ఇంటర్ దోస్తులు 51 ఏళ్ల తర్వాత కలిసిన్రు

ఇంటర్ దోస్తులు  51 ఏళ్ల తర్వాత కలిసిన్రు

నిర్మల్, వెలుగు: ప్రస్తుతం వారంతా వృద్ధాప్యంలో ఉన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను, నాటి స్నేహితులను ఓ సారి కలుసుకోవాలనుకున్నారు. తేదీ, వేదిక నిర్ణయించుకుని ఆదివారం అందరూ ఒకే వేదికపై కలుసుకుని బాల్య జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.  రోజంతా ఆనందంగా గడిపారు. వారంతా నిర్మల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఇంటర్ చదివిన పూర్వ విద్యార్థు లు, చిన్ననాటి స్నేహితులు. 51ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఒకే వేదికపై కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. కలిసి చదువుకుని వృద్ధాప్యంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన దోస్తులను గుర్తుకు చేసుకుంటూ వారికి నివాళులర్పించారు. 

ఒకరికొకరు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 73 ఏళ్ల వయసు లో అందరూ ఒక్కచోట చేరిన ఆనందంలో చిన్న పిల్లల్లా మారిపోయారు. నిర్మల్ పట్టణం లో  1972, 74 లో ఇంటర్ చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. 50 ఏళ్ల తర్వాత జరుపుకున్న ఈ అపూర్వ సమ్మేళనం అందరినీ ఆకట్టుకుంది. దూర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా ఈ సమ్మేళనానికి వచ్చి తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థి, మాజీ కేంద్రమంత్రి,  ప్రస్తుత ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఎస్ వేణుగోపాలచారి హాజరయ్యారు.