు.. కాంగ్రెస్ తరఫున కోదండరాం క్యాంపెయిన్

జనాన్ని కదిలించిన మేధావులు.. కాంగ్రెస్ తరఫున కోదండరాం క్యాంపెయిన్
  • బస్సు యాత్ర చేపట్టిన ఆకునూరి మురళి

హైదరాబాద్, వెలుగు : ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార పార్టీని ఓడించాలని పలువురు మేధావులు, ప్రొఫెసర్లు చేసిన కృషి ఫలించింది. ఇందులో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కేసీఆర్​ను ఓడించాల్సిందే అంటూ అన్ని జిల్లాల్లో, ప్రతి మీటింగ్​లో చెబుతూ వచ్చారు. కేసీఆర్​ను ఓడించాలంటే అందరూ కలిసి పోటీ చేయాలని ఆయన ప్రతిపాదించి కాంగ్రెస్​కు పొత్తుకు ప్రయత్నించారు. అయితే, టీజేఎస్ అడిగిన సీట్లు ఇస్తే బీఆర్ఎస్​కు లాభమని భావించిన కాంగ్రెస్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభ అవకాశమిస్తామని ఢిల్లీ పెద్దలు ఆయనకు హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున కోదండరాం ప్రచారం  చేసేందుకు అంగీకరించారు.

ఆకునూరి మురళి జాగో యాత్ర

రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళితో పాటు పలువురు ప్రొఫెసర్లు, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ కన్నేగంటి రవి, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, ప్రొఫెసర్ హరగోపాల్, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ నిరూప్ రెడ్డి, ప్రొఫెసర్ పద్మజా షా, జస్టిస్ చంద్రకుమార్, ప్రముఖ డాక్టర్ ఎంఎఫ్ గోపినాథ్​తో పాటు పలువురు మేధావులు జాగో తెలంగాణ యాత్ర పేరుతో సుమారు 55 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించాలని క్యాంపెయిన్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు సెమినార్లు, చర్చ వేదికలు నిర్వహించారు. పదేండ్లలో జరిగింది అభివృద్ధి కాదు.. అవినీతి అని, మూడోసారి కేసీఆర్ గెలిస్తే ప్రజలు గోస పడ్తరని చెప్పారు. లిక్కర్ స్కామ్, పేపర్ లీకేజ్, కాళేశ్వరం బ్యారేజ్ డ్యామేజ్, ఎమ్మెల్యేల అవినీతి, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ల్యాండ్, సాండ్ స్కామ్, 8 వేల మంది రైతు ఆత్మహత్యలు, కౌలు రైతుల కష్టాలు, రుణమాఫీ, దళిత సీఎం, మూడెకరాల భూమి, బీసీ, దళితబంధులో అక్రమాలు ఇలా.. పలు అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. వీటిపై ప్రజల నుంచి మంచి స్పందన రావడం కాంగ్రెస్​కు కలిసి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.