హైదరాబాద్లో పబ్లిక్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌పై తగ్గుతున్న ఆసక్తి.. 70 శాతం మందికి సొంత వాహనాలు

హైదరాబాద్లో పబ్లిక్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌పై తగ్గుతున్న ఆసక్తి.. 70 శాతం మందికి సొంత వాహనాలు
  • గ్రేటర్‌‌‌‌‌‌‌‌లో పబ్లిక్ ​ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌పై సర్కారు నజర్
  • ఆదరణ ఎందుకు తగ్గుతోందో తేల్చాలని నిర్ణయం
  • పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని రవాణా శాఖకు సీఎం ఆదేశాలు
  • ప్రస్తుతం 25 శాతానికే పరిమితమైన ప్రజా రవాణా
  • 2011తో పోలిస్తే రెట్టింపైన టూవీలర్స్​, 6  రెట్లు పెరిగిన కార్లు
  • ఆర్టీసీ బస్సుల పెంపు, మెట్రో విస్తరణపై ఆశలు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌ ప్రజలు పబ్లిక్ ​ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ను పక్కనపెట్టి వ్యక్తిగత వాహనాల వైపు మళ్లుతున్న తీరును సర్కారు సీరియస్గా తీసుకున్నది. ప్రభుత్వం వేల కోట్ల ఖర్చుతో ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్ సేవలను విస్తరిస్తున్నా ఆ మేరకు ప్రజల ఆదరణ పొందకపోవడంపై ఆందోళన చెందుతున్నది. సిటీ రవాణాలో 2011లో 42 శాతంగా ఉన్న ప్రజారవాణా వాటా 2024 లో 25 శాతానికి పడిపోయినట్లు ఇటీవల ‘లీ అసోసియేట్స్’​ అనే కన్సల్టెన్సీ సంస్థ  సర్కారుకు నివేదిక ఇచ్చింది. 2011లో 4 లక్షలుగా ఉన్న కార్ల సంఖ్య 2024లో 24.3 లక్షలకు, 33 లక్షలుగా ఉన్న బైకుల సంఖ్య 69 లక్షలకు చేరినట్లు ఆ రిపోర్ట్​ తేల్చింది. 

వ్యక్తిగత వెహికల్స్​ సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నందునే సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు,  కాలుష్యం ప్రమాదకరస్థాయిలో పెరిగిపోతున్నదని  స్పష్టం చేసింది. దీంతో హైదరాబాద్‌‌‌‌లో పబ్లిక్​ ట్రాన్స్​పోర్టేషన్​పై ​ఇటీవల రవాణా శాఖ నుంచి పూర్తిస్థాయి నివేదికను సీఎం రేవంత్​ కోరినట్లు తెలిసింది. ప్రజారవాణా కోసం ఏటా వేల కోట్లు ఖర్చు పెడ్తున్నా, బస్సులు, మెట్రోల సంఖ్య పెంచుతున్నా ఆ మేరకు ప్రజల ఆదరణ ఎందుకు పొందలేకపోతున్నాం?మహాలక్ష్మి స్కీమ్​ తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా? జనం బస్సులు, మెట్రో బాట పట్టాలంటే ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి?  లాంటి సమగ్ర వివరాలతో రిపోర్ట్​ అడిగినట్లు  రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. 

70 శాతం మంది సొంత వాహనాల్లోనే..
గ్రేటర్​ పరిధిలో 2011 లో 4 లక్షల కార్లు( మొత్తం రవాణాలో 4 శాతం) ఉండగా, 2024 నాటికి   24 లక్షలకు(16 శాతానికి) చేరాయి. అదే సమయంలో 2011 లో 33 లక్షలుగా(38 శాతం) ఉన్న టూవీలర్లు 2024 నాటికి 69 లక్షలకు(45 శాతానికి) పెరిగాయి.  2011తో పోల్చినప్పుడు  బస్సుల్లో ప్రయాణిస్తున్న  వారి సంఖ్యలో పెద్దగా తేడాలేదు. 2011లో 37.6 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తే,  2024లో కూడా 38 లక్షలే ఉంది. కానీ పర్సెంటేజీ పరంగా చూస్తే 2011లో బస్సుల్లో ప్రయాణించేవారు 42 శాతం ఉంటే, 2024లో 25 శాతానికి పడిపోయింది.

ఎంఎంటీఎస్​లో 2011లో 3.5 లక్షల మంది ప్రయాణిస్తే, 2024 నాటికి 3 వేలకు పడిపోయింది. ట్యాక్సీల్లో ప్రయాణిస్తున్న వారి సంఖ్య 5 శాతం నుంచి 6 శాతానికి స్వల్పంగా పెరిగినా, ఆటోల్లో ప్రయాణిస్తున్నవారి సంఖ్య 7 శాతం నుంచి 5 శాతానికి పడిపోయింది. ఇలా ఏరకంగా చూసినప్పటికీ గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం ప్రజా రవాణా(ఆర్టీసీ, ఎంఎంటీఎస్​, మెట్రో కలిపి) 30 శాతం లోపే ఉంది. మిగిలిన 70 శాతం మంది కార్లు, బైకులు, ఆటోల్లోనే ప్రయాణిస్తున్నారు.
   
బస్సుల సంఖ్య పెంచాలి..
ప్రస్తుత హైదరాబాద్ అవసరాలకు సుమారు 6 వేల సిటీ బస్సులు కావాలి. కానీ అందులో కేవలం 3 వేల బస్సులే అందుబాటులో ఉన్నాయి. దీంతో బస్సులు సమయానికి రాకపోవడం, వచ్చిన బస్సులు రద్దీగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్తున్నారు. దీంతో చాలామంది టూవీలర్స్ ​వైపు మళ్లుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ ఏడాది చివరికల్లా  2 వేల కొత్త ఈవీ ​బస్సులను సమకూర్చుకోవాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ బస్సులిస్తే పరిస్థితిలో మార్పు వస్తుందని భావిస్తున్నారు. సిటీ శివారులోని  కాలనీలకు ఆర్టీసీ బస్సులు నడిపితే ప్రజా రవాణాలో సిటీ జనం వాటా పెరుగుతుందని చెప్తున్నారు. 

మెట్రోను విస్తరించాలి..
సిటీ ప్రజా రవాణాలో కీలకంగా భావిస్తున్న హైదరాబాద్​ ​మెట్రో ప్రస్తుతం 5 లక్షల మంది ప్రయాణికులకు మాత్రమే సేవలందిస్తున్నది. 2024లో మొత్తం ప్రజారవాణాలో దీని వాటా 3 శాతం మాత్రమే. దీనిని 10 శాతానికి పైగా పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. మెట్రో విస్తరణ పూర్తయితే తప్ప ఇది సాధ్యం కాదు. ఇందులో ఓల్డ్ సిటీ కారిడార్ (ఎంజీబీఎస్​ టు చాంద్రాయణగుట్ట), ఎయిర్‌‌‌‌పోర్ట్ కారిడార్(నాగోల్ టూ శంషాబాద్​), జేబీఎస్​ టు మేడ్చల్​, జేబీఎస్​టు శామీర్‌‌‌‌‌‌‌‌పేట్, నాగోల్- టు ఎల్బీనగర్,  మియాపూర్- టు ఇస్నాపూర్ లాంటి మార్గాలు కీలకం. ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న మెట్రో2 అనుమతులను వీలైనంత త్వరగా పర్మిషన్లు తెచ్చి పనులు ప్రారంభించాల్సి ఉంది.

దీంతోపాటు ప్రస్తుతం ఉన్న 3 మెట్రో మార్గాల్లో చాలా మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్​ ఫెసిలిటీస్​ లేకపోవడం, స్టేషన్ల నుంచి ఇతర ప్రాంతాలకు బస్సు  సౌకర్యం కల్పించకపోవడంతో చాలా మంది సొంత వాహనాలపైనే ఆధారపడ్తున్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో మెట్రో, ట్రాన్స్‌‌‌‌పోర్ట్​ అధికారులు జాయింట్‌‌‌‌గా  ఏర్పాటు చేసిన సమావేశాల్లోనూ ఇదే విషయంపై చర్చించినప్పటికీ బస్సు కనెక్టివిటీ విషయంలో అడుగుముందుకు పడలేదు. ఇలాంటి సమస్యలు పరిష్కరిస్తే సిటీలో పబ్లిక్​ ట్రాన్స్‌‌‌‌పోర్టేషన్​ వాటా పెరిగే అవకాశం లేదు. ఈ దిశగా పలు ప్రతిపాదనలను రవాణాశాఖ అధికారులు సర్కారుకు నివేదిక అందించనున్నట్లు తెలిసింది.