
-
వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో 5+3+3+4 విద్యా విధానం
-
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుకు రాష్ట్ర సర్కారు చర్యలు
-
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలుతాజాగా ఎన్ఈపీపై రిపోర్ట్ కోరిన కేబినెట్ సబ్ కమిటీ
-
అమలైతే ఐదో తరగతి దాకా మాతృభాషలోనే చదువులు
-
ఇంటర్ రద్దుతో కార్పొరేట్ కాలేజీలకు చెక్?
హైదరాబాద్, వెలుగు: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-–2020 (ఎన్ఈపీ) అమలుకు రాష్ట్ర సర్కారు కసరత్తు ప్రారంభించింది. పాలసీలోని కొన్నింటినైనా అమలు చేయాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి ‘ఇంటర్’ విద్యావిధానం ఎత్తేయాలని దాదాపు నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో స్కూల్, ఇంటర్మీడియెట్ఎడ్యుకేషన్ వేర్వేరుగా కొనసాగుతున్నాయి. కొత్త విధానం అమల్లోకి వస్తే ‘బోర్డ్ఆఫ్ ఇంటర్మీడియెట్’ పోయి, స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వస్తుంది. దీనివల్ల పర్యవేక్షణ సులభం కావడంతోపాటు సర్కారుపై ఆర్థిక భారం తగ్గుతుంది. మరోవైపు దోపిడీలకు కేంద్రంగా మారిన కార్పొరేట్ ఇంటర్ కాలేజీలకు చెక్ పడే అవకాశముంది. ఈ క్రమంలోనే ఎన్ఈపీ–2020 అమలు వల్ల కలిగే ప్రయోజనాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఎడ్యుకేషన్ కేబినెబ్ సబ్ కమిటీ తాజాగా ఆదేశించింది.దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలవుతున్న విద్యావిధానంలో పలు మార్పులు, చేర్పులతో కేంద్ర ప్రభుత్వం 2020లో నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. దీనిని బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాలు అమలుచేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలు మాత్రమే ఎన్ఈపీ–2020ను అమలు చేయడం లేదు. ఈ క్రమంలో స్కూల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఎన్ఈపీ విధానాలు అమలు చేయాలని ఆయా రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకొస్తున్నది.
మరోసారి ఎన్ఈపీపై చర్చలు
ఇటీవల జరిగిన ఎడ్యుకేషన్ కేబినెట్ సబ్ కమిటీలోనూ ఎన్ఈపీ అమలుపై చర్చ జరిగింది. 2020లో తీసుకొచ్చినా.. ఇప్పటికీ మన రాష్ట్రంలో అమలు చేయకపోవడంపై కేంద్రం గుర్రుగా ఉన్న విషయాన్ని కమిటీకి అధికారులు వివరించారు. ఈ క్రమంలో ఎన్ఈపీ అమలులో మెరిట్స్, డీ మెరిట్స్ పై నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ సెక్రెటరీని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. దీనిపై టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, ఎన్జీవోలు, మేనేజ్మెంట్లు.. ఇలా అందరితో సమావేశాలు పెట్టి, మరోసారి చర్చించాలని సూచించింది. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనూ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నేతృత్వంలో ఎన్ఈపీ అమలుపై విస్తృతంగా చర్చించారు. అప్పట్లోనే సర్కారుకు నివేదిక కూడా అందించారు. కానీ, దానిపై గత బీఆర్ఎస్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇంటర్ ఎత్తివేతకు మొగ్గు..
ప్రస్తుతం రాష్ట్రంలో 5+2+3+2 (5 వరకు ప్రైమరీ, 7 వరకు అప్పర్ ప్రైమరీ, 10 వరకు హైస్కూల్, ఆ తర్వాత ఇంటర్) విద్యావిధానం అమల్లో ఉంది. దీన్ని 5+3+3+4 విధానం(5 వరకు ప్రీ ప్రైమరీ, 8 వరకు అప్పర్ ప్రైమరీ, 9 నుంచి సెకండరీ ఎడ్యుకేషన్)లో అమలు చేయాలని కేంద్రం సూచిస్తున్నది. తొలి ఐదేండ్లలో అంగన్ వాడీ, ప్రీ స్కూల్ మూడేండ్లు, ఒకటి, రెండు తరగతులు ఉంటాయి. తర్వాత మూడేండ్లు 3,4,5 క్లాసులు, ఆ తర్వాతి మూడేండ్లు 6,7,8 క్లాసులుంటాయి. చివరి నాలుగేండ్లలో సెకండరీ ఎడ్యుకేషన్ కింద 9,10,11,12 తరగతులుంటాయి. అయితే, ప్రస్తుతం మన రాష్ట్రంలో స్కూల్, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ వేర్వేరుగా అమలవుతున్నాయి. కొత్త విధానం అమలు చేస్తే ప్రత్యేకంగా ఇంటర్ అనేది లేకుండా పోతుంది. ఏపీ, తెలంగాణ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ఇంటర్ విద్యను సెకండరీ ఎడ్యుకేషన్ కింద పిలుస్తారు. మరోపక్క ప్రస్తుతం స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో 600 వరకు జూనియర్ కాలేజీలు (కేజీబీవీ, మోడల్ స్కూల్) నడుస్తుండగా, ఇంటర్ కమిషనరేట్ పరిధిలో సర్కారు కాలేజీలు 420 మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ లో ఇంటర్ విద్యను విలీనం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల పర్యవేక్షణ సులభంకావడంతోపాటు సర్కారుపై ఆర్థిక భారం తగ్గుతుందని, కార్పొరేట్ఇంటర్కాలేజీలకు చెక్పడే అవకాశముందని గతంలోనే అధికారులు సర్కారుకు నివేదిక కూడా ఇచ్చారు. తాజాగా, ఎన్ఈపీపై చర్చ నేపథ్యంలో ఇంటర్ వ్యవస్థ ఎత్తివేస్తేనే బెటర్ అని విద్యావేత్తలు చెబుతున్నారు.
మాతృభాషలోనే బోధన
తొలుత ఎన్ఈపీలోని ఎలాంటి వివాదాస్పదం కాని అంశాలను అమలు చేయాలని సర్కారుకు విద్యాశాఖ అధికారులు సూచించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒకటో తరగతిలో చేరాలంటే ఆరేండ్లు నిండి ఉండాలనే నిబంధన పెట్టింది. దేశవ్యాప్తంగా కేంద్ర విద్యాసంస్థలైన నవోదయ, కేంద్రీయ విద్యాలయాలతోపాటు సీబీఎస్ఈ సిలబస్ ఉన్న స్కూళ్లన్నింటిలోనూ ఆ నిబంధన అమలు చేస్తున్నది. కానీ, రాష్ట్రంలోని స్టేట్ సిలబస్ స్కూళ్లలో మాత్రం ఐదేండ్లు నిండితే అడ్మిషన్లు ఇస్తున్నారు. జాయ్ ఫుల్ లర్నింగ్ కోసం ఆరేండ్ల నిబంధన అమలు చేయడం ద్వారా ఇబ్బందులేమీ ఉండబోవని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ అమలు చేయకపోతే.. జాతీయస్థాయి పోటీ పరీక్షల సమయంలో ఏజ్ సమస్య వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికితోడు ఐదో తరగతి వరకు మాతృభాష/ స్థానిక భాషలోనే విద్యాబోధన చేయాలనే అంశంపైనా సర్కారు సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ విధానం అమలు చేస్తే.. ఆరో తరగతి నుంచే ఎడ్యుకేషన్ విధానం అమలు చేయనున్నారు. ఇక ఇంటర్మీడియెట్ఎత్తివేతకూ ఇప్పటికే సర్కారు గ్రీన్సిగ్నల్ఇచ్చినట్టు ఆఫీసర్లు చెప్తున్నారు.
హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇప్పటికే షురూ.
హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఇప్పటికే ఎన్ఈపీ అమలు ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలో హానర్స్ డిగ్రీ పేరుతో నాలుగేండ్ల డిగ్రీ అమలు చేస్తున్నారు. జేఎన్టీయూ అధికారులు కూడా ఇంజినీరింగ్ లో మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ అమలు చేస్తామని గతంలో ప్రకటించారు. సీబీసీఎస్ విధానం, బకెట్ సిస్టమ్ కూడా అమలు చేస్తున్నారు. ఎంఫిల్ ను కూడా రద్దు చేయడంతో రాష్ట్రంలోని వర్సిటీల్లో ఆ కోర్సు లేకుండా పోయింది. మరోపక్క సెంట్రల్ వర్సిటీల్లోనూ జాతీయస్థాయిలో ఎంట్రెన్స్ పెట్టి, అడ్మిషన్లు ఇస్తున్నారు.