ఆదిపురుష్ థియేటర్లకు చెప్పులు వేసుకుని వెళ్లాలా.. లేదా

ఆదిపురుష్ థియేటర్లకు చెప్పులు వేసుకుని వెళ్లాలా.. లేదా

ఆదిపురుష్(Adipurush).. రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నుంచి వస్తున్న ఫస్ట్ పురాణ కథ. రామాయణాన్ని(Ramayanam) ఈ తరానికి పరిచయం చేస్తూ ఇవాల్టి టెక్నాలజీతో అద్భుతంగా తెరకెక్కించిన సినిమా ఆదిపురుష్. జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వేలాది ధియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇంత వరకు బాగానే ఉంది కానీ.. ఇప్పుడు కొత్త డిస్కషన్ మొదలైపోయింది. అదేంటో తెలుసా.. ఆదిపురుష్ సినిమా ధియేటర్లకు చెప్పులతో వెళ్లాలా లేదా.. చెప్పులు లేకుండా ధియేటర్ లోకి వెళ్లాలా అనే డిస్కషన్ నడుస్తుంది. దీనికి కారణం కూడా హీరో ప్రభాస్.. చిత్ర యూనిట్ చేస్తున్న పనులు. ఇంతకీ వాళ్లు ఏం చేశారా అనేదేగా మీ డౌట్.. 

తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై హీరో ప్రభాస్ తోపాటు.. మిగతా చిత్ర యూనిట్ సభ్యులు, అతిధులు ఎవరూ చెప్పులు వేసుకోలేదు. అందరూ చెప్పులు విప్పి.. కాళ్లతో తిరిగారు. ఇదొక్కటే కాదు.. మొన్నటికి మొన్న. ఆదిపురుష్  టీం ఓ ప్రకటన చేసింది. ప్రతి సినిమా ధియేటర్ లో.. ప్రతి షోలో.. ఓ సీటు హనుమంతుడు.. అదేనండీ ఆంజనేయస్వామికి కేటాయిస్తామని ప్రకటించారు. అంతే ధియేటర్ లో దేవుడు ఉన్నట్లే కదా.. అలాంటి దేవుడుని.. ఓ సీట్లో ప్రతిష్టించినట్లు భావించినప్పుడు.. ఆ సీటు చుట్టూ.. ఆ దేవుడు పక్కన చెప్పులు, బూట్లు వేసుకుని ఎలా వెళతారు.. ఎలా తిరుగుతారు.. ఇదే ఇప్పుడు ఫ్యాన్స్ తో పాటు.. సినీ అభిమానుల్లో చర్చనీయాంశం అయ్యింది.

ఏ గుడికి వెళ్లినా చెప్పులను ఆలయం బయట వదిలి వెళతాం.. అదే విధంగా ఓ సినిమా ధియేటర్ లో.. ప్రతి షోలో.. ఓ సీటును ఆంజనేయస్వామికి కేటాయించటం జరిగినప్పుడు.. ఆలయంగా భావించే ధియేటర్ లోకి చెప్పులతో ప్రేక్షకులు ఎలా వెళతారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇంతటితో ఆగటం లేదు డౌట్స్.. గణేష్ నవరాత్రులు అని హైదరాబాద్ భారీ ఎత్తున చేస్తాం.. వినాయకుడి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజలు చేస్తారు.. ఇది తొమ్మిది రోజులు జరిగే వేడుక అయినా.. భక్తులు ఎవరూ కూడా అక్కడ చెప్పులతో తిరగరు.. ఆ మండపంలోకి చెప్పులతో వెళ్లరు.. ఇది హిందూ సంప్రదాయం.. దేవుడిపై ఉండే భక్తి, భయం.. 

మరి ప్రతి ధియేటర్ లో హనుమంతుడి కోసం సీటు కేటాయిస్తున్నప్పుడు.. అలాంటి చోట ప్రేక్షకులు చెప్పులతో వెళ్లాలా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్నటికి నిన్న తిరుపతి వేదికపైనా ప్రభాస్ చెప్పులు లేకుండా కనిపించారు.. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో పలు అనుమానాలు, సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీన్ని ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారు అనే కంటే.. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు.. ఎలా పాటిస్తారు అనేది చూడాలి... అది తెలియాలి అంటే జూన్ 16వ తేదీ ఫస్ట్ షో వరకు వెయిట్ చేయాల్సిందే.