ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా

ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా
  • హైకోర్టు సూచనలతో ప్రభుత్వం వెనుకంజ
  • హైకోర్టు సూచనల మేరకు వాయిదా వేస్తున్నాం- విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎట్టకేలకు ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు చివరకు హైకోర్టు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణ విషయంలో వెనుకడుగు వేసింది. ఎన్నికల సంఘంపై సుప్రీం కోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం.. మన పక్కన ఉన్న తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్రంగా మండిపడుతూ 45 నిమిషాల్లో మీరు నిర్ణయం చెబుతారా.. లేక మేమే ఆదేశాలివ్వాలా అంటూ సీరియస్ కావడం.. వెంటనే కేసీఆర్ ప్రభుత్వం వారం రోజులపాటు నైట్ కర్ఫ్యూను పొడిగించడం నిమిషాల్లో జరిగిపోయాయి. ఈ పరిణామాల నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షలకు కట్టుబడి ఉందంటూ సీఎం జగన్ ప్రకటించడం ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. కనీసం ఒక నెల రోజుల వాయిదా వేస్తే కొంపలేమీ అంటుకుపోవని.. ప్రతిపక్షాలు ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.  ఇప్పటికే అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటిస్తుండడంతో హైకోర్టు, సుప్రీం కోర్టులు కరోనా కట్టడి విషయంలో స్పందిస్తున్న తీరుతో ఎట్టకేలకు ప్రభుత్వం పునరాలోచనలో పడింది. రేపు కోర్టులో విచారణ జరగనున్న నేపధ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీవ్రంగా స్పందించే అవకాశం ఉందని గుర్తించి వాయిదా నిర్ణయాన్ని ప్రకటించారు. 
హైకోర్టు అభిప్రాయాన్ని గౌరవిస్తూ వాయిదా –మంత్రి ఆదిమూలపు సురేష్
ఇంటర్‌మీడియట్‌ పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. కోవిడ్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలన్నీ కేంద్ర ప్రభుత్వమే తయారుచేసిన విషయం అందరికీ తెలిసినదే. కానీ 10వ తరగతి, 11–12వ తరగతి(ఇంటర్‌) పరీక్షలకు సంబంధించి దేశం అంతటికీ వర్తించేలా ఒకేలా నిబంధనలు విధించకపోవటం వల్ల... ఈ విషయంలో జాతీయ విధానం అంటూ ఏదీ ప్రకటించకపోవటం వల్ల... జాతీయ విధానం అంటూ లేకపోవటం వల్ల,  కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు ఇప్పటికే నిర్వహించేశారని ఆయన పేర్కొన్నారు. మరి కొన్ని రాష్ట్రాల్లో నిర్వహించే యోచన చేస్తున్నారని ఆయన ప్రస్తావించారు. మరి కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేసి పాస్‌ సర్టిఫికెట్‌ ఇస్తుండగా రద్దు కాకుండా ఉన్న రాష్ట్రాల్లో బాగా చదివిన విద్యార్థులకు మంచి మార్కులతో, గ్రేడ్‌లతో సర్టిఫికెట్లు వస్తాయి. మార్కులూ ర్యాంకులూ ఉన్న విద్యార్థులకు మంచి కాలేజీల్లో సీట్లు లభిస్తాయి. ఇంటర్‌ తరవాత పెద్ద చదువుల కోసం రాసే పోటీ పరీక్షకు కూడా ఇంటర్‌లో కనీసం ఇంత శాతం మార్కులు వచ్చి తీరాలన్న నిబంధనలు కూడా ఉన్నాయి. ఆ పిల్లల కెరీర్‌ అవకాశాల పరంగా చూసినా, వారి  భవిష్యత్‌ ఉద్యోగాల కోసం కూడా... ఇలా ఇంటర్‌ మార్కుల్ని పరిగణనలోకి తీసుకున్న ప్రతి సందర్భంలోనూ పరీక్ష రాసి మంచి మార్కులతో, ర్యాంకులతో సర్టిఫికెట్‌ కలిగి ఉన్నవారికి మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయి. ఈ మార్కులే వారి పైచదువులు, ఉద్యోగ అవకాశాల పరంగా కీలకం అవుతాయి కాబట్టే... ఎట్టి పరిస్థితుల్లోనూ మన రాష్ట్రంలోని మన విద్యార్థి వెనకబడకుండా చూడాల్సిన బాధ్యత ఒక మంచి ప్రభుత్వంగా మన మీద ఉంది కాబట్టే... వారి పరీక్షల నిర్వహణకు మనందరి ప్రభుత్వం ఇంతగా తాపత్రయపడిందన్నారు. పూర్తిగా కోవిడ్‌ నిబంధనల్ని పాటిస్తూ పరీక్ష కేంద్రాల్లో ఆరోగ్యపరమైన అన్ని నిబంధనలూ అమలు చేస్తూ... ప్రత్యేక బృందాల పర్యవేక్షణలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించాలని భావించాం. అదీగాక, పిల్లల ప్రాక్టికల్స్‌ పూర్తి అయ్యాయి కాబట్టి, ఇక మిగిలి ఉన్న పరీక్షల ప్రక్రియ 6 రోజులు మాత్రమే. అది కూడా రోజుకు కేవలం 3 గంటల పరీక్ష మిగిలి ఉంది. 
తల్లిదండ్రుల ఆందోళనను పరిగణలోకి తీసుకున్నాం –మంత్రి సురేష్
 పిల్లల ప్రాణాలమీద, వారి భవిష్యత్తుమీద మమకారం ఉన్న ప్రభుత్వంగా సురక్షిత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం, ఇందు కోసం కనీవినీ ఎరుగని విధంగా ఏర్పాట్లు కూడా చేశాం.  అయినా, దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు, ఇందుకు సంబంధించిన వార్తల పట్ల పరీక్ష రాయాల్సిన పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్న విషయాన్ని ప్రజాప్రభుత్వంగా పరిగణనలోకి తీసుకున్నాం. ఈ నేపథ్యంలోనే పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయాలని రాష్ట్ర హైకోర్టు కూడా అభిప్రాయపడినందున, కోర్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆ అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షల వాయిదాను ప్రకటిస్తున్నాం. ఈ పరిస్థితులు చక్కబడిన వెంటనే ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలు ప్రకటిస్తుందని కూడా తెలియజేస్తున్నాం. ఇదే విషయాన్ని రేపు హై కోర్టుకు కూడా తెలియజేస్తామని మంత్రి సురేష్ పేర్కొన్నారు. కన్న బిడ్డలమీద తల్లిదండ్రులకు ఎంతటి బాధ్యత, మమకారం ఉంటుందో, మొత్తంగా రాష్ట్రంలో పిల్లలపట్ల మనందరి ప్రభుత్వానికీ అంతే బాధ్యత, మమకారం ఉంది. వారి భవిష్యత్తును గొప్పగా నిర్మించేందుకు, కాపాడేందుకు ప్రతి ఆలోచనా ఇకమీదట కూడా చేస్తామని మంత్రి సురేష్ వివరించారు.