అశ్వారావుపేట, వెలుగు: చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని దొంగ నోట్లను చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగ నోట్ల ముఠాను మంగళవారం ఖమ్మం జిల్లా అశ్వారావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పాల్వంచ డీఎస్పీ ఆర్. సతీశ్ కుమార్ స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 15న అశ్వారావుపేట సంత మార్కెట్ వద్ద ఒక ఫర్నిచర్ వ్యాపారి షాపులో రూ.14,500 విలువైన సోఫాను కొనుగోలు చేసిన నిందితులు అతడికి అసలు నోట్ల మధ్యలో రూ.5,500 విలువైన రూ.500 నకిలీ నోట్లను ఇచ్చారు. ఆ నగదును వ్యాపారి బ్యాంకులో జమ చేసేందుకు వెళ్లగా, నకిలీ కరెన్సీ అని తేలడంతో బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పట్టణంలోని నాయుడు ముత్యాలరావు ఇంట్లో నిందితులు దొంగ నోట్లు కాలబెడుతుండగా సీఐ నాగరాజు, ఎస్సై యయాతి రాజు ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం గంటవారి గూడెం గ్రామానికి చెందిన కొడెల్లి చిన్న, దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామానికి చెందిన కొనసాముల దుర్గాప్రసాద్, ఇదే మండలం మల్కారం గ్రామానికి చెందిన నాయుడు ముత్యాలరావును అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద 11 దొంగ నోట్లు, 3 ఫోన్లు, సోఫా సెట్, రూ.2 వేల నగదు, సగం కాలిన నోట్ల ముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

